తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా..
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:15 AM
జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది ఓ టూరిస్టు బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు.
- ఒడిశాలో డివైడర్‌ను ఢీకొన్న టూరిస్టు బస్సు
- ప్రమాదంలో డ్రైవర్ మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
- బాధితులంతా జిల్లా వాసులే
విజయనగరం/నెల్లిమర్ల, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది ఓ టూరిస్టు బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. తీర్థయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద బస్సు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం ఖంతపాడ పోలీసులు, సారిపల్లి గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన టూరిస్టు బస్సులో ఇదే మండలం కొండవెలగాడ, పారసాం గ్రామానికి 40 మంది తొమ్మిది రోజుల కిందట కాశీ తీర్థయాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ బస్సు డ్రైవర్‌గా సారిపల్లికి చెందిన నడిపేన శ్రీనివాసరావు (58) ఉన్నాడు. కాశీ తీర్థయాత్ర ముగించుకుని పూరి జగన్నాథుని దర్శనార్ధం వస్తుండగా శుక్రవారం వేకువజామున 5 గంటలకు ఒడిశా రాష్ట్రం బాలాసోర్ దగ్గర బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో డ్రైవర్ శ్రీనివాసరావు బస్సులోంచి రోడ్డుపైకి ఎగిరిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే కొండవెలగాడ గ్రామానికి చెందిన ముగ్గురికి కాలు, చేతులు విరిగినట్టు తెలిసింది. మరికొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఖంతపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావు కుమారుడు పురుషోత్తం కూడా సుమారు 8 నెలల కిందట జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన కూడా ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేశాడు. కాశీయాత్రలో ఉండగానే ఆ ప్రమాదం జరిగింది. 8 నెలల వ్యవధిలోనే తండ్రీకొడుకులు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ప్రమాద విషయాన్ని నెల్లిమర్ల మండలానికి చెందిన టీడీపీ సీనియర్‌నేత సువ్వాడ రవిశేఖర్, అజయ్‌బాబు, మొయిద శ్రీనివాసరావు కలెక్టర్ వద్దకు వెళ్లి వివరించారు. దీంతో బాలాసూర్ కలెక్టర్‌తో జిల్లా కలెక్టర్ మాట్లాడి యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.