సంక్రాంతికి ఇంటికి వస్తుండగా..
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:54 PM
సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వస్తున్న ఓ వ్యక్తి రైలు కింద పడి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
రైలు కింద పడి వ్యక్తి మృతి
సంతకవిటి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వస్తున్న ఓ వ్యక్తి రైలు కింద పడి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండ లంలోని సోమన్నపేట గ్రామానికి చెందిన బూరాడ భుజంగ రావు(40) గత 20 ఏళ్లగా తెలంగాణ రాష్ట్రంలో బొంతలు కుట్టే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఆనందరావు విజయనగరంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. సంక్రాంతికి భుజంగరావు తన భార్యతో కలిసి సొంత గ్రామానికి వచ్చే క్రమంలో శుక్రవారం సాయంత్రం తెలంగాణలోని కుమురం భీమ్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరు ఎక్కాల్సిన ట్రైన్ రావడానికి సమయం ఉన్నందున, ఇంతలో భుజంగరావు కాలకృత్యాలు తీర్చుకునేందుకు అదే ప్లాట్‌ఫారంపై ఉన్న బళ్లారి- కాజీపేట పాసింజర్ రైలు ఎక్కాడు. ఇంతలో రైలు కదలడంతో ఆతృతతో రైలు నుంచి దిగే క్రమంలో రైలు, ప్లాట్‌ఫారం మధ్య పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య నారాయణమ్మ కళ్ల ముందే అనుకోని ఈ సంఘటన జరగడంతో బోరున విలపించింది. దీంతో సోమన్నపేట గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.