Share News

‘లెంక’ దారెటు?

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:22 PM

నెల్లిమర్ల నగర పంచాయతీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

   ‘లెంక’ దారెటు?
లెంక అప్పలనాయుడు

- స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు

- ఆయన అనుచరులు ఆరుచోట్ల విజయం

- నెల్లిమర్లలో మారిన రాజకీయ సమీకరణలు

నెల్లిమర్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చైర్మన్‌ పదవిని ఆశించిన టీడీపీ సీనియర్‌ నాయకుడు లెంక అప్పలనాయుడు సీట్ల సర్దుబాటులో ఎదురైన పరిణామాలతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం సాధించారు. మరో ఆరుచోట్ల తన అనుచరులను కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి గెలుపించుకోవడం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు టీడీపీ నుంచి 10 మంది, జనసేన నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. కూటమి తరపున బీజేపీ చైర్మన్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన మైపాడ ప్రసాద్‌ ఓటమి చెందారు. దీంతో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అప్పలనాయుడు విజయంతో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. లెంక వర్గం, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు కలిసి పనిచేస్తారా? లేక టీడీపీ, లెంక వర్గాలు వేర్వేరుగా వ్యవహరిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. లెంక వర్గంలోని ఆరుగురు, టీడీపీకి చెందిన 10 మంది కలిస్తే 17 మంది అవుతారు. జనసేనకు చెందిన ఐదుగురు కూడా కలిస్తే కూటమి బలం 22కు చేరుతుంది. అయితే, ఈ వర్గాల మధ్య రాజకీయ అవగాహన ఎలా కుదురుతుందన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. మరో వైపు వైసీపీ కేవలం ఇద్దరు కౌన్సిలర్లతోనే కౌన్సిల్‌కు ప్రాతినిద్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘లెంక’కు పెరిగిన ప్రాధాన్యం

ప్రజాక్షేత్రంలో లెంక అప్పలనాయుడు తన బలాన్ని నిరూపించుకోవడంతో ఇప్పుడు ఆయన రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. మొత్తం 23 వార్డుల్లో కొన్నిచోట్ల లెంకకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఆయా వార్డుల్లో ఇతర పార్టీల కౌన్సిలర్‌ అభ్యర్థులు విజయం సాధించగా చైర్మన్‌ ఓట్లు మాత్రం గంపగుత్తిగా లెంకకు పోలవడం గమనార్హం.

Updated Date - Nov 04 , 2026 | 11:22 PM