ఎక్కడెక్కడ ఉన్నారో..
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:55 PM
ఓటర్ల జాబితాలో పేరుంది.. కానీ వారు ఎక్కడున్నారో తెలియదు.
బొబ్బిలిలో వలస ఓటర్ల కోసం అభ్యర్థుల ఆరా
ఒక్కో వార్డులో సగటున 200 మంది స్థానికేతర ఓటర్లు
దూర ప్రాంతాల్లో ఉన్నవారిని రప్పించేందుకు ప్రయత్నాలు
బొబ్బిలి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాలో పేరుంది.. కానీ వారు ఎక్కడున్నారో తెలియదు. దీంతో మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వలస ఓటర్ల ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. బొబ్బిలి పట్టణంలోని 36 వార్డుల్లో ఒక్కో వార్డుకు సగటున 200 మంది స్థానికేతర ఓటర్లు ఉన్నట్లు అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. వీరిని గుర్తించి పోలింగ్ నాటికి పట్టణానికి రప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
- వలస ఓటర్లలో ఎక్కువమంది ఉపాధి కోసం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లినవారే. వారిని గుర్తించేందుకు అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంటిపేర్ల ఆధారంగా బంధువులను గుర్తించి, వారి ద్వారా ఓటర్ల చిరునామాలను సేకరిస్తున్నారు.
- మరికొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. తమ వార్డుల్లో ఓటర్లుగా నమోదైన వ్యక్తులు ఎక్కడ నివసిస్తున్నారో తెలిసినవారు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కులాలవారీగా ఓటర్లను గుర్తించి, ఆయా కులపెద్దల ద్వారా వారిని సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు.
- వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్లి ఓటు వేయడానికి రావాలని అభ్యర్థిస్తున్నారు. రానుపోను ప్రయాణ ఖర్చులతోపాటు ఇతర తాయిలాలు ఇచ్చేందుకు కూడా కొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటర్ల ఆచూకీ కోసం అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నికల ప్రచారంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.