‘అసమానతలు ఉన్న చోట ఉద్యమాలకు ఆస్కారం’
ABN , Publish Date - May 28 , 2026 | 12:54 AM
సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం ఉద్యమాలు పుడుతూనే ఉంటాయని... శ్రీకాకుళం నక్సల్‌బరి ఉద్యమం చరిత్రలో సజీవంగా ఉండిపోయే ఘట్టమని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి రెవేరా, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోల ఈశ్వరరావు అన్నారు.
పలాస రూరల్, మే 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం ఉద్యమాలు పుడుతూనే ఉంటాయని... శ్రీకాకుళం నక్సల్‌బరి ఉద్యమం చరిత్రలో సజీవంగా ఉండిపోయే ఘట్టమని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి రెవేరా, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోల ఈశ్వరరావు అన్నారు. బొడ్డపాడు లో బుధవారం శ్రీకాకుళం అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహించారు. స్మారక కమిటీ కన్వీనర్ పోతనపల్లి కుసుమ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం కోసం ఉద్యమాలు అనివార్యమని అన్నారు. అణగారిన వర్గాలపై పెత్తందారులు దాడులు చేస్తే ఉద్యమాలు మరింత ఉధృతంగా పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష ్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజాస్వామిక హక్కులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడి జీవితం సంక్షోభంలో చిక్కుకుందన్నారు. ప్రస్తుత కార్పొరేట్ విధానాలకు తలొగ్గుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విప్లవం అవసరమని అన్నారు. కార్యక్రమంలో ముందుగా అరుణపతాకాన్ని ఎగురవేశారు. అమరవీరుల స్మారక మందిర స్థాపన ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విప్లవగీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, కళాకారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.