Share News

Where is the vote? ఓటు ఎక్కడో?

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:21 AM

Where is the vote? లక్కవరపుకోట మండల గోల్జాం గ్రామానికి చెందిన దంపతులు విశాఖ మహానగరంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ సొంత గ్రామంలో ఓట్లు నమోదు చేయించారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇక్కడకు వచ్చి ఓట్లేసేవారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అక్కడ ఓట్లు వేసేవారు. సర్‌ ప్రక్రియ తర్వాత ఇలా కుదరదు. ఈ నేపథ్యంలో ఎక్కడి ఓట్లు తొలగించుకోవాలి.. ఎక్కడి ఓట్లు ఉంచాలి? అనేది వారు తేల్చుకోలేకపోతున్నారు.

Where is the vote? ఓటు ఎక్కడో?

ఓటు ఎక్కడో?

ఇంతవరకు వేర్వేరు చోట్ల ఓటు హక్కు

‘సర్‌’ సర్వేతో ఇతర చోట్ల తొలగింపు

ఎక్కడ వదులు కోవాలో తేల్చుకోలేకపోతున్న ఓటర్లు

ఇరు చోట్లా నాయకుల ఒత్తిడి

సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు

శృంగవరపుకోట, జూలై 11(ఆంధ్రజ్యోతి):

- లక్కవరపుకోట మండల గోల్జాం గ్రామానికి చెందిన దంపతులు విశాఖ మహానగరంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ సొంత గ్రామంలో ఓట్లు నమోదు చేయించారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇక్కడకు వచ్చి ఓట్లేసేవారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అక్కడ ఓట్లు వేసేవారు. సర్‌ ప్రక్రియ తర్వాత ఇలా కుదరదు. ఈ నేపథ్యంలో ఎక్కడి ఓట్లు తొలగించుకోవాలి.. ఎక్కడి ఓట్లు ఉంచాలి? అనేది వారు తేల్చుకోలేకపోతున్నారు.

- కొత్తవలస మండలం తుమ్మకాపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌ కుటుంబం విజయవాడలో నివాసం ఉంటోంది. వీరికి ఓట్లు ఇక్కడ, అక్కడ కూడా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో గ్రామం నుంచి పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తులు వారి ఓట్లు ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు. దశాబ్దకాలంగా విజయవాడలో పరిచయం ఉన్న వారు అక్కడే ఓట్లు ఉంచుకోవాలంటున్నారు. దీనిపై వెంకటేష్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.

- ఇదంతా ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే (సర్‌) తెచ్చిన తంటా. ఇక నుంచి రెండు చోట్ల ఓటు ఉంచడం కుదరదు. ఎక్కడో ఓ చోట మాత్రమే ఉండాలి. రెండు చోట్ల ఓటు ఉన్న వారు ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే (సర్‌)తో ఒకచోట తొలగించుకోవాల్సిందే. డబుల్‌ ఎంట్రీలకు చెక్‌ పడనుంది. అయితే ఎక్కడ ఓటు వదులుకోవాలో తెలియక ఓటర్లు తికమకపడుతున్నారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వేను ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తోంది. జాబితాలో ఉన్న ఓటర్లకు గ్రామాలు, పట్టణాల్లోను బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) ఎన్యూమరేషన్‌ ఫాంలు ఇస్తున్నారు. రెండు ప్రాంతాల్లో వున్న ఓటర్లు తమ ఓట్లను ఎక్కడ వుంచుకోవాలోనన్న ఆలోచనలో పడ్డారు. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి చాలా మంది పట్టణాలకు వలసవెళ్లారు. అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో ఇళ్లులు, పొలాలు వంటి స్థిరాస్తులు వుండడంతో ఇక్కడున్న గ్రామ స్థాయి నాయకులతో పరిచయాలు వదులుకోవడం లేదు. స్థానికంగా లేకపోవడంతో గ్రామాల్లో ఏ పని ఉన్నా అక్కడి నుంచి తక్షణం రాలేని సమయంలో గ్రామాల్లో వున్న నాయకుల సహాయం కోరుతున్నారు. ఇదే విధంగా పట్టణంలో నివాసం వున్న కాలనీలు, ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోనూ పరిచయాలు వుంటున్నాయి. ఆఽధార్‌, రేషన్‌ కార్డులు నివాసం వున్న కాలనీల్లో వుండడంతో పలు సంక్షేమ పథకాలను అందుకొనేందుకు వీరిని వాడుకుంటున్నారు. తమపనులు, అవసరాలు తీర్చుతున్న నాయకులకు, వారు మద్దతు ఇస్తున్న నేతలకు ఓట్లేస్తున్నారు. ఇలా రెండు చోట్ల గెలుపునకు కారణమవుతున్నారు. ఇప్పుడు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా తయారీ (సర్‌) కార్యక్రమంతో రెండింటిలో ఓచోట ఓటును కోల్పోవాల్సి వస్తోంది.

సమీపిస్తున్న ఎన్నికలు

రెండు, మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు రానున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచాయిగా వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నవంబర్‌ లోపే స్థానిక ఎన్నికలు రాబోతున్నట్లు గురువారం విజయవాడలో జరిగిన కీలక నేతల సమావేశంలో చెప్పడం ద్వారా నాయకులను, క్యాడర్‌ను సంసిద్ధులను చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమకు పడతాయన్న ఓట్లు జాబితాలో లేకపోతే గెలుపు తారుమారవుతుందని భావించిన స్థానిక నాయకులు వలసలో వున్న కుటుంబాల ఓట్లను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే ఓట్లు వుంచుకోవాలని ఫోన్‌లు చేసి బతిమాలుతున్నారు. కొందరైతే ఏకంగా బిఎల్‌ఓల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలను తీసుకొని ఓటర్ల దగ్గరకు వెలుతున్నారు. పట్టణాల్లోని కాలనీ నేతలు కూడా ఇదే విధంగా ఓటరును వేడుకుంటున్నారు.

బీఎల్‌వోలకు తప్పని అవస్థలు

వలస ఓట్లు విషయంలో బూత్‌ వెవెల్‌ అధికారులు (బీఎల్‌ఓ)కు అవస్థలు తప్పడం లేదు. 2002 ఓటరు జాబితాలో వున్న చిరునామాల ప్రకారం ఇళ్లకు వెళ్లినప్పుడు అప్పుడున్న ఓటర్లు ఇప్పుడు వుండడం లేదు. అద్దె ఇళ్లల్లో వుంటున్న వీరు తరచూ మారుతున్నారు. కొంత మంది వేరే చోట సొంత ఇళ్లను నిర్మించుకోని వెళ్లిపోయారు. ఉద్యోగ రీత్యా బదిలీలు జరడంతో మరో చోటకు నివాసాలు మార్చాల్సిన పరిస్థితి. వీరిని గుర్తించడం బిఎల్‌ఓలకు కష్టంగా మారింది. ఎన్యూమరేషన్‌ ఫాంలు అందించలేకపోతున్నారు. ప్రస్తుతం వున్న ఓటరు జాబితాలోని కొంత మంది 2002లో ఎక్కడ ఓట్లు వున్నాయో చెప్పలేకపోతున్నారు. ఆ వివరాలు ఎన్యూమరేషన్‌ ఫాంలో నింపేందుకు వీలు కావడం లేదు. ఇలాంటి వారి ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉంది.

Updated Date - Jul 12 , 2026 | 12:21 AM