Maize? మొక్కజొన్నకు ‘మద్దతు’ ఏదీ?
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:30 AM
Where is the ‘Support’ for Maize? నియోజకవర్గంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీ యంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
నిల్వ చేసుకోలేక.. అమ్ముకోలేక అవస్థలు
ఆదుకోవాలని విన్నపం
సీతానగరం, ఏప్రిల్8(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీ యంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాస్తవంగా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే అవకాశం ఉండడంతో ఈ ప్రాంత రైతులు వరి తర్వాత మొక్కజొన్న సాగుకు ఆసక్తి చూపుతు న్నారు. దీనికి సాగునీటి కూడా పెద్దగా అవసరం లేకపోవడంతో పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల రైతులు పత్తి, వేరుశనగ, చెరకును పక్కన పెట్టి కొన్నేళ్లుగా మొక్కజొన్ననే సాగు చేస్తున్నారు. ఈ సారి బలిజిపేట మండలంలో 5,200 ఎకరాలు, సీతానగరంలో వెయ్యి ఎకరాలు, పార్వతీపురం మండ లంలో 500 ఎకరాల్లో సాగు చేపట్టారు. ఎకరాకు రూ.25 వేల వరకూ వెచ్చించారు. అయితే పంట చేతికొచ్చిన సమయానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ధర మరింత క్షీణించడంతో లబోదిబో మంటున్నారు. మరోవైపు జిల్లాలో ఎక్కడా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతన్నలు పంటను దాచుకోలేక, అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. గత ఏడాది క్వింటా ధర రూ. 2,100 నుంచి రూ. 2,300 వరకు ఉండేది. ఈ ఏడాది రూ.1,700 నుంచి రూ.1,800 మధ్య ధర ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో దళారులు రంగ ప్రవేశం చేసి రైతన్నల కష్టాన్ని దోచుకుంటున్నారు. సిండికేట్‌గా ఏర్పడి.. అతి తక్కువ ధరకే కొనుగోలు చేసిన పంటను మైదాన ప్రాంతాల్లో అమ్ముకుని లాభపడుతున్నారు. మొత్తంగా రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నారు. కాగా గత రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురవడంతో పంట ను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై బలిజిపేట మండల వ్యవసాయా ధికారి గణేష్‌ను వివరణ కోరగా.. ‘మొక్కజొన్న రైతుల సమస్యలను అర్థం చేసుకున్నాం. వారి బాధలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.’ అని తెలిపారు.
ఆదుకోవాలి..
వాణిజ్యపరంగా మొక్కజొన్న బాగుంటుందన్న ఉద్దేశంతో పంట వేశాం. అయితే ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరం. అధికారులు, పాలకులు స్పందించి.. రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.
- కె.సత్యనారాయణ, రైతు, మురగడము, బలిజిపేట మండలం