Road ఆ ఊళ్లకు దారేదీ?
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:23 AM
Where Is the Road to Those Villages? జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు ఇంకా అడుగులు పడడం లేదు. దీనికి ప్రధాన కారణం అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడమే. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పలుచోట్ల ప్రధాన గ్రామాలకు అనుసంధాన రోడ్లు కూడా లేవు.
మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రారంభం కాని రోడ్ల నిర్మాణాలు
జాయింట్ సర్వే ఊసెత్తని అధికారులు
గిరిపుత్రులకు తప్పని అవస్థలు
జియ్యమ్మవలస, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు ఇంకా అడుగులు పడడం లేదు. దీనికి ప్రధాన కారణం అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడమే. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పలుచోట్ల ప్రధాన గ్రామాలకు అనుసంధాన రోడ్లు కూడా లేవు. దీంతో 108, 104 వంటి వాహనాలు రావడం లేదు. అత్యవసర వేళల్లో వైద్యసేవలకు గిరిపుత్రులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. వారికి డోలీ మోతలు తప్పడం లేదు.
మంజూరు .. పనులు ఇలా..
- 2025-26లో పీఎం జన్మాన్ ఫేజ్-1లో పాలకొండ, పార్వతీపురం డివిజన్లలో రూ. 47.20 కోట్లతో లక్షలతో 19 రహదారులు మంజూరయ్యాయి. 31.06 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరిగితే గిరిజన ప్రాంతాలకు మహర్దశ పట్టినట్లే. కానీ రెండు, మూడు తప్ప ఇంకా మిగిలిన రోడ్ల పనులు ప్రారంభం కాలేదు. అందులో ఏడు రోడ్లకు అటవీశాఖ అనుమతులు రాలేదు. ఇవన్నీ పాలకొండ డివిజన్‌లో ఉన్నాయి. మొత్తం ఈ ఏడు రోడ్ల నిర్మాణం పొడవు 18.70 కిలో మీటర్లు.
- ఇక 2026-27లో పీఎం గ్రామీణ సడక్ యోజన-4 పథకం ద్వారా రూ. 45.84 కోట్లతో 11 రోడ్లు మంజూరయ్యాయి. 46.31 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ పార్వతీపురం డివిజన్‌లో మంజూరైన ఆరు రోడ్లు అటవీశాఖ అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ రూ. 36.86 కోట్లు. మొత్తంగా 36.95 కిలో మీటర్లు మేర రోడ్డు నిర్మాణాలు జరగాల్సి ఉంది. ఇక పాలకొండ డివిజన్‌లో మంజూరైన ఐదు రోడ్లలో రెండు అటవీశాఖ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి.
- 2023-24లో 19 రోడ్లు మంజూరయ్యాయి. కురుపాం మండలంలో బొడ్డుగాడిగూడ - డోకులగూడ గ్రామాల మధ్య రూ. 2.95 కోట్లతో 2.95 కిలో మీటర్ల మేర రోడ్డు మంజూరయ్యింది. దీనికి కూడా అటవీశాఖ అనుమతులు రావల్సి ఉంది.
- 2024-25లో పంచాయతీరాజ్, షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్ పథకంలో నాలుగు రోడ్లు మంజూరయ్యాయి. పాచిపెంట మండలం గొట్టూరు గ్రామ పంచాయతీ ఆలూరు - రిల్లెపాడు గ్రామాల మధ్య 4 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు మంజూరైంది. ఈ రోడ్డు నిర్మాణానికి కూడా అటవీశాఖ అనుమతి రావల్సి ఉంది.
- 2018-19లో లెఫ్ట్‌వింగ్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ పథకంలో భాగంగా కొమరాడ మండలానికి రూ. 12.86 కోట్లతో 19.81 కిలో మీటర్ల మేర రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే అటవీశాఖ అనుమతులు లేక సర్వపాడు - కొండకూనేరు రోడ్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే గిరి శిఖర గ్రామాలైన నయ, సంకేసు, జీమేసు, బీరుపాడు, గుడ్డం అనే ఐదు గ్రామాలకు రవాణా కష్టాలు తీరుతాయి.
జాయింట్ సర్వేల్లో జాప్యం
ప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని ముఖ్యమైన రహదారులు అటవీశాఖ పరిధిలో ఉన్న భూములు గుండా వెళ్లాల్సి ఉంది. దీనికి అటవీశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగ శాఖలు సంయుక్తంగా సర్వే చేయాల్సి ఉంది. కానీ ఈ జాయింట్ సర్వే కూడా జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని చోట్ల అటవీ భూములు ఉండటం వల్ల కూడా గిరిజనులు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో ఈ రోడ్డు నిర్మాణాలు ఇంకా ప్రారంభం కావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరి జనులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పీఆర్‌ఈయూ ఏఈ షణ్ముఖరావును వివరణ కోరగా.. ‘గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇంకా రాలేదు. అయితే దీనికోసం ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. పీఎం జన్మాన్ బ్యాచ్-1 వరకు జాయింట్ సర్వే అయ్యింది. ఇంకా పీఎంజీఎస్‌వై-4 కోసం లేఖ రాశాం.’ అని తెలిపారు.