Share News

ప్లాస్టిక్‌ నిషేధం ఎక్కడ?

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:47 PM

ఉమ్మడి జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది.

 ప్లాస్టిక్‌ నిషేధం ఎక్కడ?

- జిల్లాలో విచ్చలవిడిగా వినియోగం

- నగరాలు, పట్టణాల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు

- పర్యావరణానికి తీవ్ర ముప్పు

విజయనగరం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దీంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే దర్శనమిస్తోన్నాయి. మానవాళికి ఇది పెను ముప్పుగా మారుతోంది. వాతావరణ సమతూల్యత దెబ్బతింటోంది. క్యాన్సర్‌ వంటి రోగాలకు కారణమవుతోంది. కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు, పండ్ల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర చోట్ల విచ్చల విడిగా ప్లాస్టిక్‌ కవర్లను వాడుతున్నారు. వ్యాపారులు సైతం వాటిని యథేచ్ఛగా ఇస్తున్నారు. బయటకు వచ్చే సమయంలో గుడ్డ సంచులు వెంట తెచ్చుకోవాలన్న అవగాహన ప్రజల్లో పెరగడం లేదు. విజయనగరం నగర పాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల, ఎస్‌.కోట నగర పంచాయతీల్లో అధికారులు గతంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్లాస్టిక్‌ వినియోగంపై ఉక్కుపాదం మోపారు. తరువాత మరిచిపోయారు. జిల్లాలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో రోజుకు 99,183 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. అందులో 175 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉంటోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు పట్టణాల్లో 32,412 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ జరుగుతుండగా, అందులో 55 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉంటోంది.

నిబంధనలు బేఖాతరు..

2022 జూలై 1 నుంచి ప్లాస్టిక్‌ను కేంద్రం పూర్తిగా నిషేధించింది. కానీ, జిల్లాలో అదెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నగర పాలకసంస్థలు, మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విక్రయించాలంటే ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. కానీ, కొందరు ఆ లైసెన్స్‌లు లేకుండానే విక్రయాలు చేపడుతున్నారు. అయినా సరే యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 125 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులనే వినియోగించాలి. ఆలోపు ఉన్నవి పూర్తిగా వినియోగించకుండా నిషేధం విధించింది. కానీ, జిల్లాలో మాత్రం ఆ నిబంధనలు పట్టించుకోవడం లేదు. వాడి పాడేసిన ప్లాస్టిక్‌ సంచులు, థర్మకోల్‌, ప్లాస్టిక్‌ సీసాలతో మురుగు కాలువలు, డంపింగ్‌ యార్డులు నిండిపోతున్నాయి. మురుగు నిలిచి దోమలకు ఆవాసంగా మారుతోంది. రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి.

మానవాళికి ముప్పు..

ప్లాస్టిక్‌ వస్తువులను మితిమీరి వినియోగించడం వల్ల పర్యావరణంతో పాటు మానవాళికి ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. గోనె, కాగిత సంచులు వినియోగించాలని మొరపెట్టుకుంటున్నా ప్రజల చెవికెక్కడం లేదు. అల్పాహార, మాంసాహార హోటళ్లు, ఫుట్‌పాత్‌, టీ దుకాణాల్లో వేడి టీ, కాఫీ, పాలు, కూరలను పాలిథిన్‌ సంచుల్లో పార్శిల్‌ చేస్తున్నారు. ఈ పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్‌, జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాస్టిక్‌ నిషేధంపై యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరంఉంది.

వెరీ డేంజర్‌ ..

పాలిథిన్‌ అనేది వెయ్యి సంవత్సరాలైనా మట్టిలో కలవదు. కూరగాయల వ్యర్థాలు 5 నుంచి నెలరోజుల్లో కలిసిపోతాయి. అరటి తొక్క 24 రోజుల్లో, చెరకు పిప్పి 30 నుంచి 60 రోజుల్లో, కాగితపు కవర్‌ 20 రోజుల నుంచి ఐదు నెలలలోపు, దూది నెల రోజుల నుంచి ఐదు నెలల్లోపు మట్టిలో కలిసిపోతాయి. దారం 3 నుంచి 14 నెలలు, కమలాపండు తొక్క ఆరు నెలలు, ఆకులు ఏడాది, సిగరెట్‌ పీక ఏడాది నుంచి 12 ఏళ్లు, లెదర్‌ షూ 25 నుంచి 45 ఏళ్లు, నైలాన్‌ గుడ్డ 30 నుంచి 40 సంవత్సరాలు, అల్యూమినియం డబ్బాలు 80 నుంచి 100 సంవత్సరాల్లో మట్టిలో కలుస్తాయి. పాలిథిన్‌కు మాత్రం వెయ్యి సంవత్సరాలు పడుతుంది.

అమలుచేస్తున్నాం..

విజయనగరంలో ప్లాస్టిక్‌ నిషేధం పక్కాగా అమలు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. కేసులు సైతం నమోదుచేస్తాం. ప్లాస్టిక్‌ను పారదోలడం అందరి బాధ్యత. లేకుంటే మనిషికి భవిష్యత్‌ అన్నదే ఉండదు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించి ప్లాస్టిక్‌ను మనకు మనమే నిషేధించాలి. వస్త్ర ఉత్పత్తులు, గుడ్డ సంచులు, జూట్‌ ఉత్పత్తులను ఉపయోగించుకుంటే చాలా మంచిది.

-బాలస్వామి కమిషనర్‌, విజయనగరం నగరపాలక సంస్థ

Updated Date - Apr 03 , 2026 | 11:47 PM