Share News

Industrial Development? పారిశ్రామికీకరణ ఏదీ?

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:13 AM

Where Is the Industrial Development? జిల్లా ఏర్పాటై మూడున్నరేళ్లు గడుస్తున్నా.. ఇంకా పారిశ్రామికంగా పార్వతీపురం మన్యం అభివృద్ధి చెందడం లేదు. పరిశ్రమల ఏర్పాటు కలగా మారింది. హడావుడిగా జిల్లాను ఏర్పాటు చేసిన గత వైసీపీ సర్కారు .. పారిశ్రామికీకరణపై దృష్టి సారించలేదు.

  Industrial Development? పారిశ్రామికీకరణ ఏదీ?
సీతంపేట మండలం పనుకువలసలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో కొనసాగుతున్న రహదారుల నిర్మాణం

  • పది మందికి ఉపాధినిచ్చే పరిశ్రమలేవీ?

  • దృష్టి సారించని గత వైసీపీ సర్కారు

  • ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో ఊపందుకోని పనులు

  • పాలకొండ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఖారారు కాని స్థల సేకరణ

  • వలస బాటలో జిల్లా యువత

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, జనవరి6(ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పాటై మూడున్నరేళ్లు గడుస్తున్నా.. ఇంకా పారిశ్రామికంగా పార్వతీపురం మన్యం అభివృద్ధి చెందడం లేదు. పరిశ్రమల ఏర్పాటు కలగా మారింది. హడావుడిగా జిల్లాను ఏర్పాటు చేసిన గత వైసీపీ సర్కారు .. పారిశ్రామికీకరణపై దృష్టి సారించలేదు. ఇక కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతి జిల్లానూ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈ (సూక్ష, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) పార్కుల ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఎంతో ఆనందించారు. జిల్లాలో ఎంతోకొంత పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డారు. అయితే మన్యంలో మాత్రం ఆ పనులు ఊపందుకోవడం లేదు. పట్టుమని పదిమందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటి కూడా జిల్లాలో లేకపోవడంతో స్థానిక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉపాధి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో రామభద్రపురం మండలం కొట్టక్కి, పార్వతీపురం మండలం సందలింగి, గరుగుబిల్లి మండలం సిలకాం పంచాయతీలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. అయితే ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం అడుగులు పడ్డాయి. ఈ మేరకు ఏడాది కిందట ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేశారు. కానీ ఒక్క పాలకొండ నియోజకవర్గంలో మినహాయిస్తే.. మిగతా మూడు నియోజకవర్గాల్లో ఆ ప్రక్రియ సాగలేదు. పార్వతీపురం, కురుపాం, సాలూరులో ఎంఎస్‌ ఎంఈ పార్క్‌లకు సంబంధించి స్థలాలు ఇంకా ఖరారు కాలేదు. కాగా గత ఏడాది మే నెలలో సీతంపేట మండలం పనుకువలస గ్రామం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ అక్కడ మౌలిక వసతులు కల్పించలేదు. సుమారు రూ. ఏడు కోట్లతో చేపట్టాల్సిన అంతర్గత రహదారులు నిర్మాణాలు కూడా పూర్తికాలేదు. ఈ పనులు ఎప్పుటికి పూర్తవుతాయో .. పారిశ్రామికంగా ప్లాట్లు విభజించి ఇంకెప్పుడు ఆన్‌లైన్‌లో పెడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఉపాధి కోసం దూర ప్రాంతాలకు...

స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో జిల్లాకు చెందిన యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు వలసబాట పడుతున్నారు. స్వగ్రామాలను వదిలి దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఐటీఐతో పాటు వివిధ సాంకేతిక విద్యలు పూర్తి చేసిన వారికి కూడా జిల్లాలో ఉపాధి అవకా శాలు లేకుండాపోయాయి. నాన్‌ టెక్నికల్‌ విద్యనభ్యసించిన వారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. స్థానికంగా ఉపాధి లభించక.. దూర ప్రాంతాలకు వెళ్లలేక నానా అవస్థలు పడు తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మన్యం వాసులు కోరుతున్నారు.

స్థలాలు ఖరారు కాలేదు

పాలకొండ మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల నిర్మాణాలకు సంబంధించి స్థలాలు ఖరారు కాలేదు. ప్రస్తుతం సీతంపేట మండలం పనుకువలసలో పార్క్‌కు సంబంధించి అంతర్గత రహదారులు, విద్యుత్‌ పనులు జరుగుతున్నాయి. స్థలాలు ఖరారైన తర్వాత మిగిలినచోట్ల పార్క్‌లు నిర్మాణాలు జరుగుతాయి.

- కరుణాకర్‌, జిల్లా ఇండస్ర్టీయల్‌ మేనేజర్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Jan 07 , 2026 | 12:13 AM