Modernization? ఆధునికీ‘కరుణ’ ఏదీ?
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:16 AM
Where Is the ‘Compassion’ in Modernization? జిల్లాలో నాలుగు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గడువు పూర్తయినా పనులు పూర్తి కాలేదు.
జైకా నిధులు మంజూరైనా కానరాని ఫలితం
బిల్లులు చెల్లించక.. పూర్తికాని పనులు
ఏటా రైతులకు తప్పని సాగునీటి ఇక్కట్లు
కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నపం
జియ్యమ్మవలస, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గడువు పూర్తయినా పనులు పూర్తి కాలేదు. దీంతో ఏటా శివారు ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా వరుణుడిపై ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించి.. ఆధునికీ‘కరుణ’ చూపించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లా పరిధిలో ఉన్న వట్టిగెడ్డ, పెదంకలాం, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాజెక్టుల ద్వారా 61,633 ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉంది. వీటి ఆధునికీకరణకు ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. 2016-17లో టీడీపీ ప్రభుత్వ హయాంలో నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ల బృందం, 2018లో జపాన్ నుంచి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇంజనీర్ల బృందం.. ఈ నాలుగు ప్రాజెక్టులను పరిశీలించింది. ఆధునికీకరణ విషయమై ప్రభు త్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 2019 ఫిబ్రవరిలో జైకా నిధులు మంజూ రయ్యాయి. జైకాతో పాటు ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం-2 సంయు క్తంగా పనులపై బాధ్యత వహించాల్సి ఉంది. అయితే ఏపీలో వీటి ఆధునికీకరణ పనుల పర్యవేక్షణ అంతా ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం-2దే.
- వట్టిగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాజెక్టుల ఆధునికీకరణకు 24 నెలలు, పెద్దగెడ్డ, పెదంకలాం పనులకు 18 నెలలే గడువు ఇచ్చారు. కానీ గడువు పూర్తయ్యే నాటికి కేవలం 15 నుంచి 20 శాతం పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. 2019 నుంచి 2024 మధ్య పరిపాలనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టు ఏజెన్సీలు చేతులెత్తేశాయి. మరోవైపు ఆయా పనులపై అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడిందన్న విమర్శలు లేకపోలేదు. ఈ అంశంపై నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్.అప్పారావును వివరణ కోరగా.. ‘ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల విషయం నాకేమీ తెలియదు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.’ అని తెలిపారు.
వెంగళరాయగసాగర్
సాలూరు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద సువర్ణముఖి నదిపై ఉన్న వెంగళరాయ సాగర్ (వీఆర్‌ఎస్) ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు 21 శాతానికి మించలేదు. 2025, మార్చి 24 వరకు గడువు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2023, ఏప్రిల్ 25 నాటికి ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీఆర్‌ఎస్ ద్వారా మక్కువ, సీతానగరం, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాల్లో మొత్తంగా 24,700 ఎకరాలకు సాగునీరందుతుంది. రూ.63.50 కోట్లతో దీని ఆధునికీకరణకు 2020 జూలై 11న సాంకేతిక ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యపేటలో ఉన్న ఎం/ఎస్ ఎస్‌కేఆర్ కనస్ట్రక్షన్, ఎం/ఎస్ రాజ్‌పద్మ ఇన్ కార్పొరేషన్‌లతో 2020, ఏప్రిల్ 26లో రూ. 48.90 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
వట్టిగెడ్డ
జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీ రావాడ గ్రామం వద్ద ఉన్న వట్టిగెడ్డ ఆధునికీకరణ పనులు 2023, జూన్ నాటికి 15 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 2024, జూలై 7 వరకు గడువిచ్చినా ప్రయోజనం లేకపోయింది. జియ్యమ్మవలస మండలంలోనే ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 16,680 ఎకరాలకు సాగునీరందేలా దీన్ని నిర్మించారు. రూ. 44.85 కోట్లతో దీని ఆధునికీకరణకు 2020, ఆగస్టు19న సాంకేతిక ఆమోదం లభించింది. విజయవ ాడకు చెందిన శ్రీసాయిలక్ష్మి కనస్ట్రక్షన్‌తో 2021 జనవరి 8న నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించారు.
పెదంకలాం
సీతానగరం మండలంలో ఉన్న పెదంకలాం ప్రాజెక్టు పనులు 2023 డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ కేవలం 5 శాతం పనులు మాత్రమే జరగడం శోచనీయం. బలిజిపేట , విజయనగరం జిల్లా వంగర మండలం కలిపి మొత్తంగా 8,253 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతుంది. రూ. 17.30 కోట్లతో ఆధునికీకరణ పనులకు చేపట్టేందుకు 2020, జూన్ 22న సాంకేతిక ఆమోదం లభించింది. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లే దీని పనులు కూడా చేపట్టారు.
పెద్దగెడ్డ
పాచిపెంటలో ఉన్న పెద్దగెడ్డ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు 2023, డిసెంబరు 31 నాటికి పనులు పూర్తికావాలి. కానీ 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పాచిపెంట, సాలూరు, విజయనగరం జిల్లా రామభద్రపురం మండలాల్లో 12 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు 2019, ఫిబ్రవరి 15న రూ. 28.18 కోట్లతో పరిపాలనా ఆమోదం లభించింది. 2020, మే 22న సాంకేతిక అనుమతులు లభించాయి. ఈ పనులు చేపట్టేందుకు గాను హైదరాబాద్‌లో తార్నాకకు చెందిన ఎం/ఎస్ జీవీవీ, వైఎంఎంఆర్ (జేవీ) ముందుకు రాగా.. 2020, జూలై 5లో నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.