where is plats ఏవీ ప్లాట్లు?
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:05 AM
where is plats బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా) పరిధిలోని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మునిసిపాలిటీలలో మధ్యతరగతి వర్గాల కోసం నిర్దేశించిన ధరకు నివాస స్థలాలను అమ్మేందుకు ప్రభుత్వం మూడేళ్ల కిందట జీవో నెంబరు 76 జారీ చేసింది. నేటికీ ఆచరణ మాత్రం లేదు. నియోజకవర్గానికి ఒక ప్రాజెక్టు చొప్పున అధునాతన లేఅవుట్ల ఏర్పాటు కోసం భూసేకరణ చేపడ్తామన్నారు.
ఏవీ ప్లాట్లు?
ప్రశ్నిస్తున్న మధ్యతరగతి వర్గాలు
అటకెక్కిన ‘బుడా’ ప్లాట్ల కేటాయింపు
నియోజకవర్గానికి ఒక లేఅవుట్ అంటూ నాడు ప్రకటన
డిమాండ్ సర్వే పూర్తి చేసినా కొలిక్కిరాని స్థల సేకరణ
బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా) పరిధిలోని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మునిసిపాలిటీలలో మధ్యతరగతి వర్గాల కోసం నిర్దేశించిన ధరకు నివాస స్థలాలను అమ్మేందుకు ప్రభుత్వం మూడేళ్ల కిందట జీవో నెంబరు 76 జారీ చేసింది. నేటికీ ఆచరణ మాత్రం లేదు. నియోజకవర్గానికి ఒక ప్రాజెక్టు చొప్పున అధునాతన లేఅవుట్ల ఏర్పాటు కోసం భూసేకరణ చేపడ్తామన్నారు. లేఅవుట్లు వేసేందుకు లైన్ క్లియర్ అయినప్పటికీ ఇంతవరకు సాలూరు పట్టణంలో తప్ప బొబ్బిలి, పార్వతీపురంలో ఒక్క అడుగు పడలేదు.
బొబ్బిలి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పట్టణాల్లో మధ్య తరగతి వారికి ఇంటి స్థలాల కోసం మూడేళ్ల కిందట డిమాండ్ సర్వే చేశారు. ఆ ప్రకారం బొబ్బిలిలో 2563 మంది, పార్వతీపురంలో 1127 మంది, సాలూరులో 1373 మంది ప్లాట్ల కొనుగోలు కోసం ముందుకొస్తారని ప్రాథమికంగా అంచనా వేశారు. బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గున్నతోటవలసలో సుమారు 50 ఎకరాలను లేఅవుట్ కోసం అధికారులు గుర్తించారు. సాంకేతిక సమస్యలతో అంతలోనే ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఆ తర్వాత కదలికే లేకుండా పోయింది. సొంత ఇంటిని నిర్మించుకుందామని కలలు కన్న మధ్య తరగతి వారు నిరాశ చెందుతున్నారు.
ప్రధానమం త్రి ఆవాస యోజన పథకం మాదిరిగా రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారు బుడా ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నాడు నిర్దేశించారు. 150, 200, 240 చదరపు గజాలుగా మూడు కేటగిరీల్లో స్థలాలను విభజించాలనేది ప్రణాళిక. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ వీటి ధరలను నిర్ణయిస్తుంది. 40, 60 అడుగుల రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అవెన్యూ ప్లాంటేషన్, నీరు, విద్యుత్ ఇతరత్రా అధునాతన సదుపాయాలను పబ్లిక్‌హెల్త్ శాఖ ద్వారా కల్పిస్తారు. ఉన్న స్థలాలకన్నా దరఖాస్తులు అధికంగా వస్తే లాటరీ ద్వారా కేటాయిస్తారు. క్లియర్ టైటిల్‌తో ఎటువంటి వివాదాలకు తావులేని రీతిలో ప్లాట్లను బుడా ద్వారా పొందే అవకాశం ఈ జీవో ద్వారా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ లేఅవుట్‌లో పది శాతం స్థలాలను 20 శాతం రిబేట్‌తో విక్రయిస్తారు. స్థలం సొమ్మును లబ్ధిదారులు ఒకేసారి కాకుండా వాయిదాల్లో చెల్లించవచ్చు. ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చు. స్థలాల కోసం డిమాండ్ అధికంగా ఉంటే ఫేజ్-2, 3 లకు ప్రతిపాదనలుంటాయి. నో ప్రాఫిట్-నో లాస్ ప్రాతిపదికన, రియల్‌ఎస్టేట్ అక్రమాల్లో ప్రజలు చిక్కుకోకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు చేపడుతుంటుంది. పట్టణాలకు సమీపంలో మాత్రమే ఈ లేఅవుట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
- సాలూరు పట్టణంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఎంఐజీ లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పనకు టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదించారు. పార్వతీపురంలో అడ్డాపుశీల దగ్గర స్థలాన్ని గుర్తించారు. కొండకు సమీపంలో ఉండడంతో ఆ లేవుట్‌ను వేరే స్థలంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. బొబ్బిలిలో కూడా స్థల ఎంపిక కొలిక్కి రాలేదు.
సంప్రదింపులు జరుగుతున్నాయి
తెంటు లక్ష్మునాయుడు, బుడా చైర్మన్, బొబ్బిలి
బొబ్బిలి పట్టణంలో ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటు కోసం స్థలం సేకరించేందుకు సంబంధిత యజమానులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అవి ఇంకా కొలిక్కి రాలేదు. స్థల యజమానులు ఎక్కువశాతం స్థలాల వాటా అడుగుతున్నారు. అవసరమైతే ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేసైనా సరే లేఅవుట్ వేయాలని ఆలోచిస్తున్నాం. సాలూరు ఎంఐజీ లేఅవుట్‌లో అభివృద్ధి పనులకోసం టెండర్లను పిలవడానికి ప్రభుత్వ అనుమతిని కోరాం. పార్వతీపురంలో మరో చోట స్థలాన్ని సేకరించేందుకు కసరత్తు జరుగుతోంది.
===============