where is dovelopment in bhogapuram ప్రపంచపటంలో భోగాపురం... అభివృద్ధికి దూరం
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:45 PM
where is dovelopment in bhogapuram - భోగాపురం పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న కోనేరు చెరువును గతంలో మిషన్ అమృత సరోవర్ పథకం కింద సుందరీకరణ కోసం ప్రతిపాదనలు పంపారు. కొలతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఉపాధి హామీలో భాగంగా చెరువు గట్టును వెడల్పు చేశారు తప్ప ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇటీవల అదే చెరువును పల్లెపండగ కార్యక్రమంలో అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏం చేస్తారో చూడాలి.
ప్రపంచపటంలో భోగాపురం... అభివృద్ధికి దూరం
ఎయిర్‌పోర్టుతో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు
గ్రామంలో దయనీయ పరిస్థితులు
కలగా చెరువుల సుందరీకరణ
మౌలిక సదుపాయాలూ కరువు
డిప్యూటీ సీఎం ప్రకటనతోనైనా మారేనా?
- భోగాపురం పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న కోనేరు చెరువును గతంలో మిషన్ అమృత సరోవర్ పథకం కింద సుందరీకరణ కోసం ప్రతిపాదనలు పంపారు. కొలతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఉపాధి హామీలో భాగంగా చెరువు గట్టును వెడల్పు చేశారు తప్ప ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇటీవల అదే చెరువును పల్లెపండగ కార్యక్రమంలో అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏం చేస్తారో చూడాలి.
భోగాపురం, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): భోగాపురం పేరు చెప్పగానే విమానాశ్రయం గుర్తుకొస్తుంది. స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా జీఎంఆర్ సంస్థ నెలకొల్పింది. రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. సమీప ప్రాంతాల్లో ఇతర పరిశ్రమల ఏర్పాటుకూ అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారి ఉండనే ఉంది. కానీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. మౌలిక సౌకర్యాలూ మెరుగుపడడం లేదు. టూరిజం హబ్‌గా మారుతుందని ప్రధాని నుంచి సీఎం వరకూ, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ప్రకటిస్తున్న భోగాపురంలో స్థానికంగా ఆ మార్పు కనీసం కనిపించడం లేదు. చెరువులను అభివృద్ధి చేసినా కూడా భోగాపురానికి కొత్త రోజులు వస్తాయని స్థానికులు భావిస్తున్నారు. భోగాపురం గ్రామంలో ప్రధానంగా గ్రామం మధ్యలో పంచాయతీ కార్యాలయం సమీపంలో క్షీరసాగరం పేరుతో రెండు చెరువులు ఉన్నాయి. వీటి మధ్య రోడ్డు మాత్రమే ఉంది. దాదాపు కలిసే ఉంటాయి. అలాగే చాకివలస వెళ్లే రహదారిలో సింగన్న చెరువు, జాతీయ రహదారిని ఆనుకొని ముక్కాం వెళ్లే రహదారిలో గంగారావి చెరువులు ప్రధానంగా ఉన్నాయి. పంచాయతీ కార్యాలయం వెనుక చెరువు నీటినే గతంలో తాగునీరుగా గ్రామస్థులు ఉపయోగించుకోనేవారు. అయితే తర్వాత రోజుల్లో ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. భోగాపురంలో ఎక్కడా కూడా పార్కులు, సేదతీరే ప్రాంతాలు, ఆహ్లాదకర స్థలాలు లేవు. ఈ నేపథ్యంలోనే చెరువుల అభివృద్ధి అంశం తెరపైకి వచ్చింది.
చెరువు గట్లను వాకింగ్ ట్రాక్‌గా మార్పు చేసి ఫెన్సింగ్ వేసి సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తే చాలా సుందరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారి వచ్చాక ఎన్నికల సమయంలో ఈ అంశం చర్చకు వస్తోంది. నాయకులు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, చెరువుల రూపు మారుస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణ ఉండడం లేదు. పలు మార్లు అధికారులు చెరువుల సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. విశాలమైన చెరువులు ఉన్నా వాటిని పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆ చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. అయినా అధికారుల్లో చలనం ఉండడం లేదు.
- రాష్ట్రంలో చెరువుల సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అలాగే చెరువుల సుందరీకరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విశ్రాంతి, వినోదం, అరోగ్యం, ఆహ్లాదం అందించాలనేదే తమ ధ్యేయమన్నారు.
- ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.50కోట్లతో 105 చెరువుల సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. వీటిలో భోగాపురం చెరువులకు స్థానం లభిస్తుందో లేదో చూడాలి.