ఆ పనులెక్కడ?
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:30 PM
విజయనగరం నగరపాలక సంస్థలో గత పాలకవర్గంలో 1,916 పనులు చేపట్టినట్లు, ఇందుకుగాను అక్షరాలా రూ.264.76 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
- వైసీపీ ప్రభుత్వంలో రూ.264 కోట్లతో చేపట్టినట్లు గణాంకాలు
- విజయనగరం కార్పొరేషన్‌లో ఆ పనులు కనిపించని వైనం
- నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు
విజయనగరం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థలో గత పాలకవర్గంలో 1,916 పనులు చేపట్టినట్లు, ఇందుకుగాను అక్షరాలా రూ.264.76 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పనులు చేసినట్లు కనిపించడం లేదు. కనీసం ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. అభివృద్ధి మాట దేవుడెరుగు నగరపాలక సంస్థకు చెందిన సహజ వనరులు కనిపించకుండా పోయాయి. దొంగలు ఊర్లు పంచుకున్న విధంగా వైసీపీ హయాంలో విజయనగరం నగరపాలక సంస్థను కొందరు నేతలతో పాటు పలువురు కార్పొరేషన్ కాంట్రాక్టర్లు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలకవర్గంలో అడుగడుగునా అవినీతి, అవకతవకలు చోటుచేసుకున్నాయి. వివిధ పన్నుల రూపంలో వసూలు చేసిన వాటితో పాటు ప్రత్యేక నిధుల కైంకర్యం కొనసాగింది. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నాయకులతో పాటు కొందరు అధికారులు, సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
చెరువుల అభివృద్ధి పేరుతో..
విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా ఐదు చెరువుల అభివృద్ధికి కోట్లదీ రూపాయల నిధులు కేటాయించారు. దాదాపు అన్నిచోట్ల అరకొరగానే పనులు సాగాయి. అప్పట్లో వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లుగా బినామీలు అవతారం ఎత్తారు. చెరువుల అభివృద్ధి మాట పక్కన పెడితే.. చాలావరకూ ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధానంగా ఎర్రచెరువు, అశోక్‌నగర్‌లోని భూములు, ఉడా కాలనీలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు అన్యాక్రాంతమయ్యాయి. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కలుపుకొని 100 చెరువులు వరకూ ఉండేవి. కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నవి సగంలోపే కావడం గమనార్హం.. పెద్ద చెరువు గట్లు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు కేటాయించారు. కానీ, కనీస స్థాయిలో కూడా పనులు కొలిక్కి తేలేకపోయారు.
పార్కులను వదల్లే..
నగరవ్యాప్తంగా 80కుపైగా పార్కులు ఉన్నాయి. కానీ ప్రజలు సేదతీరేందుకు కనీసస్థాయిలో ఒక్క పార్కు కూడా పనికిరాలేదు. 25 పార్కుల వద్ద అక్రమ నిర్మాణాలు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రకాశం పార్కు అభివృద్ధికి రూ.1.99 కోట్లు అమృత్‌భారత్ నిధులు కేటాయించారు. అయితే నిబంధనలకు విరోధంగా కేటాయింపులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ రోడ్డు అభివృద్ధికి రూ.2.50 కోట్లు వెచ్చించారు. రెండునెలల్లో వర్షాలు కురవడంతో రోడ్డుపై తారు పెచ్చులుగా ఊడిపోయింది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగర పౌరులు పోస్టులు చేశారు. దీంతో కొద్దీరోజుల్లో తిరిగి ప్యాచ్ వర్కులు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మార్గంలో భారీ గోతులు ఏర్పడ్డాయి. నగరంలో కుళాయిల ఏర్పాటు, కనెక్షన్ల మంజూరు పత్రాలు అందజేత, ఆశీల వసూళ్లు, మొక్కల పెంపకం..ఇలా అడుగడుగునా అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతా ఇష్టారాజ్యంగా..
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే నగరపాలకసంస్థకు ఎన్నికలు జరిగాయి. ఆ పార్టీ 50 డివిజన్లకుగాను 49 చోట్ల విజయం సాధించింది. తిరుగులేని గెలుపుతో, ఆపై రాష్ట్రస్థాయి నాయకుల ప్రాతినిధ్యంతో అవినీతి, అక్రమాలను ఇష్టారాజ్యంగా తెరలేపారన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి పనుల కేటాయింపు, టెండర్ల ఖరారు, చెల్లింపులు, నిధుల కేటాయింపులు ఇలా అన్నీ ఏకపక్షంగా అప్పట్లో సాగేవి. సుమారు 30 మంది కాంట్రాక్టర్లు అధికార పార్టీ అండదండలతో సిండికేట్‌గా మారి పనులు పంచుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలామంది కార్పొరేటర్ల బంధువులే కాంట్రాక్టర్లు కావడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. అభివృద్ధి పనుల్లో కనీస నాణ్యత పాటించేవారు కాదు. చివరకు చెత్త తరలింపు వాహనాల వినియోగం, డీజిల్ ఖర్చుల్లో కూడా చేతివాటం ప్రదర్శించేవారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ హయాంలో విజయనగరం కార్పొరేషన్‌లో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిందనే విమర్శలు ఉన్నాయి.