భూసార కార్డులేవీ?
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:19 AM
జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి పనులు మొదలయ్యాయి. ఇంకోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఎక్కడికక్కడే లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్నిరకాల పంటలపై అవగాహన కల్పిస్తున్నారు.
భూసార కార్డులేవీ?
కార్యాలయాల్లోనే కార్డులు
ఇంకా రైతులకు చేరని వైనం
వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం
అన్నదాతలకు సరైన నిర్దేశం కరువు
విజయనగరం, జూలై 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి పనులు మొదలయ్యాయి. ఇంకోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఎక్కడికక్కడే లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్నిరకాల పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు.. కానీ భూసార పరీక్షలకు సంబంధించిన కార్డులు అందించలేదు. అవి ఎక్కడికక్కడ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల్లో మూలుగుతున్నట్లు సమాచారం.
ఏటా ఖరీఫ్, రబీ పంటలకు ముందు ఈ భూసార పరీక్షలు తప్పనిసరి. జిల్లాలో రబీ కంటే ఖరీఫ్‌లో పంటలు ఎక్కువగా పండిస్తారు. రబీలో ఆరుతడి, వాణిజ్య పంటలు వేస్తారు. కానీ ఈ రెండు సీజన్లలో అసలు భూసార పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. ఏదో చేస్తున్నారు అన్నట్టు ప్రక్రియను ముగిస్తున్నారు. నమూనాలు తీసుకువెళ్లి ఫలితాలు అందివ్వడం లేదు. సిద్ధమైన కార్డులను కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదు. జిల్లాలోని 27 మండలాల్లో 28,392 మట్టి నమూనాలు గత ఖరీఫ్‌లోనే సేకరించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో మండలాల వారీగా లక్ష్యాలను విధించారు. అయితే లక్ష్యం మేరకు సేకరించలేదని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కొన్ని మండలాల్లో మట్టి నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి పంపించారే తప్ప రైతులకు ఫలితాల కార్డులు అందించలేదు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లక్ష్యాలను విధించారు. సాధారణంగా మేలో వేసవి దుక్కులు, జూన్‌లో వరి విత్తనాలు వేయడంతో ఖరీఫ్ ప్రారంభం అవుతుంది. అదే సమయంలో మెట్ట ప్రాంతంలో.. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. దానికి కూడా ఎలాంటి భూమిలో వేస్తే దిగుబడి వస్తుంది? దుక్కులు ఎలా చేయాలి? ఏ ఎరువు వాడాలి? అనే విషయాలు భూసార పరీక్షలు ద్వారానే తెలుస్తాయి. ఖరీఫ్ పనులు మొదలైనా ఇంతవరకూ భూసార పరీక్షలకు సంబంధించిన కార్డులు అందించలేదు.
జీపీఎస్ యాప్‌తో..
జిల్లా వ్యాప్తంగా గతంలో నిర్వహించిన భూసార పరీక్షల్లో ప్రధానంగా సేంద్రియ కర్బనం, నత్రజని, జింక్, ఐరన్ లోపాలను గుర్తించారు. మరోసారి సమగ్రంగా భూసార పరీక్షలు చేపడితే భూమిలో నత్రజని, మాంగనీసు, బోరాన్, జింక్, ఇనుము, పొటాష్, రాగి, భాస్వరం, ఉదజని, ఇతర సూక్ష్మ పోషకాలు ఎంతమేర ఉన్నయో తెలుస్తుంది. పైగా ఈ సారి పక్కాగా నిర్వహించేందుకు జీపీఎస్ యాప్‌ను తీసుకొచ్చారు. పొలంలో నమూనా సేకరణకు సంబంధించి అంతా కనిపించేలా రైతుతో సెల్ఫీ ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఖరీఫ్, రబీలకు సంబంధించి కనీసం మూడు, గరిష్టంగా ఆరు పంట భూముల్లో పరిశీలించాలని.. గతంలో సేకరించిన భూములకు వెళ్లకూడదని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ శాఖకు సంబంధించి బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, రాజాం, విజయనగరం సబ్ డివిజన్లు ఉన్నాయి. సిద్ధమైన భూసార కార్డులైనా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.
భూసార కార్డులివ్వాలని ఆదేశించాం
భూసార ఫలితాలకు సంబంధించిన కార్డులను అందించాలని సిబ్బందిని ఆదేశించాం. సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలి. సూక్మపోషకాల లోపాలను గుర్తించి రైతులను అప్రమత్తం చేస్తాం. అంతిమంగా పంట దిగుబడులు పెంచడమే లక్ష్యం. మోతాదుకు మించి ఎరువులు, రసాయనాలను వినియోగించకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకూ 11వేల నమూనాలను పరీక్షించి రైతులకు ఫలితాలు అందజేశాం. మిగిలిన నమూనాలను పరిశీలించి రైతులకు అందజేయాల్సి ఉంది.
వీటి రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి