Share News

Where are the library employees ఉద్యోగాలకు పోటీ పడే చోట ఉద్యోగులేరీ?

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:00 AM

Where are the library employees పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఆసరాగా నిలుస్తూ.. యువత ఉద్యోగ సాధనలో కీలక పాత్ర పోషించే గ్రంథాలయాల నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలంటే లైబ్రరీ ఉద్యోగులుండాలి. కానీ కీలక పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి.

Where are the library employees ఉద్యోగాలకు పోటీ పడే చోట  ఉద్యోగులేరీ?
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులు

ఉద్యోగాలకు పోటీ పడే చోట

ఉద్యోగులేరీ?

గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత

చాలని లైబ్రేరియన్లు

సుమారు 50 పోస్టులు వరకు ఖాళీ

ఒకరు.. రెండుచోట్ల విధులు

భారంగా నిర్వహణ

దాసన్నపేట, సెప్టెంబరు12 (ఆంధ్రజ్యోతి): పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఆసరాగా నిలుస్తూ.. యువత ఉద్యోగ సాధనలో కీలక పాత్ర పోషించే గ్రంథాలయాల నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలంటే లైబ్రరీ ఉద్యోగులుండాలి. కానీ కీలక పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. జిల్లాలో ప్రభుత్వ గ్రంథాయాల్లో లైబ్రేరియన్‌లతో పాటు అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, ఇతరత్రా పోస్టులు 86 ఉండగా.. అందులో 36 మందే విధులు నిర్వహిస్తున్నారు. 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న సిబ్బందితో గ్రంథాలయాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఏళ్ల తరబడి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. కొన్నిచోట్ల స్వీపర్లే కీలక ప్రాత పోషిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం గ్రేడ్‌-2, గ్రేడ్‌-3, సహాయకులు, రికార్డు అసిస్టెంట్లు ఆఫీస్‌ సహయాకులు, స్వీపర్లు వంటి వారు 86 మంది ఉండాలి. కానీ 36 మంది మాత్రమే ఉంటున్నారు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ఉమ్మడి జిల్లాలో డిస్ర్టిక్ట్‌ సెంట్రల్‌ లైబ్రరితో పాటు 40 శాఖ గ్రంథాలయాలున్నాయి. ఇందులో ద్వితీయ శ్రేణి కింద ఎస్‌.కోట, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి గ్రంథాలయాలు ఉన్నాయి. కెల్ల, రెల్లివలస, జరజాపుపేట రూరల్‌ లైబ్రరీలుగా కొనసాగుతున్నాయి. 33 గ్రామీణ గ్రంథాలయాలుగా ఉన్నాయి. విజయనగరంలోని కేంద్ర లైబ్రరీకి రోజుకు 700 నుంచి 1000 మంది వస్తుంటారు. మిగిలిన చోట్ల 200 మంది సగటున పాఠకులు ఉంటారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 55 వేలు, మిగతాచోట్ల 35 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నారు. మ్యాగజైన్లు, రోజువారీ దినపత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. కానీ సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయడం లేదు.

జాడలేని డిజిటల్‌ గ్రంథాలయాలు..

వైసీపీ హయాంలో డిజిటల్‌ గ్రంథాలయాలంటూ హడావుడి నడిచింది. కానీ ఒక్కచోట కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకుపైగా డిజిటల్‌ గ్రంథాలయాలను మంజూరు చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి ఉపాధి హామీ నిధులను రూ.16 లక్షలు కేటాయించారు. ఒక్కచోట కూడా నిర్మాణం పూర్తిచేయలేకపోయింది. డిజిటల్‌ గ్రంథాలయాలు నిర్మిస్తున్నామని చెప్పి ఉన్న గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేశారు. కూటమి వచ్చిన తరువాత గాడినపెట్టే ప్రయత్నం చేస్తోంది.

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లాలో లైబ్రేరియన్లు, ఇతర సిబ్బంది కొరతకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించాం. గ్రంథాలయాల పనివేళలు మార్చాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ తెరిచే విధంగా ఆదేశాలు ఇచ్చాం. వీలైనంత వరకూ సమస్యలు పరిష్కరిస్తున్నాం. త్వరలోనే సిబ్బందిని భర్తీ చేసే అవకాశం ఉంది.

- డొంకాడ రామకృష్ణ, చైర్మన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ, విజయనగరం

Updated Date - Sep 13 , 2026 | 12:00 AM