Share News

When Will They Give It? ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - May 20 , 2026 | 11:32 PM

When Will They Give It? జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. పెండింగ్‌ బిల్లులు నేటికీ మంజూరు కాకపోవడంతో కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

When Will They Give It? ఎప్పుడిస్తారో?

  • ఎదురుచూపుల్లో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులు

  • గత వైసీపీ సర్కారు హయాంలో తీవ్ర అన్యాయం

  • ఆర్థిక ఇబ్బందులతో సతమతం

  • ఆశలన్నీ కూటమి ప్రభుత్వంపైనే..

పార్వతీపురం, మే20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. పెండింగ్‌ బిల్లులు నేటికీ మంజూరు కాకపోవడంతో కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో 4,030 మందికి ఇళ్లు మంజూరు చేశారు. అప్పట్లో కొంత మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కేవలం 93 మంది మాత్రమే పనులు ప్రారంభించ లేదు. బీబీఎల్‌ స్టేజ్‌లో 230, బీఎల్‌ స్టేజ్‌లో 880, ఎల్‌ఎల్‌ స్టేజ్‌లో రెండు, ఆర్‌ఎల్‌ స్టేజ్‌లో 327, ఆర్‌సీ స్టేజ్‌లో 1962 ఇళ్లు ఉన్నాయి. మొత్తంగా 562 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలను పూర్తి చేశారు. వారికి రూ.36.37 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రూ. 24.20 వరకు చెల్లించింది. మరో రూ.12.17 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ లోపు ఎన్నిక లొచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకూడదని నిర్ణయించింది. అంతేకాకుండా కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారు. కొద్దిమంది మాత్రమే అప్పులు చేసి గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ఇంతవరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అప్పులు వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు.

ప్రభుత్వం దృష్టి సారించినా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలపై దృష్టి సారించింది. లబ్ధిదారులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లుల వివరాలు పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు 2025, సెప్టెంబరు 26న జిల్లా అధికారులు ప్రభుత్వానికి ఆ వివరాలను పంపించారు. కానీ నేటివరకు బిల్లుల చెల్లింపులు జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిం చాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై జిల్లా ఇన్‌చార్జి గృహ నిర్మాణ శాఖాధికారి దిలీప్‌ చక్రవర్తిని వివరణ కోరగా.. ‘ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు కోసం గృహనిర్మాణశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లేఖ రాశాం. నిధులు మంజూరైన వెంటనే చెల్లిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 11:32 PM