When Will They Change It? ఇంకెప్పటికి మారుస్తారో?
ABN , Publish Date - May 17 , 2026 | 11:45 PM
When Will They Change It? జిల్లాలో చాలాచోట్ల ఇంకా గ్రామ సచివాలయాల పేర్లు మారలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా గ్రామ పంచాయతీ లను గ్రామ సచివాలయాలుగా మార్చింది. అవసరాన్ని మించి సిబ్బందిని నియమించి తీవ్ర విమర్శల పాలైంది.
మూడు నెలలవుతున్నా మారని వైనం
పాలకొండ, మే17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలాచోట్ల ఇంకా గ్రామ సచివాలయాల పేర్లు మారలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా గ్రామ పంచాయతీ లను గ్రామ సచివాలయాలుగా మార్చింది. అవసరాన్ని మించి సిబ్బందిని నియమించి తీవ్ర విమర్శల పాలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళనకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. పంచాయతీ, పట్టణాల్లోని జనాభా, ఆదాయం, ఇతర అంశాలు ఆధారంగా ఆయా సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది అవసరమో గుర్తించి అదనంగా ఉన్న సిబ్బందిని ఇతర శాఖలకు సర్దుబాటు చేసింది. సచివాలయాల పర్యవేక్షణ కోసం మండలస్థాయి ప్రత్యేక అధికారిని నియమించింది. డివిజన్ స్థాయిలో డిఎల్‌డీవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా సాఫీగా జరుగు తున్నప్పటికీ సచివాలయాల పేరు మార్పు విషయంలో మాత్రం అధికార యంత్రాంగం ఎందుకు తాత్సారం చేస్తుందో తెలియం లేదు. కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా పేర్లు మార్చుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇంతవరకు భవనాల పేర్లు మార్చని కొంతమంది అధికారులు కాగితాల్లో మాత్రమే స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. జిల్లాలో 451 గ్రామ పంచాయతీలతో పాటు పాలకొండ, పార్వ తీపురం, సాలూరులో 55 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 350 గ్రామ, వార్డు సచి వాలయా లున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో వాటి పేర్లు మారలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై డ్వామా పీడీ రామచంద్రరావును వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.