Share News

When Will They Be Released? ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:58 PM

When Will They Be Released? సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు పంపిణీ చేయాల్సిన పవర్‌ టిల్లర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గడిచిన మూడు నెలలుగా ఇవి తురాయిపువలస హెచ్‌ఎన్‌టీసీ ఫారంలో ఎండకు ఎండి.. వానకు తడుస్తున్నాయి.

When Will They Be Released? ఎప్పుడిస్తారో?
హెచ్‌ఎన్‌టీసీ ఫారంలో నిరుపయోగంగా పడి ఉన్న పవర్‌ టిల్లర్లు

  • ప్రస్తుతం నిరుపయోగంగా మారిన వైనం

  • తక్కువ సామర్థ్యం కలిగినవి సరఫరా చేయడంపై మల్లగుల్లాలు

  • ట్రైకార్‌కు నివేదించిన ఐటీడీఏ అధికారులు

  • ఇంకా అక్కడి నుంచి రాని క్లారిటీ

  • ఖరీఫ్‌ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఆశగా ఎదురుచూస్తున్న గిరిజన రైతులు

సీతంపేట, జూలై20(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు పంపిణీ చేయాల్సిన పవర్‌ టిల్లర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గడిచిన మూడు నెలలుగా ఇవి తురాయిపువలస హెచ్‌ఎన్‌టీసీ ఫారంలో ఎండకు ఎండి.. వానకు తడుస్తున్నాయి. తప్పు పట్టే స్థితికి చేరుతున్నాయి. వాటితో పాటు వచ్చిన మినీట్రాక్టర్లు, పవర్‌వీడర్లు, ఆయిల్‌ ఇంజన్లను కొద్ది రోజుల కిందటే పంపణీ చేశారు. అయితే పవర్‌టిల్లర్ల పంపణీపై మాత్రం సందిగ్ధం నెలకొంది. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవడంతో వాటి కోసం గిరిజన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- ట్రైకార్‌ ద్వారా సెంట్రలైజ్‌డ్‌(కేంద్రీకృత) టెండరింగ్‌ విధానం, ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్‌(కేంద్ర ఉపప్రణాళిక)నిధులతో వ్యవసాయ యంత్ర పరికరాలను ఐటీడీఏలకు సరఫరా చేశారు. కాగా సీతంపేట ఐటీడీఏకు వచ్చిన 28 పవర్‌టిల్లర్ల కోసం సుమారు 200కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నో ఏళ్లకు రాయితీ పథకాలు తమకు అందుతాయని గిరిజన రైతులు సంబరపడ్డారు. అయితే పంపిణీ పూర్తికాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

- ఈప్రాంత గిరిజన రైతులకు అవసరమైన స్పెషిఫికేషన్స్‌తో పాటు సామర్థ్యం కలిగిన 15హెచ్‌పీ(హార్సపవర్‌)కలిగిన పవర్‌టిల్లర్లు కావాలని గతంలో ట్రైకార్‌కు ఐటీడీఏ హార్టికల్చర్‌ అధికారులు నివేదించారు. కానీ వారు పంపిన ప్రతిపాదనలను పక్కన పెట్టి కేంద్రీకృత టెండరింగ్‌ విధానం ద్వారా 13హెచ్‌పీ సామర్థ్యం కలిగిన స్రాచీ కంపెనీకి చెందిన 28 పవర్‌టిల్లర్లను సీతంపేట ఐటీడీఏకు సరఫరాచేశారు.

- వాస్తవంగా కొండపోడు వ్యవసాయంతో పాటు కొండ ప్రాంతంలో ఉండే భూముల్లో దుక్కులు చేసేందుకు అధిక సామర్థ్యం కలిగిన పవర్‌టిల్లర్లను వినియోగిస్తారు. అయితే తక్కువ హార్స్‌పవర్‌ కలిగిన పవర్‌టిల్లర్లను సరఫరా చేయడంపై గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో వాటిని రైతులకు పంపిణీ చేసేందుకు అధికారులు సాహసించ లేకపోయారు.

- 15హెచ్‌పీ పవర్‌టిల్లర్‌కు ప్రభుత్వం రూ.2.58లక్షలు చెల్లిస్తున్నప్పుడు అదే ధరకు 13హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పవర్‌టిల్లర్లను ఎలా సరఫరా చేశారో ట్రైకార్‌ అధికారులే చెప్పాల్సి ఉంది.

- రాష్ట్రస్థాయిలో ఉన్న ట్రైకార్‌ విభాగం అధికారులు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల రూ.72.24లక్షల విలువ చేసే పవర్‌టిల్లర్లు ప్రస్తుతం సీతంపేట ఐటీడీఏలో పంపిణీ జరగ్గా మూలనపడి ఉన్నాయి. దీంతో ఐటీడీఏ అధికారులు మల్లగుల్లాలు పడి వాటి పంపిణీపై క్లారిటీ కోసం ట్రైకార్‌కు నివేదించారు. అక్కడి నుండి ఇంకా ఎటువంటి క్లియరెన్స్‌ రాలేదు.

యంత్ర పరికరాల్లో డొల్లతనం

పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు సరఫరా అయిన యంత్ర పరికరాల్లో డొల్లతనం బయటపడడంతో గిరిజన రైతులు వాటిని తీసుకునేందుకు వెనకడుగు వేశారు. అయితే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడం, 90శాతం సబ్సిడీ ఇవ్వడం, అధికారులు కూడా సర్దిచెప్పి ఒప్పించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గిరిజన రైతులు వీటిని తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే పవర్‌టిల్లర్ల పంపిణీ విషయంలో నేటికీ స్పష్టత రాకపోవడంతో గిరిజన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పీహెచ్‌వో ఏమన్నారంటే....

‘వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా సీతంపేట ఐటీడీఏకు కేంద్రీకృత టెండరింగ్‌ విధానం ద్వారా సరఫరా అయిన వ్యవసాయ యంత్ర పరికరాలను చాలా వరకు రైతులకు పంపిణీ చేశాం. అయితే పవర్‌టిల్లర్ల హార్స్‌పవర్‌లో వ్యత్సాసం ఉన్న కారణంగా ట్రైకార్‌కు నివేదిక పంపించాం. అక్కడి నుంచి క్లియరెన్స్‌ వచ్చిన వెంటనే గిరిజన రైతులకు వాటిని పంపిణీ చేస్తాం.’ అని హార్టికల్చర్‌ అధికారి ఎస్‌వీ గణేష్‌ చెప్పారు.

Updated Date - Jul 20 , 2026 | 11:58 PM