Share News

లెక్క చెప్పేదెప్పుడో?

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:41 PM

పశువులకు మెరుగైన వైద్యం అందాలంటే ప్రభుత్వం వద్ద పశు గణన నివేదిక కచ్చితంగా ఉండాలి.

లెక్క చెప్పేదెప్పుడో?

- పశు గణన పూర్తయి ఏడాది

- ఆ నివేదికను బహిర్గతం చేయని వైనం

- 2019 పశు గణన ప్రకారమే ఇంకా పశు వైద్య సేవలు

- తలెత్తుతున్న అనేక ఇబ్బందులు

జియ్యమ్మవలస, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పశువులకు మెరుగైన వైద్యం అందాలంటే ప్రభుత్వం వద్ద పశు గణన నివేదిక కచ్చితంగా ఉండాలి. ఆ లెక్క ద్వారానే మూగ జీవాలకు అవసరమైన మందులు, వైద్యం సక్రమంగా అందించేందుకు వీలుంటుంది. అయితే, ఇందుకు సంబంధించి పశు గణన చేపట్టి ఏడాది పూర్తయినా ఇంకా ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. దీంతో 2019 పశు గణన ప్రకారమే వైద్య సేవలు కొనసాగుతున్నాయి.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 15 మండలాల పరిధిలో 450 పంచాయతీలు ఉన్నాయి. పాలకొండ, సీతంపేట, గరుగుబిల్లి, పార్వతీపురం, కురుపాం, సాలూరు, సీతానగరంలో పశు వైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 38 పశు వైద్య చికిత్సాలయాలు (వెటర్నరీ డిస్పెన్సరీలు), 35 గ్రామీణ పశు యూనిట్లు (ఆర్‌ఎల్‌యూ) ఉన్నాయి. వీటన్నిటిలో 2019 పశు గణన ప్రకారమే మూగ జీవాలకు వైద్య సేవలు అందుతున్నాయి. అప్పుడు జిల్లాల విభజన కూడా జరగలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని మండలాలను వేరు చేసి పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పాటు చేశారు. 2019 పశు గణన ప్రకారం జిల్లా పరిధిలో 2019 పశు గణన ప్రకారం ఆవులు 2.29 లక్షలు, గేదెలు 47 వేలు, గొర్రెలు 2.07 లక్షలు, మేకలు 1.73 లక్షలు, కోళ్లు 8.11 లక్షలు కలిపి మొత్తం పశు సంపద 14.67 లక్షలు ఉన్నాయి. దీని ప్రాప్తికే ఇప్పుడు పశు వైద్య సేవలు అందుతున్నాయి. కానీ నూతన పశు గణన లెక్కలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయకపోవడంతో పశు సేవల్లో కొంత ఇబ్బంది అవుతుందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

నూతన పశు గణన పూర్తయి ఏడాది

పశు గణన ప్రతీ ఐదేళ్లకొకసారి జరుగుతుంది. అఖిల భారత పశు గణన ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాడి రంగాన్ని మెరుగుపర్చడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూప కల్పన, అమలు, పర్యవేక్షణకు పశుగణన ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, గుర్రాలు, పక్షులు, కోళ్లతో సహా 16 రకాల పెంపుడు జంతువుల సమాచారం సేకరిస్తారు. జిల్లాలో 2024 అక్టోబరు 25 నుంచి పశు గణన ప్రారంభమై 2025 ఫిబ్రవరి 28 వరకు జరిగింది. ఏడుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, 25 మంది పశు వైద్యాధికారులు, 296 మంది ఎన్యూమరేటర్లు జిల్లాలోని 2.34 లక్షల గృహాలను సందర్శించి పశు గణన చేపట్టారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. కానీ, ఇంత వరకు ఆ లెక్కను ప్రకటించలేదు. ఇప్పటికైనా పశు సంపద ఎంత ఉందో బహిర్గతం చేయాలని పాడిరైతులు కోరుతున్నారు.

నివేదిక అందించాం

పశు గణనకు సంబంధించి స్పష్టమైన నివేదిక ప్రభుత్వానికి అందజేశాం. ప్రస్తుతం జిల్లాలో పశు సంపదకు కావల్సిన మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు. తుది నివేదిక కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికోసం ఎదురు చూస్తున్నాం.

డాక్టర్‌ శివ్వాల మన్మధరావు, జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌, పశు సంవర్ధకశాఖ, మన్యం జిల్లా

Updated Date - Mar 26 , 2026 | 11:41 PM