Medical College వైద్య కళాశాల నిర్మాణమెప్పుడు?
ABN , Publish Date - May 03 , 2026 | 12:10 AM
“When Will the Medical College Be Built? జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. నేటికీ అధికారికంగా స్థల ఎంపిక ఖరారు కాకపోవడంతో అసలు పనులు జరుగుతాయా? లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ప్రభుత్వం చొరవ చూపాలని జిల్లావాసుల విన్నపం
పార్వతీపురం, మే2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. నేటికీ అధికారికంగా స్థల ఎంపిక ఖరారు కాకపోవడంతో అసలు పనులు జరుగుతాయా? లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే జిల్లావాసులకు ఆధునిక వైద్యసేవలు అందుతాయి. ఇక్కడి వైద్య విద్యార్థులకు కూడా ఇక్కట్లు తప్పుతాయి. పొరుగు జిల్లాలకు పరుగులెత్తాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా జిల్లాకు ఎంతో కీలకమైన వైద్య కళాశాల నిర్మాణంపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
- జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో అధికారులు గరుగుబిల్లి మండలంలో స్థలాన్ని కూడా పరిశీలించారు. కానీ శంకుస్థాపన కూడా చేయలేకపోయారు. గత ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణంపై దృష్టి సారించలేదు. దీంతో ప్రజలు ఎంతో నిరాశ చెందారు.
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని.. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాల నిర్మాణానికి ఇంకా మొదటి దశ అడుగులు కూడా పడలేదు. దీంతో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. ఇంకెప్పటికి పూర్తవుతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
- పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తులు ముందుకొచ్చే పరిస్థితి ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మారుమూల జిల్లాలో ప్రైవేటు వ్యక్తులు పెద్దఎత్తున పెట్టుబడులు పెడతారా? అన్నది కూడా సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చొరవ చూపాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
- మొదటి విడతగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైద్య కళాశాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే రెండో విడతలో మన్యం జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణాలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఆ దిశగా ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లాపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వైద్య కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై ఏపీఎంఐడీసీ డీఈ సిమ్మన్నను వివరణ కోరగా.. గతంలో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో గుర్తించిన స్థలంలోనే వైద్య కళాశాల నిర్మాణం చేపడతామని తెలిపారు.