Share News

లస్కర్ల భర్తీ ఎప్పుడో?

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:51 PM

సాగునీటి వ్యవస్థలో లస్కర్ల పాత్ర చాలా కీలకం. అయితే నాలుగు దశాబ్దాలుగా లస్కర్ల పోస్టులు ఖాళీ అవుతున్నా వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడంలేదు.

లస్కర్ల భర్తీ ఎప్పుడో?
ఆండ్ర ప్రాజెక్టు

- ఆండ్ర ప్రాజెక్టు పరిధిలో ఏడు పోస్టులు ఖాళీ

- ఇతర పోస్టులు మరో ఏడు..

- ఏళ్ల తరబడి పట్టించుకోని ప్రభుత్వాలు

- సాగునీటి సరఫరాలో సమస్యలు

గజపతినగరం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సాగునీటి వ్యవస్థలో లస్కర్ల పాత్ర చాలా కీలకం. అయితే నాలుగు దశాబ్దాలుగా లస్కర్ల పోస్టులు ఖాళీ అవుతున్నా వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడంలేదు. ఆండ్ర ప్రాజెక్టు పరిధిలో లస్కర్లతో పాటు ఇతర పోస్టులు 14 వరకు ఖాళీ ఉన్నాయి. దీంతో సాగునీటి సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఆండ్ర ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా మెంటాడ, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండలాల్లోని 9,600 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీని పరిధిలో 13 వంతుల కాలువ, బీవీ చానల్‌, ఎంఎన్‌ చానల్‌ కూడా ఉన్నాయి. 1999లో ఆండ్ర ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అప్పట్లో ఇరిగేషన్‌ శాఖలో విధులు నిర్వహించిన వారిలో చాలామంది రిటైర్డ్‌ అయ్యారు. అయితే, నేటికీ ఆ పోస్టులు భర్తీ కావడం లేదు. దీంతో సాగునీటి కాలువల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆండ్ర ప్రాజెక్టుకు సంబంధించి 14 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో లస్కర్లు-7, ఎలక్ట్రీషియన్‌ -1, హెల్పర్‌లు-2,ఆపరేటర్‌-1, ఫిట్టర్‌-1, వాచ్‌మెన్‌ -2 పోస్టులు ఉన్నాయి. మెయిన్‌ కెనాల్‌కు ప్రతి ఆరు కిలో మీటర్లు దూరంలో ఒక లస్కర్‌ను నియమించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే 13 వంతుల కాలువ, ఎం.ఎన్‌ చానల్‌, బీవీ చానల్‌ గేట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల షట్టర్లు చోరీకి గురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి చైర్మన్‌లు, డైరెక్టర్లను నియమించినప్పటికీ వారు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లస్కర్ల విధులు ఇలా..

ఆండ్ర ప్రాజెక్టు కింద ఉన్న గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ మండలాలకు చెందిన పంట పొలాలలకు లస్కర్లు సాగునీటిని వదిలి పెట్టేవారు. ప్రతి ఆరు కిలో మీటర్ల చొప్పున లస్కర్లు ఉండి సాగునీటి పంపకాలు చేపట్టేవారు. రైతులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు వహించేవారు. షట్టర్లకు, తలుపులకు గ్రీజు పెట్టడం వంటి పనులు చేపట్టేవారు. కాలువల్లో పూడుక, పిచ్చిమొక్కలను తొలగించేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం వారంతా రిటైర్డ్‌ అయ్యారు. వారిస్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం..

ఇరిగేషన్‌ శాఖకు సంబంధించి సబ్‌ డివిజన్‌ పరిధిలో 14 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఎన్నోఏళ్ల నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల సాగునీటి సరఫరాలో కొంత ఇబ్బందులు తప్పడంలేదు. ఈ విషయాన్ని ఇటీవలే మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.

-రామునాయుడు, డీఈ, ఇరిగేషన్‌ శాఖ

Updated Date - Jan 27 , 2026 | 11:51 PM