గ్యాస్ కష్టాలు తీరేదెప్పుడు?
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:15 AM
ఇరాన్-అమెరికా యుద్ధం తాత్కాలికంగా ఆగినా ఆ ప్రభావం ఇంకా గ్యాస్ సరఫరాపై కొనసాగుతోంది.
- 60 రోజుల వరకు రాని సిలిండర్
- బ్లాక్‌లో రూ.2వేలకుపైనే విక్రయం
- వినియోగదారులకు తప్పని ఇబ్బందులు
పొందూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఇరాన్-అమెరికా యుద్ధం తాత్కాలికంగా ఆగినా ఆ ప్రభావం ఇంకా గ్యాస్ సరఫరాపై కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితు ల్లో బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. రూ.939 విలువ చేసే గ్యాస్ సిలిండర్ బ్లాక్‌లో రూ.2పైనే పలుకుతోంది. గతంలో సిలిండర్ బుకింగ్‌కు ఎటువంటి సమయం ఉండేదికాదు. అయితే, యుద్ధం కారణంగా ఆ పరిస్థితి మారింది. ఒకసారి గ్యాస్ బుకింగ్ అయిన తరువాత డెలివరీ అయ్యేందుకు 10 నుంచి 15 రోజులు పడుతోంది. మళ్లీ బుక్ చేయాలంటే 45 రోజుల వరకు ఆగాలి. మొత్తంగా ఒక సిలిండర్ రావాలంటే 60 రోజులపైనే అవుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబానికి గ్యాస్ సిలిండర్ నెల మాత్రమే వస్తుంది. మళ్లీ గ్యాస్ కావాలంటే ఆ కుటుంబం రెండు నెలలు వేచిఉండాలి. దీంతో కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్‌లో సిలిండర్‌ను రూ.2వేలపైనే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గ్యాస్ గోడౌన్ సిబ్బంది, డెలివరీ సిబ్బంది చేతివాటం కారణంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ బుకింగ్ చేసిన తరువాత డీఏసీ నంబరు వచ్చినా వినియోగదారులకు ఆ సిలిండర్‌ను డెలివరీ చేయకుండా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. హోటళ్లు, డాబాలకు వాటిని భారీ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై పొందూరు తహసీల్దార్ ఆర్.వెంకటేష్‌ను వివరణ కోరగా.. ‘గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సక్రమంగా అందేటట్లు చూస్తున్నాం. అవసరమైతే గ్యాస్ ఏజెన్సీ వద్ద సిబ్బందిని నియమించి పరిస్థితిని సమీక్షిస్తాం.’ అని తెలిపారు.