Share News

When will the fish landing center open? ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఎప్పటికో?

ABN , Publish Date - May 13 , 2026 | 12:16 AM

When will the fish landing center open?జిల్లా తీర ప్రాంతంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పుడు మత్స్యకారులు ఎంతో ఊరట చెందారు. ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదనుకున్నారు. స్వగ్రామాలకు దగ్గరలోనే పని దొరుకుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావించారు.

When will the fish landing center open? ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌  ఎప్పటికో?
సముద్ర తీరం

ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌

ఎప్పటికో?

మత్స్యకారుల్లో తీవ్ర నిరాశ

ఉపాధి లేక వలసబాట

ప్రకటించి వదిలేసిన గత ప్రభుత్వం

పెరిగిన నిర్మాణ వ్యయం అంచనా

దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం

త్వరలో ప్రకటన వచ్చే అవకాశం

జిల్లా తీర ప్రాంతంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పుడు మత్స్యకారులు ఎంతో ఊరట చెందారు. ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదనుకున్నారు. స్వగ్రామాలకు దగ్గరలోనే పని దొరుకుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావించారు. అంతలోనే వారి ఆశలు అడియాశలైపోయాయి. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ను ప్రకటించిన ఆ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించలేదు. తర్వాత రోజుల్లో పూర్తిగా వదిలేసింది. దీంతో మత్స్యకారులు ఆశలు వదులుకుని ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. త్వరలో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

భోగాపురం, మే12(ఆంధ్రజ్యోతి):

మత్స్యకారులు వలస వెళ్లకుండా చూస్తామంటూ గత ప్రభుత్వం పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్ద రూ.23కోట్లతో ఫిష్‌ల్యాడింగ్‌ సెంటర్‌ నిర్మిస్తామని ప్రకటించింది. స్థలాన్ని కూడా గుర్తించింది. అంతే అక్కడితో ఆగిపోయింది. మళ్లీ అటువైపే దృష్టి పెట్టలేదు. దీనిపై మత్స్యకారులు అనేక మార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదు. వాస్తవానికి ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మిస్తే మత్స్యకారులకు చాలా భరోసాగా ఉంటుంది. ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని ఉండదు. బోట్లను లంగరు వేయడానికి అనువుగా ఉంటుంది. మత్స్య సంపదను వెంటవెంటనే అమ్ముకోవచ్చు. జిల్లా నుంచి చేపల ఎగుమతులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కోల్డ్‌ స్టోరేజ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఫిష్‌ల్యాడింగ్‌ సెంటర్‌ను గత ప్రభుత్వం ప్రకటించి వదిలేసింది. దీంతో తీర గ్రామాల నుంచి మత్స్యకారుల వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఫిష్‌ల్యాడింగ్‌ సెంటర్‌ పనులు ప్రారంభించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. గత ప్రభుత్వంలో రూ.23కోట్లతో అంచనా వేయగా, ఆ డబ్బులు చాలవని ఆంధ్రప్రదేశ్‌ మెటరన్‌ బోటు(ఏపీఎంబీ)వారు తేల్చారు. ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం చేయబోయే ప్రాంతాన్ని ఇటీవల పరిశీలించి రూ.రూ.40కోట్లకు అంచనా వేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎంవోయు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది.

భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో సుమారు 29 కిలోమీటర్ల విస్తీర్ణంలో ముక్కాం, చోడిపల్లిపేట, పెదకొండ్రాజుపాలెం, చినకొండ్రాజుపాలెం, చేపలకంచేరు, ఎర్రముసలయ్య పాలెం, చింతపల్లి, నీలగెడ్డపేట, బర్రిపేట, పెద్దూరు, కొత్తూరు, తమ్మయ్యపాలెం, తిప్పలవాలస, కొత్తూరు, మద్దూరు, కోనాడ, బొడ్డుగురయ్యపేట, బొడ్డు వెంకటేషుపేట తదితర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈగ్రామాల్లో సుమారు 15వేల కుటుంభాలు ఉండగా 25వేల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 5నుంచి 6వేల మంది సముద్రాన్నే జీవనాధారంగా చేసుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేవుడుపై భారం వేసి వేట సాగిస్తున్నారు. కాగా ఈ రెండు మండలాల్లో సుమారు 939 రిజిస్టర్డ్‌ పడవలు, 300 వరకు సాంప్రదాయ తెడ్డు పడవలు ఉన్నాయి. ఒక్కో సమయంలో ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా మత్స్యకారులు సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయినా చేసేదిలేక వృత్తినే నమ్ముకుని ఉన్నారు.

ఆగని వలసలు

ఖర్చులు పెరగడం, సరిపడే ఆదాయం లేక అనేకమంది మత్స్యకారులు వలస బాట పడుతున్నారు. గుజరాత్‌, ఒడిశా, పారాదీప్‌ తదితర దూర ప్రాంతాలకు వలస వెళ్లి సుమారు 6నుంచి 8 నెలల పాటు ఉంటున్నారు. రెండు మండలాల తీరప్రాంత గ్రామాల నుంచి ఏటా సుమారు 2000 నుంచి 2500 వరకు మత్స్యకారులు వలసవెళ్తున్నట్లు అంచనా.

రూ.40 కోట్లకు అంచనా వేశారు

ఫిష్‌ల్యాడింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో రూ.23కోట్లకు అంచనా వేశారు. అది ప్రస్తుత ధరల ప్రకారం చాలదంటూ ఏపీ మెటరన్‌ బోటు(ఏపిఎంబి)వారు ఇటీవల ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌ స్థలాన్ని పరిశీలించి చెప్పారు. రూ.40కోట్లకు అంచనా వేసి ప్రతిపాదనాలు పంపించారు. ప్రస్తుతం ఎంవోయూ పెండింగులో ఉంది. వారంరోజుల్లో కొలిక్కి రానుంది.

- శ్రీనివాసరావు, ఎఫ్‌డీవో, మత్స్యశాఖ

Updated Date - May 13 , 2026 | 12:16 AM