నష్టపరిహారం చెల్లించేదెప్పుడో?
ABN , Publish Date - May 11 , 2026 | 12:45 AM
కొత్తవలస నుంచి విజయనగరం వరకు నూతనంగా నిర్మిస్తున్న నాలుగో రైల్వే లైన్‌కు సంబంధించి బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో రైల్వే శాఖ స్పష్టత ఇవ్వడం లేదు.
- నాల్గో రైల్వే లైన్ బాధితుల ఎదురుచూపు
- స్పష్టత ఇవ్వని రైల్వే శాఖ
-మరోవైపు శరవేగంగా పనులు
కొత్తవలస, మే 10 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస నుంచి విజయనగరం వరకు నూతనంగా నిర్మిస్తున్న నాలుగో రైల్వే లైన్‌కు సంబంధించి బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో రైల్వే శాఖ స్పష్టత ఇవ్వడం లేదు. మరోపక్క నాలుగో రైల్వే లైన్ పనులను శరవేగంగా చేస్తోంది. దీంతో ఏరాత్రప్పుడో రైల్వే అధికారులు వచ్చి తమ ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయిస్తారోనని నిర్వాసితులు భయాందోళన చెందుతున్నారు. మూడో లైన్‌కు సంబంధించి కూడా బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. అదే పరిస్థితి తమకూ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు మాత్రం ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెబుతున్నారు. అయితే, ఎప్పుడో పూర్తయిన మూడో రైల్వే లైన్ బాధితులకు ఇప్పుడు న్యాయం చేస్తామని చెబితే ఎలా నమ్ముతామని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
2011 సంవత్సరంలో కొత్తవలస నుంచి విజయనగరం వరకు మూడో రైల్వే లైన్ కోసం అధికారులు ప్రతిపాదనలు చేశారు. తరువాత నోటిఫికేషన్ జారీ చేశారు. రైల్వే లైన్ ఏర్పాటు మాత్రం 2017లో జరిగింది. కొత్తవలస అర్‌యూబీ నుంచి కొత్తవలస రైల్వే స్టేషన్ వరకు భూసేకరణ చేశారు. అయితే, 39 సెంట్లు స్థలం మాత్రమే సేకరించామని చెప్పి సంబంధిత బాధితులకు పరిహారం చెల్లించారు. కానీ, ఎంతమందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో లెక్కలు లేవు. 11 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. జిల్లా పరిషత్‌కు చెందిన స్థలాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారి స్థలాలను రైల్వే శాఖ స్వాధీనం చేసుకుని అవి తమవిగాచూపించి నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నా రైల్వే శాఖ గాని, రెవెన్యూ శాఖ గాని పట్టించుకోవడం లేదు. అసలు ఆ ఫైళ్లు కనిపించడం లేదని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు మళ్లీ నాలుగో రైల్వే లైన్ కోసం నోటిఫికేషన్ జారీ కావడంతో పాటు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒకపక్క తుమ్మికాపల్లి నుంచి కొత్తవలస వైపు, మరోపక్క కొత్తవలసలోని ఇతర ప్రాంతాల నుంచి పనులు చేసుకుంటూ వస్తోంది. నాలుగో రైల్వే లైన్ ఏర్పాటుతో 105 కుటుంబాలకు చెందిన ఇళ్లు, వాణిజ్య సముదాయాలు మాత్రమే నష్టపోతాయని రైల్వే శాఖ గుర్తించింది. కానీ, బాధితులకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో ప్రకటించలేదు. కనీసం అభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభ కూడా ఏర్పాటు చేయలేదు.
బాధితుల డిమాండ్లు ఇవే..
బాధితులు రైల్వే శాఖ అధికారులు, మండల, జిల్లా అధికారులతో పాటు విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చుట్టూ తిరుగుతూ న్యాయం చేయాలని కోరుతున్నారు. నష్ట పరిహారం నాలుగు రెట్లు అధికంగా ఇవ్వాలని, ఇళ్లు , దుకాణాలు పోయిన వారందరికీ నిర్మాణ ఖర్చులు సైతం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి కుటుంబానికీ కనీసం మూడు సెంట్లు ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని, వ్యాపారాలు చేసుకునే వారందరికీ ఒకేచోట స్థలం చూపించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.