Share News

Compensation పరిహారం అందేదెప్పుడో?

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:29 AM

When Will the Compensation Arrive? ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో వర్షాలు పడిచే చాలు.. భామిని మండల రైతులు వణికిపోవాల్సి వస్తోంది. అక్కడ వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగిన ప్రతిసారీ వారి పంట పొలాలు ముంపునకు గురవడమే ఇందుకు కారణం.

  Compensation  పరిహారం అందేదెప్పుడో?
సింగిడి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌లో బ్యాక్‌ వాటరుతో మునిగిన పంట పొలాలు

  • నీట మునుగుతున్న పంటలు

  • గత వైసీపీ సర్కారు హయాంలో 44 ఎకరాలు స్వాధీనం..

  • నష్టపరిహారం మాత్రం చెల్లించని వైనం

  • భూములు ఆక్రమణకు గురికాకుండా సాగు చేపడుతూ.. ఏటా నష్టపోతున్న రైతులు

  • కూటమి ప్రభుత్వంపై ఆశలు

భామిని, ఆగస్టు30(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో వర్షాలు పడిచే చాలు.. భామిని మండల రైతులు వణికిపోవాల్సి వస్తోంది. అక్కడ వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగిన ప్రతిసారీ వారి పంట పొలాలు ముంపునకు గురవడమే ఇందుకు కారణం. ఏటా వరద వచ్చే సమయంలో భామిని మండలం కాట్రగడ్డ నుంచి శ్రీకాకుళం జిల్లా హిరమండలం వరకు వరద కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. అయితే సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌తో భామిని మండలంలో ఏటా 44 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో గత పదేళ్లుగా ఆయా భూములో పలు పంటలను సాగు చేస్తున్న సుమారు 60 మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

బ్యాక్‌ వాటర్‌ కారణంగా గత ప్రభుత్వం ఆ 44 ఎకరాలకు రికార్డు పరంగా స్వాధీనం చేసుకుంది. రైతులకు మాత్రం పరిహారం అందించ లేకపోయింది. అయితే భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే భయంతో సింగిడి, పసికిడి, బురుజోల తదితర గ్రామాల రైతులు వరి, పత్తి సాగు చేపడుతూ నష్టాలను చవిచూస్తున్నారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2, ఫేజ్‌-2లో భాగంగా 2006లో చేపట్టిన పనులతో ఈ సమస్య మొదలైందని వారు వాపోతున్నారు. 2016లో వరదకాలువ ద్వారా నీటిని మళ్లించే సమయంలో బ్యాక్‌ వాటర్‌ పోటెత్తి పంటలన్నీ దెబ్బతిన్నాయి. రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండడంతో ముంపునకు గురయ్యే 44 ఎకరాలను 60 మంది రైతులు నుంచి అదనంగా సేకరించారు. ఇందుకు రూ.6 కోట్లు పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 2018-19లో రీ సర్వే చేపట్టారు. 2021లో అవార్డు విచారణ పూర్తయినా ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను గత ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడంతో సాగు చేయలేక.. పరిహారం రాక, బ్యాంకు రుణాలకు కూడా అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పరిహారం కోసం రెండు జిల్లాల అధికారులు, వంశధార కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావును వివరణ కోరగా.. ‘ అప్పట్లో రీసర్వే చేపట్టాం. ఈ మేరకు సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ వల్ల ముంపునకు గురైన భూములను గుర్తించాం. భూసేకరణ పూర్తయింది. ముంపునకు గురైన భూములకు సంబంధించిన రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. ’ అని తెలిపారు.

అధికారులు స్పందించాలి..

ఏటా వేసవిలో అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే మీ పేరిట బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుందని చెబుతున్నారు. పరిహారం మాత్రం అందడం లేదు. భూములు ఆక్రమణకు గురవుతాయనే భయంతో ఫలసాయం రాదని తెలిసిన సాగు చేయక తప్పడం లేదు. మా సమస్యపై అధికారులు స్పందించాలి.

- బోనిగెడ్డ జోగియుడు,రైతు, బురుజోల

==================================

ఇబ్బందులు పడుతున్నాం..

సింగిడి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ వల్ల భూములు కోల్పోయి తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాం. గత పదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో మా భూములను తీసుకుంటామని గెజిట్‌ పాసైనా ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదు. అధికారులకు అడిగితే మీ ఖాతాలో జమ అవుతాయని మాత్రమే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి.

- కలిశెట్టి ప్రకాశరావు, రైతు, సింగిడి

Updated Date - Aug 31 , 2026 | 12:29 AM