When will the 4-lane road ready? 4లేన్ ఎప్పుడో?
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:59 PM
When will the 4-lane road ready? విశాఖ జిల్లా పెందుర్తి నుంచి జిల్లా పరిధిలోని బొడ్డవర వరకు సుమారు 42 కిలోమీటర్ల దూరంలో నాలుగు వరుసలుగా విస్తరించాల్సిన 516బీ జాతీయ రహదారి పనులు పట్టాలెక్కడం లేదు. భూసేకరణ త్వరితగతిన పూర్తయితే తప్ప రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం లేదు.
4లేన్ ఎప్పుడో?
పెందుర్తి- బొడ్డవర (516బీ) జాతీయ రహదారి విస్తరణకు పడని అడుగులు
గత ఏడాది మార్చిలో రూ.782.91 కోట్లతో టెండర్ ఖరారు
భూ సేకరణే అవరోధం
నిర్లక్ష్యంగా రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖ అధికారులు
ఇరుకు రోడ్డులో తరచూ ప్రమాదాలు
అరకు పర్యాటకంపై ప్రభావం
తాజాగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే లలితకుమారి
-----------------
విశాఖ జిల్లా పెందుర్తి నుంచి జిల్లా పరిధిలోని బొడ్డవర వరకు సుమారు 42 కిలోమీటర్ల దూరంలో నాలుగు వరుసలుగా విస్తరించాల్సిన 516బీ జాతీయ రహదారి పనులు పట్టాలెక్కడం లేదు. భూసేకరణ త్వరితగతిన పూర్తయితే తప్ప రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం లేదు. ఈ ప్రభావం అరకు పర్యాటక రంగంపైనా పడుతోంది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిధులు ఉన్నా నిర్మాణం దిశగా అడుగులు పడడం లేదు. కీలకమైన రహదారిని రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తాజాగా సీఎం దృష్టికి వెళ్లడంతో ఇకనైనా కదలిక వస్తుందేమో చూడాలి.
--------------------
- ఎస్.కోట నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన 516బి (పెందుర్తి నుంచి బొడ్డవర) నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోండి. ఈ రహదారి విస్తరణ పనులకు సంబంధించిన నిధులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడండి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే అరకు పర్యాటక రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది.
- రాజధాని అమరావతిలో మంగళవారం సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి విన్నపం ఇది
శృంగవరపుకోట, జూన్ 25(ఆంధ్రజ్యోతి):
516బీ జాతీయ రహదారి (విశాఖ జిల్లా పెందుర్తి నుంచి జిల్లా పరిధిలోని బొడ్డవర వరకు సుమారు 42 కిలోమీటర్ల దూరం)ని నాలుగు వరుసల రోడ్డుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం భారత మాత పరియోజన పథకం కింద రూ.782.91 కోట్లు కేటాయించింది. 2024 అక్టోబర్‌లో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్ నియామకానికి రోడ్డు,ట్రాన్స్‌పోర్టు, హైవే మంత్రిత్వ శాఖ బిడ్‌ను తెరిచింది. కాంట్రాక్టు పొందేందుకు 18 మంది వరకు పేరున్న కంపెనీలు ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు వేశాయి. 2025 మార్చిలో టీటీ (టెక్స్ అండ్ టవర్స్)ఇన్‌ఫాటెక్ సంస్థ ఈ రోడ్డు నిర్మాణ అనుమతులు దక్కించుకున్నట్లు అధికారులు చెప్పారు. ఏడాది కాలం దాటేసినా పనులు చేపట్టకపోవడంతో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మూడు రోజుల క్రితం సీఎం నారాచంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.
నేటికి 64 ఎకరాలకే పరిహారం చెల్లింపు
ఈ రహదారిని రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రెండు శాఖలు సకాలంలో భూసేకరణను పూర్తి చేయలేకపోతున్నారు. రోడ్డు విస్తరణకు 100 ఎకరాల వరకు ప్రభుత్వం భూమి ఉంది. మరో 200 ఎకరాల వరకు అవసరం కావడంతో ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, శృంగవరపుకోట మండలాల పరిధిలోని గ్రామాల రైతుల భూమిని సేకరించారు. నివాసాలు, వ్యాపార సముదాయాల యజమానులను గుర్తించారు. ఇందుకు సంబంధించిన నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమచేయడంలో విఫలమవుతున్నారు. ఇంతవరకు 64 ఎకరాల భూమికి మాత్రమే నష్టపరిహారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోడ్డు విస్తరణకు భూసేకరణ ఓ అడ్డంకిగా మారినట్లు అంతా భావిస్తున్నారు.
అరకు పర్యాటకంపై ప్రభావం
భూసేకరణ త్వరితగతిన పూర్తయితే తప్ప రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం లేదు. భూసేకరణ పూర్తికాకపోవడంతో అక్టోబర్, మార్చి అంటూ నెలల పేరు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ ప్రభావం అరకు పర్యాటక రంగంపై పడుతోంది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ మహానగరం నుంచి అరకు వరకు ఈ రోడ్డు ఉంది. అరకు వెళ్లే ప్రయాణికులంతా ఈ దారిన వెళ్లాల్సిందే. అయితే జాతీయ రహదారి 16 నుంచి పెందుర్తి వరకు దశాబ్దం క్రితమే విస్తరించారు. అక్కడి నుంచి వదిలేసిన రోడ్డంతా జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో ఉంది. 42 కిలోమీటర్ల దూరంలో కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో ఉంది. మిగిలిన 40 కిలోమీటర్ల రోడ్డు ఎస్.కోట నియోజకవర్గ పరిధిలో ఉండడంతో చాలా కాలం నుంచి విస్తరణ కోసం స్థానికుల నుంచి డిమాండ్ ఉంది.
హామీ అమలు చేసిన చంద్రబాబు
గత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరిస్తామని చెప్పి ఐదేళ్లు ఊరించారు. ఏటా డిసెంబర్‌లో పనులు చేపడతామంటూ చెబుతూ వచ్చారు. రోడ్డు దుస్థితిని చూసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలో రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారతమాల పరియోజన పథకం నిధులు అందేలా చేశారు.
రోడ్డు నిర్మాణం ఇలా..
పెందుర్తి నుంచి బొడ్డవర వరకు వున్న విశాఖ-అరకు రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మాణం చేపట్టడంతో పాటు కొత్తవలస, శృంగవరపుకోట మేజర్ పంచాయతీలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామం నుంచి అప్పన్నపాలెం గ్రామం (జిందాల్ పరిశ్రమ ముందుకు) వద్ద విశాఖ-అరకు రోడ్డును కలిసేలా ఒక బైపాస్, శృంగవరపుకోట మండలం వెంకటరమణపేట కూడలి సమీపంలో వున్న జైభేరి కార్ల షోరూం నుంచి కిల్తంపాలెం పంచాయతీ శివారు భవానీనగర్ సమీపంలోని విశాఖ-అరకు రోడ్డును కలిసేలా మరో బైపాస్‌ను కలుపుతూ నాలుగు వరుసల రోడ్డు చేపట్టాల్సి ఉంది. బొడ్డవర వరకు నాలుగు వరుసలతో అభివృద్ధి చేసిన విశాఖ-అరకు రోడ్డును తాటిపూడి వయా విజయనగరం (516ఇ జాతీయ రహదారి) రోడ్డుకు కలిపేందుకు కిలోమీటరు లోపు మరో బైపాస్ ఇవ్వనున్నారు. పట్టణ ప్రాంతాలను పోలి వుండే శృంగవరపుకోట, కొత్తవలస గ్రామాలు నిత్యం రద్దీగా వుండడంతో ఈ రెండు గ్రామాల్లోకి భారీ వాహనాలు రాకుండా వుండేందుకు బైపాస్ రోడ్లను చేపట్టదలిచారు. ఇంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పనులు చేపట్టడంలో మాత్రం అలసత్వం వహిస్తోంది.