Sewage Treatment Begin? మురుగునీటి శుద్ధి ఇంకెప్పుడు?
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:04 AM
When Will Sewage Treatment Begin? సాలూరులోని వేగావతి నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చెత్తాచెదారాలు, వ్యర్థాలతో అధ్వానంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాలు ఓ పెద్ద మురుగుకాలువను తలపిస్తోంది.
సర్వేలకే అధికారులు పరిమితం
తేలని స్థల సేకరణ
కాలుష్య కోరల్లో వేగావతి
పట్టణంలో మురుగునీరు, వ్యర్థాలన్నీ నదిలోకే...
రోగాల బారిన పట్టణవాసులు
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని విన్నపం
సాలూరు, ఫిబ్రవరి1(ఆంధ్రజ్యోతి): సాలూరులోని వేగావతి నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చెత్తాచెదారాలు, వ్యర్థాలతో అధ్వానంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాలు ఓ పెద్ద మురుగుకాలువను తలపిస్తోంది. పట్టణంలో సుమారు 75 శాతం వీధుల్లోని కాలువల మురుగునీరంతా ఇందులోనే చేరడంతో నదీ ఆనవాళ్లను కోల్పోయింది. జలాలు పూర్తిగా కలుషిత మయ్యాయి. దీంతో తరచూ ప్రజలు రోగాలపాలవుతున్నారు. మరోవైపు పట్టణంలో మరుగునీటి శుద్ధి ప్లాంట్ (సీ వేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్మాణం ఊపందుకోవడం లేదు. అధికారులు సర్వేకు పరిమితమవుతుండగా.. భూ సేకరణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దీంతో ప్లాంట్ నిర్మాణం సాలూరు వాసుల కలగానే మిగిలిపోయింది.
ఇదీ పరిస్థితి..
- ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని కొండల్లో పుట్టిన వేగావతి.. జిల్లాలోని పాచిపెంట నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు మండలాల్లో ప్రవహించి నాగావళిలో కలుస్తోంది. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, బలిజిపేట మండలాలకు తాగు, సాగు నీటిని అందిస్తోంది. అయితే సాలూరులో వేగావతి నదీ జాలాలు మాత్రం కలుషితమయ్యాయి. సాలూరు పట్టణంలోని మురుగుకాలువల నీరే ఎక్కువగా ఈ నదిలో చేరుతోంది. దీంతో దిగువ ప్రాంతాల్లో ఈ జలాన్ని వినియోగిస్తున్న వారు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీర్ఘకాలంగా ఈ సమస్య వేధిస్తున్నా.. కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు పాచిపెంటలో పెద్దగెడ్డ జలాశయం నిర్మాణంతో వేగావతి నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది.
- సాలూరు నగర పంచాయతీగా ఉన్న సమయంలో పట్టణంలో మురుగు నీరంతా వేగా వతిలో కలిసేలా కాలువలు నిర్మించారు. 1951లో పురపాలక సంఘంగా ఏర్పడిన తర్వాత కూడా పలువీధులోని మురుగు నీరు కాలువల గుండా నదిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. పట్టణంలో 29 వార్డులున్నాయి. రోజురోజుకూ పట్టణ జనాభా పెరుగుతుంది. అయితే వార్డుల్లో వాడుకనీరు పలు రకాల వ్యర్థాలు, ప్రమాదకర రసాయనాలు నదిలో కలుస్తుండడంతో జలాలు కలుషిత మవుతున్నాయి. రోజుకు దాదాపు 0.03 టీఎంసీలు కాలువల ద్వారా మురుగునీరు నదిలో కలుస్తున్నట్లు అంచనా.
- లారీ పరిశ్రమకు సాలూరు పెట్టింది పేరు. రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. పట్టణంలో వాటి అనుబంధ పరిశ్రమలు, వర్క్ షాపులు కూడా ఎక్కువే. బంగారు ఆభరణాల తయారీ, మెరుగుపరిచే కేంద్రాలూ ఉన్నాయి. వీరంతా వినియోగించే రసాయన వ్యర్థాలన్నీ నదిలో కలుస్తున్నాయి. మరోవైపు చికెన్, మటన్ షాపు వ్యర్థాలను నది పరిసర ప్రాంతాల్లోనే పార బోస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదు.
- పట్టణంలో చిన్నవీధి నుంచి వేగావతి వంతెన వరకు నదికి సమాంతరంగా మురుగు కాలువ నిర్మాణం చేయాలని గతంలో అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పలు వీధుల నుంచి వచ్చేనీరు నదిలో కాకుండా ఈ కాలువలోకి చేరేలా నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు రూ.50 లక్షలు పైగానే వెచ్చించారు. చిన్నవీధి నుంచి నెయ్యిల వీధి వరకు కాలువ నిర్మించారు. మొత్తంగా వేగావతి నదీ జలాలు మురుగునీటితో కలుషితం కాకుండా పురపాలక సంఘం చేపడుతన్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
- మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను సాలూరుకు సమీపంలోని గుమడాంలో వేగావతి నది పక్కన నిర్మించేందుకు 2023 నుంచి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలుమార్లు కేంద్ర-రాష్ట్ర బృం దాలు కూడా ఇక్కడికి వచ్చాయి. ప్లాంట్ నిర్మాణానికి సుమారు రెండు ఎకరాలకు పైగా భూ సేకరణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ స్థానిక అధికారులు పూర్తిస్థాయిలో స్థల సేకరణ చేపట్టకపోవడంతో గతేడాది ప్లాంట్ నిర్మాణానికి బ్రేక్ పడింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దీనిపై కదలిక వచ్చింది. ప్లాంట్ నిర్మాణానికి కేవలం ఎకరంన్నర స్థలం ఉంటే చాలు అని చెప్పడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడు తున్నారు. ప్లాంట్ నిర్మాణం పూర్తయితే వేగావతి నది రూపుమారనుంది. ప్రజలకు సురక్షిత నీరు అందనుంది. దీనిపై సంబంధింత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి త్వరితగతిన ఈ పనులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
భూ సేకరణ చేయాలి..
‘ గతంలో రెండున్నర ఎకరాల భూ సేకరణకు ప్రయత్నించినా వీలుపడలేదు. దీంతో ప్లాంట్‌కు సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుతం దీనిపై ఫైల్ సిద్ధం చేసి కలెక్టరేట్‌కు పంపించాం. తాజాగా ఉన్నతాధికారుల సూచనల మేరకు నీటి శుద్ధి ప్లాంట్‌కు ఎకరంన్నర భూసేకరణ చేస్తే చాలు.’ అని సాలూరు మునిసిపల్ కమిషనర్ రత్నకుమార్ తెలిపారు.