Share News

పునరావాసం కల్పించేదెప్పుడో?

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:21 PM

ఏదైనా ప్రాజెక్టును నిర్మిస్తే ముందుగానే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. కానీ, పెద్దగెడ్డ ప్రాజెక్టు విషయంలో ఇది జరగలేదు.

పునరావాసం కల్పించేదెప్పుడో?
రోడ్లకు పరిమితమైన కొటికిపెంట నిర్వాసిత కాలనీ

- నిర్మాణానికి నోచుకోని నిర్వాసిత కాలనీలు

- సగంలో నిలిచిన ఇళ్లు

- రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి

- ముంపులోనే కొటికిపెంట

పాచిపెంట, ఏప్రిల్‌16(ఆంధ్రజ్యోతి): ఏదైనా ప్రాజెక్టును నిర్మిస్తే ముందుగానే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. కానీ, పెద్దగెడ్డ ప్రాజెక్టు విషయంలో ఇది జరగలేదు. సంవత్సరాలు గడుస్తున్నా నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. 2006 సెప్టెంబరు 10న పెద్దగెడ్డ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. జలాశయానికి వంద మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను ముంపు గ్రామాలుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. వీటిలో మండలంలోని కోడికాళ్లవలస, కేసలి, కొటికిపెంట గ్రామాలు ఉన్నాయి. కోడికాళ్లవలస సమీపంలోనే కేసలి, కోడికాళ్లవలస నిర్వాసిత కాలనీలు నిర్మించారు. కోడికాళ్లవలసకు సంబంధించి దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తవడంతో నిర్వాసితులు అందులో నివాసం ఉంటున్నారు. కేసలికి సంబంధించి కొద్దిపాటి ఇళ్ల నిర్మాణాలే చేపట్టారు. అవి కూడా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కొటికిపెంటకు చెందిన 283 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం నిమిత్తం జలాశయం సమీపంలో సుమారు 25 ఎకరాల స్థలాన్ని అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. సిమెంట్‌ రోడ్లు సైతం నిర్మించింది. ఇళ్ల నిర్మాణానికి రూ.50 వేలు చొప్పున మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి ఈ నిధులు సరిపడవని, మరికొంత పెంచాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. కాలయాపన జరిగిందే తప్ప నిధులు పెంచలేదు. దీంతో కొటికిపెంట నిర్వాసితులు ఇళ్ల నిర్మాణానికి నోచుకోలేదు. సుమారు 20 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పునరావాసం కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ముంపు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ముంపు గ్రామం కావడంతో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు చొప్పున మంజూరు చేయడంతో కొంతమంది నిర్వాసితులు తప్పనిసరి పరిస్థితుల్లో దరఖాస్తులు చేసుకున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

పునరావాసం కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 20 ఏళ్లుగా ముంపు గ్రామంలోనే నివాసం ఉండాల్సి వస్తుంది. వర్షా కాలంలో మా బాధలు వర్ణణాతీతం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పునరావాస కాలనీ నిర్మించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి.

-ఇజ్జాడ అప్పలనాయుడు, నిర్వాసితుడు, కొటికిపెంట

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తా

కొటికిపెంట, కేసలి నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. నిర్వాసితులు కూడా ప్రభుత్వం మంజూరు చేసే నిధులు వినియోగించుకోవాలి.

-డి.రవి, తహసీల్దార్‌, పాచిపెంట

Updated Date - Apr 16 , 2026 | 11:21 PM