Odisha’s ఒడిశా దూకుడుకు కళ్లెం పడేదెప్పుడు?
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:55 PM
When Will Odisha’s Aggression Be Curbed? ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఒడిశా మళ్లీ దూకుడు పెంచింది. ఆ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తరచూ గొడవలకు దిగే ఆ రాష్ట్ర అధికారులు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధానంగా ఒడిశా పోలీసుల తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
వివాదాస్పద ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు
తరచూ అడ్డంకులు.. గొడవలు
ఏపీ అధికారులపై దురుసు ప్రవర్తన
కోర్టు సూచనలు బేఖాతర్
జనగణనకు సహకరించడం లేదని..
తాజాగా ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు
ఆంధ్రా మద్దతు తెలపడమే వారు చేసిన పాపమా..?
ఆ రాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
పార్వతీపురం, ఏప్రిల్26(ఆంధ్రజ్యోతి): ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఒడిశా మళ్లీ దూకుడు పెంచింది. ఆ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తరచూ గొడవలకు దిగే ఆ రాష్ట్ర అధికారులు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధానంగా ఒడిశా పోలీసుల తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల కొఠియా గ్రూపు గ్రామాల్లో ఒడిశా అధికారులు జనగణన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే ‘ఈ జనగణనతో మాకు సంబంధం లేదు.. మేము ఆంధ్ర లోనే ఉంటాం.’ అని ఎగువసెంబి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులు అన్నారు. దీంతో ఈ నెల 25న వారిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్ర పరిధి కోరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. దీనిపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజనులపై ఒడిశా పోలీసుల తీరును తప్పుపడుతున్నాయి. ఆంధ్రాకు మద్దతు తెలపడమే వారి పాపమా? ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఏపీ-ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- సాలూరు మండలం ఏవోబీలో ఉన్న కొఠియా గ్రూప్‌లో ఎగువ కొఠియా, దిగువ కొఠియా, ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర, కురిడిభద్ర, ఎగువశెంబి, దిగువశెంబి, ధూళిభద్ర, సోలిపిగుడ తదితర 21 గ్రామాలున్నాయి. కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఉన్న గిరిజనులకు రెండు రాష్ర్టాల రేషన్ కార్డులు, రెండు ఓటర్ కార్డులు ఉంటాయి. ఇద్దరు (ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ఎంపీ, ఏపీ నుంచి అరకు ఎంపీ) ఎంపీలు, ఇద్దరు (ఏపీ పరిధి సాలూరు ఎమ్మెల్యే.. ఒడిశా రాష్ట్రం పొట్టంగి ఎమ్మెల్యే) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుంటారు.
- తూర్పు కనుమల్లో ఉన్న ఈ గ్రామాల పరిధిలోని కొండల్లో అపార ఖనిజ సంపద ఉంది. అందుకే ఈ ప్రాంతం తమదంటే తమదని ఇరు రాష్ట్రాలు వాదులాడుతున్నాయి. దీంతో ఏళ్లు గడుస్తున్నా కొఠియా సమస్య కొలిక్కి రావడం లేదు.
- 1942లో అప్పటి బ్రిటిష్ హయాం నుంచి ఈ వివాదం నడుస్తుంది. స్వాతంత్య్ర అనంతరం రాష్ర్టాల ఏర్పాటు తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ఆ సమయంలో కొఠియా అన్ సర్వేయడ్ ప్రాంతంగా వదిలేశారు. ఇది ఒడిశాదా- ఏపీదా? అన్నది అప్పటి కేంద్రం తేల్చలేదు. అయితే కొఠియా గ్రామాలు తమవే అని ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ గ్రామాల వివాదంపై 1968, మార్చిలో సుప్రీంకోర్టు స్టేటస్‌కో జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఏపీ, ఒడిశాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి.
- కొఠియా వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని 2006లో సుప్రీంకోర్టు సూచింది. అయితే కొఠియాపై ఆధిపత్యానికి ఒడిశా ప్రయత్నిస్తోంది. 2018 నుంచి కోట్లాది రూపాయలతో ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, పోలీస్ స్టేషన్లు, స్కూళ్లను ఏర్పాటు చేసింది. కొఠియా గ్రూప్‌కు చెందిన ప్రతి గ్రామంలో ఒడిశా నిర్మాణాలున్నాయి. బీటీ, సిమెంట్ రోడ్లు వేశారు. కాగా గతంలో కొఠియాలో ఉన్న ఏపీ పోలీస్‌స్టేషన్ వివిధ కారణాలతోఎత్తి వేశారు. మరో వైపు ఏపీ ఉద్యోగులు, వైద్యాధికారులు కొఠియా వెళ్తే.. ఒడిశా అధికారులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. దీంతో కొన్నిసార్లు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొఠియా గ్రూప్ గ్రామాలపై తరచూ ఒడిశా ప్రజాప్రతినిధులు వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూనే ఉన్నారు.
- గతంలో మన్యం కలెక్టర్‌గా పనిచేసిన నిశాంత్‌కుమార్ కొఠియా గ్రామాల పర్యటనకు వెళ్తే.. ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులనూ అడ్డుకున్న సందర్భాలున్నాయి. మొత్తంగా ఒడిశా దూకుడును ఏపీ సమర్థంగా ఎదుర్కోలేకపోతుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
- 2021లో అప్పటి ఏపీ, ఒడిశా సీఎంలు జగన్, నవీన్ పట్నాయక్‌లు చర్చలు జరిపినా.. కొఠియా వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. సీఎస్ స్థాయిలో కమిటీని సైతం ఏర్పాటు చేసినా.. ఒడిశా దూకుడు తగ్గించలేదు.
ఆంధ్రాలోనే ఉంటామని..
తాము ఆంధ్రాలోనే ఉంటాం.. ఒడిశాలో ఉండబోమని గతంలో కొఠియా వాసులు ఆందోళన చేపట్టారు. పార్వతీపురం ఐటీడీఏకు వచ్చి అధికారులకు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయిన ప్పటికీ ఆ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ఒడిశా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒడిశా ప్రభుత్వం కొఠియా వాసులకు నిత్యావసర సరుకులతో పాటు వైద్య సేవలు అందిస్తోంది. అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తోంది. అయితే వాటిపై సంతృప్తికరంగా లేని గిరిజనులు ఆంధ్రా వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీనిని ఒడిశా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఏ చిన్న కారణం దొరి కినా కొఠియా గ్రూప్ గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా అంశంపై ఇరు రాష్ర్టాల సీఎంలు చొరవ చూపాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో కొఠియా సమస్యకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
ఒడిశా పోలీసుల దౌర్జన్యం సహించం: మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం/సాలూరు: కొఠియా గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం సహించబోమని మంత్రి గుమ్మిడి సంఽధ్యారాణి అన్నారు. ఆదివారం సాలూరులోని తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. కొఠియా గ్రూపు గ్రామాల్లో గిరిజనులు ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు. అయితే ఒడిశా జనగణనకు సహకరించలేదనే నెపంతో ఎగువ సెంబికి చెందిన ఇద్దరు గిరిజనులను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తా. ఏపీ భూభాగంలో ఒడిశా పోలీసుల పెత్తనం తగదు. సుప్రీంకోర్టు స్టేటస్‌కో గా ఉన్న అంశంపై రగడ చేయడం సరికాదు.’ అని తెలిపారు.