Laskars లస్కర్ల నియామకం ఎప్పుడో?
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:40 AM
When Will Laskars Be Appointed? సాగునీటి వ్యవస్థలో లస్కర్ల పాత్ర చాలా కీలకం. అయితే జిల్లాలో ఏ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో కూడా లస్కర్లు లేరు. చాలా సంవత్సరాల నుంచి ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు. లస్కర్ల విధానాన్ని పాలకులు పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సాగునీటి కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
జిల్లాలో 155 ఖాళీలు
సాగునీటి సరఫరాలో ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
పార్వతీపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): సాగునీటి వ్యవస్థలో లస్కర్ల పాత్ర చాలా కీలకం. అయితే జిల్లాలో ఏ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో కూడా లస్కర్లు లేరు. చాలా సంవత్సరాల నుంచి ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు. లస్కర్ల విధానాన్ని పాలకులు పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సాగునీటి కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో వట్టిగెడ్డ, వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్), పెద్దగెడ్డ, తోటపల్లి, పెదంకలం తదితర సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రతి ప్రాజెక్టు పరిధిలో ప్రతి 1500 ఎకరాలకు ఒక లస్కర్ నియమించాల్సి ఉంది. అదే విధంగా కాలువల నిర్వహణకు సంబంధించి ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక లస్కరు ఉండాలి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 155 మంది లస్కర్లను నియమించాల్సిన అవసరం ఉంది. కానీ, ఒక్కరు కూడా లేకపోవడంతో సాగునీటిని అందించడంలో, ప్రాజెక్టుల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. గతంలో వీఆర్‌ఎస్ ప్రాజెక్టు పరిధిలో 15 మంది లస్కర్లు పని చేసేవారు. అయితే, వేతనాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి ఉండడంతో వారిని నిలిపివేశారు. లస్కర్ల నియామకంపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా ఇరిగేషన్ అధికారులు లేఖలు రాసినప్పటికీ ఫలితం శూన్యం. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి.
లస్కర్ల విధులు ఇలా..
జిల్లాలో వట్టిగెడ్డ, వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్), పెద్దగెడ్డ, తోటపల్లి, పెదంకలం తదితర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని పంట పొలాలలకు లస్కర్లు సాగునీటిని వదిలి పెట్టేవారు. ప్రతి ఆరు కిలో మీటర్లకు ఒక లస్కరు చొప్పున ఉండి సాగునీటి పంపకాలు చేపట్టేవారు. రైతులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు వహించేవారు. షట్టర్లకు, తలుపులకు గ్రీజు పెట్టడం వంటి పనులు చేపట్టేవారు. కాలువల్లో పూడికలు, పిచ్చిమొక్కలను తొలగించేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం వారంతా రిటైర్డ్ అయ్యారు. వారిస్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది.
ప్రభుత్వానికి లేఖ రాశాం
లస్కర్ల నియామకంపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశాం. అనుమతులు వచ్చిన వెంటనే లస్కర్ల నియామకానికి చర్యలు తీసుకుంటాం.
-ఆర్.అప్పారావు, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్‌శాఖ, బొబ్బిలి సర్కిల్