When Will It Be Resolved? తేలేదెప్పుడో?
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:44 PM
When Will It Be Resolved? పార్వతీపురం మున్సిపాల్టీలో రోడ్డు మార్జిన్, మార్కెట్ ఆశీలు వసూలు ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. ఈ విషయంలో నెలకో హైడ్రామా నడుస్తుంది. దీంతో పుర ఆదాయానికి గండిపడుతుంది.
బహిరంగ వేలం పాట మళ్లీ వాయిదా
ఇప్పటికే పలు దఫాలు నిర్వహణ
మున్సిపల్ ఆదాయానికి గండి
పార్వతీపురం టౌన్, జూలై21(ఆంరఽధజ్యోతి): పార్వతీపురం మున్సిపాల్టీలో రోడ్డు మార్జిన్, మార్కెట్ ఆశీలు వసూలు ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. ఈ విషయంలో నెలకో హైడ్రామా నడుస్తుంది. దీంతో పుర ఆదాయానికి గండిపడుతుంది. వాస్తవంగా పట్టణంలోని రోడ్డు మార్జిన్‌తోపాటు మార్కెట్ ఆశీలు వసూలు చేసుకునేందుకు బహిరంగ వేలం ద్వారా పాట దారులను నిర్ణయిస్తారు. అయితే ఈ ఏడాది నెలకో ట్విస్టు నెలకొనడంతో.. రెవెన్యూ అధికా రులు, పాటదారుల్లో తప్పెవరిది..? ఒప్పు ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్నడూలేని విధంగా...
- పార్వతీపురం రోడ్డు మార్జిన్, మార్కెట్ ఆశీలు వసూళ్లకు సంబంధించి బహిరంగ వేలం పాట ఎన్నడూ లేని విధంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆశీలు వసూలుకు సంబంఽధించి సర్కారు పాట రూ.18.12 లక్షలుగా రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అయితే మార్కెట్ పరిశుభ్రతకు సంబంధించి కార్మికులకు రూ.4.80 చెల్లించగలమే గానీ జీఎస్‌టీని చెల్లించలేమని పాటదారులు స్పష్టంచేశారు. అంతే కాకుండా కరోనా సమయంలో నష్టాల బారినపడి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు అప్పటి కమిషనర్ ప్రకటించారు.
- మళ్లీ ఈ ఏడాది మార్చి 17న బహిరంగ వేలం నిర్వహించగా సర్కారు పాట రూ.16.43 లక్షలుగా నిర్ణయించారు. బుడితి శ్రీనివాసరావు అనే పాటదారుడు రూ.16.49 లక్షలకు దక్కించుకున్నాడు..
- అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. బాక్స్ టెండర్ పిలవాలని పార్వతీపురం మున్సిపాల్టీ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. దీంతో జూన్ 18న తొమ్మిది నెలలకు బాక్స్ టెండర్‌ను పిలిచారు. ఒక్క దరఖాస్తే రావడంతో దానిని రద్దు చేశారు.
ఈ సారీ కూడా...
ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు (8నెలలపాటు) ప్రధాన రహదారి మార్జిన్‌తోపాటు ప్రధాన మార్కెట్ ఆశీలు వసూలుకు సంబంధించి మంగళవారం మున్సిపాల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఉదయం 10 గం టల నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకు పాటదారుల కోసం వేచి చూశారు. సర్కారు వారి పాటను రూ.10.98 లక్షలుగా నిర్ణయించినా.. పాటదారులు ముందుకు రాలేదు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరాజును వివరణ కోరగా బహిరంగ వేలంలో పాటదారులు పాల్గొనలేని విషయాన్ని ప్రత్యేకాధికారికి తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.