Share News

శిక్షణ పూర్తై మూడు నెలలు.. ఉచిత కుట్టు మిషన్లు ఎప్పుడిస్తారు?

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:16 AM

When Will It Be Given? మహిళల స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు శిక్షణకు సంబంధించిన మిషన్ల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. శిక్షణ పూర్తయి మూడు నెలలు దాటుతున్నా.. ఇంకా లబ్ధిదారులకు మిషన్లు అందించలేదు. దీంతో వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

శిక్షణ పూర్తై మూడు నెలలు.. ఉచిత కుట్టు మిషన్లు ఎప్పుడిస్తారు?

  • జిల్లాలో 1,323 మందికి శిక్షణ

గరుగుబిల్లి, జూన్‌28(ఆంధ్రజ్యోతి): మహిళల స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు శిక్షణకు సంబంధించిన మిషన్ల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. శిక్షణ పూర్తయి మూడు నెలలు దాటుతున్నా.. ఇంకా లబ్ధిదారులకు మిషన్లు అందించలేదు. దీంతో వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా ఇంటి వద్దే మహిళలకు ఉపాధి కల్పించేందుకు వీలుగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణకు అవకాశం కల్పించారు. ఈ మేరకు జిల్లాలోని 13 మండలాల్లో 1,323 మందికి శిక్షణ ఇచ్చారు. గతేడాది మే, జూన్‌ నెలల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీటెక్నాలజీస్‌ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 150 కుట్టు మిషన్లు, 20 మంది సిబ్బందితో 5 నెలల పాటు మహిళలకు శిక్షణ నిర్వహించారు. 75 శాతం హాజరుతో శిక్షణ పొందిన వారికి ఈ ఏడాది మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు సంబంధిత శాఖ నుంచి ఉత్తీర్ణత పొందినట్లు సమాచారం అందింది. అయితే ఫలితాలు వెలువడి మూడు నెలలు గడుస్తున్నా.. నేటికీ కుట్టు మిషన్లు, ధ్రువీకరణ పత్రం అందించలేదని పలువురు మహిళలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కుట్టు శిక్షణ నిర్వహించిన సంస్థకు నేటికీ ఎటువంటి బిల్లులు చెల్లించలేనట్లు తెలిసింది. దీనిపై జిల్లా ఇన్‌చార్జి బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ .గడ్డమ్మను వివరణ కోరగా.. ‘జిల్లాలోని 13 మండలాల్లో మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణ నిర్వాహకుల బిల్లుల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. నిబంధనల మేరకు శిక్షణ పూర్తయిన వారికి పరీక్షలు నిర్వహించాం. పాసైన వారికి త్వరలో మండలాల వారీగా మిషన్‌తో పాటు శిక్షణ ధ్రువీకరణ పత్రం అందిస్తాం. ’ అని తెలిపారు.

Updated Date - Jul 10 , 2026 | 11:40 AM