Share News

When Will It Be Given? ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:06 AM

When Will It Be Given? జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దోమ తెరల పంపిణీ ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎపిడమిక్‌ సీజన్‌ సమీపిస్తుండడంతో ఈ ఏడాదిలోనైనా పంపిణీ చేస్తారో? లేదో? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

When Will It Be Given? ఎప్పుడిస్తారో?
ఆరేళ్ల కిందట సీతంపేట మలేరియాశాఖ కార్యాలయంలో ఉన్న దోమతెరలు

  • సమీపిస్తున్న ఎపిడమిక్‌ సీజన్‌

  • డేంజర్‌ జోన్‌లో హైరిస్క్‌ గ్రామాలు

  • వినియోగంపై అవగాహన కూడా అవసరమే

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

సీతంపేట రూరల్‌, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దోమ తెరల పంపిణీ ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎపిడమిక్‌ సీజన్‌ సమీపిస్తుండడంతో ఈ ఏడాదిలోనైనా పంపిణీ చేస్తారో? లేదో? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మలేరియా నియంత్రణలో భాగంగా ప్రతి నాలుగేళ్లకొకసారి గిరిజన గ్రామాలకు దోమతెరలను పంపిణీ చేసేవారు. అయితే సుమారు ఆరేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు వాటి ఊసే లేదు. 2020-21లో ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో గిరిజన గ్రామాలకు దోమతెరలను అందించారు. ఆ తర్వాత నుంచి వాటిని పంపిణీ చేయలేదు. దీంతో ఏటా ఎపిడమిక్‌ సీజన్‌లో జిల్లాలో మలేరియా హైరిస్క్‌ గ్రామాల్లో అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. సీతంపేట ఏజెన్సీలో 2024-25లో మలేరియా, డెంగ్యు కేసులు ఎక్కువగా నమోదైన 159 గిరిజన గ్రామాల్లో ఐఆర్‌ఎస్‌(ఇండోర్‌ రీషెడ్యూల్‌ స్ర్పే), ఏఎల్‌వో(యాంటీ లార్వా ఆపరేషన్‌)లు వంటివి చేపట్టారు. అయినప్పటికీ దోమతెరలు లేకపో వడంతో గత ఎపిడమిక్‌ సీజన్‌లో గిరిపుత్రులు మలేరియా బారిన పడ్డారు. దోనుబాయి, కుసిమి, మర్రిపాడు పీహెచ్‌సీల పరిధిలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 15మండలాల్లో మలేరియా హైరిస్క్‌ గ్రామాలు 245 వరకు ఉన్నాయి. మొత్తంగా 3.5లక్షల దోమతెరలు అవసరమని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపారు. త్వరలో అవి జిల్లాకు వస్తాయని జిల్లా మలేరియా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రానున్న ఎపిడమిక్‌ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించి.. మలేరియా హైరిస్క్‌ గ్రామాల్లో మొదటి విడతగా 63 వేల దోమతెరలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో వాటిని ఆయా గ్రామాల్లో ప్రజలకు అందించనున్నట్లు సమాచారం.

అవగాహన లేక..

నేటికీ గిరిపుత్రుల్లో చాలామందికి దోమతెరల వినియోగంపై అవగాహన ఉండడం లేదు. 2020-21లో పంపిణీ చేసిన తైవాన్‌ దోమతెరలను కొందరు ప్రస్తుతం పూలతోటలకు రక్షణగా, వాలీబాల్‌ ఆడుకునేందుకు నెట్‌గా, మరికొందరైతే ఏకంగా చేపలు పట్టేందుకు వినియోగిస్తున్నారు. మలేరియా హైరిస్క్‌ గ్రామాల్లో పంపిణీ చేసిన దోమతెరల వినియోగంపై సంబంధిత మలేరియా శాఖ గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. అలా చేస్తేనే ఎపిడమిక్‌ సీజన్‌లో మలేరియా వ్యాప్తి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీనిపై గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

డీఎంవో ఏమన్నారంటే..

‘జిల్లాలోని మలేరియా హైరిస్క్‌ గ్రామాల్లో ఈ ఏడాది దోమతెరల పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదించాం. మొత్తంగా 3.5లక్షల దోమతెరలు అవసరం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎపిడమిక్‌ సీజన్‌కు ముందుగానే 63వేల దోమతెరల పంపిణీకి చర్యలు తీసుకుంటుంది.’ అని డీఎంవో మణి తెలిపారు.

Updated Date - Feb 08 , 2026 | 12:06 AM