Share News

When Will It Be Completed? పూర్తయ్యేదెప్పుడో?

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:20 AM

When Will It Be Completed? సీతంపేటలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కొలిక్కి రావడం లేదు. సుమారు ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికీ నత్తనడకనే సాగు తున్నాయి. బిల్లులు చెల్లింపులవుతున్నా ఈ పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

When Will It Be Completed? పూర్తయ్యేదెప్పుడో?
సీతంపేట మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఇలా..

  • బిల్లులు చెల్లించినా ముందుకు సాగని పనులు

  • కొర వడిన అఽధికారుల పర్యవేక్షణ

  • మరోసారి గడువు పెంచే యోచన

  • పెదవి విరుస్తున్న గిరిజనులు

సీతంపేట రూరల్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): సీతంపేటలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కొలిక్కి రావడం లేదు. సుమారు ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికీ నత్తనడకనే సాగు తున్నాయి. బిల్లులు చెల్లింపులవుతున్నా ఈ పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎప్పుడెప్పుడు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎదురుచూస్తున్న గిరిజనులకు నిరాశే మిగులుతుంది. అసలు ఆసుపత్రి పనులు ప్రారంభమైన నాటి నుంచి పనుల్లో ఆశించిన వేగం కనిపించడం లేదని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పనులు పూర్తి చేయడంలో ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం సీతంపేట కేంద్రంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది. దీని కోసం రూ.49.26కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో ఎన్‌సీసీ(నాగార్జున కనస్ట్రక్షన్స్‌ కంపెనీ)సంస్థ నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని పనులు ప్రారంభించింది. నిబంధనల మేరకు 2024, సెప్టెంబరు నాటికి భవన పనులు పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు 70శాతం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 30శాతం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

- ఇప్పటికే ఒకసారి సంబంధిత ఎన్‌సీసీ కంపెనీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువు పెంచింది. 2025, సెప్టెంబరు వరకు అవకాశం ఇచ్చింది. గడువు దాటి సుమారు 4నెలలు కావస్తున్నప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేసేందుకు మరోసారి నిర్మాణ సంస్థ గడువు పెంచాలని ఏపీఎంఐడీసీ(ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)కు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. 2026 అక్టోబరు వరకు గడువు పెంచాలని కోరినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంబంధిత ఎన్‌సీసీ సంస్థకు సుమారు 90శాతానికి పైబడి అంటే రూ.27కోట్ల వరకు బిల్లులు చెల్లించింది. ఇటీవల చేపట్టిన పనులకు సంబంధించి రూ.కోటి వరకు మాత్రమే నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా ఆసుపత్రిలో ఇంకా మినీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ , రహదారులు, డ్రైన్‌లు, పెయింటింగ్స్‌ తదితర పనులు పూర్తిచేయాల్సి ఉంది. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై సంబంధిత ఏపీఎంఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణాన్ని మొదట ఎన్‌సీసీ ప్రారంభించినా.. ఆ తరువాత ఆ పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సకాలంలో పూర్తిచేయాలి

గిరిజనులకు ఆధునిక వైద్యం చేరువ చేసేందుకు కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేయాలి. నేటికీ ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పనులు పూర్తిచేయకపోవడం దారుణం. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలి.

- బి.శ్రీనివాసరావు, గిరిజన ఏజేఏసీ నాయకుడు

===============================

ఎప్పటికి పూర్తవుతుందో..

సీతంపేట మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడుస్తున్నా పనులు వేగవంతం కావడం లేదు. ఈ ఆసుపత్రి పనులు పూర్తయితే గిరిజనులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతుంది. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించాలి.

- ఎం.లక్ష్మణరావు, అధ్యక్షుడు, జిల్లా గిరిజన సంఘం

===============================

ఏపీఎంఐడీసీ డీఈ ఏమన్నారంటే..

‘మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు 70శాతం వరకు పూర్తయ్యాయి. వాటికి సంబంఽధించి బిల్లులు చెల్లించాం. ఇటీవల చేపట్టిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆసుపత్రి నిర్మాణం పూర్తికి సంబంధిత సంస్థ ఈఏడాది అక్టోబరు వరకు గడువు కోరుతోంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.’ అని ఏపీఎంఐడీసీ డీఈ సిమ్మన్న తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 12:20 AM