Share News

Meal Be Provided? పట్టెడన్నం పెట్టేదెప్పుడు?

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:54 PM

When Will a Square Meal Be Provided? సాలూరులో అన్న క్యాంటీన్‌ భవన నిర్మాణం పూర్తయినా.. ప్రారంభానికి నోచుకోవడం లేదు. కోర్టులో స్థల వివాదం నడుస్తుండడమే ఇందుకు కారణం. మొత్తంగా పేదలు, గిరిజనులు పట్టెడన్నం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు

  Meal Be Provided?   పట్టెడన్నం పెట్టేదెప్పుడు?
ప్రారంభోత్సవానికి నోచని అన్న క్యాంటీన్‌ భవనం

  • సాలూరులో ప్రారంభానికి నోచని అన్న క్యాంటీన్‌

  • మంత్రి ఆదేశించినా చొరవ చూపని అధికారులు

  • నాణ్యమైన భోజనం కోసం పేదల ఎదురుచూపు

సాలూరు, ఏప్రిల్‌22(ఆంధ్రజ్యోతి): సాలూరులో అన్న క్యాంటీన్‌ భవన నిర్మాణం పూర్తయినా.. ప్రారంభానికి నోచుకోవడం లేదు. కోర్టులో స్థల వివాదం నడుస్తుండడమే ఇందుకు కారణం. మొత్తంగా పేదలు, గిరిజనులు పట్టెడన్నం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అంశంలో తప్పెవరిది? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొత్తంగా మంత్రి సంధ్యారాణి ఇలాఖాలోని అన్న క్యాంటీన్‌ విషయంలో ఇటువంటి సమస్య నెలకొనడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

వాస్తవంగా సాలూరు నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ. విద్య, వైద్యంతో పాటు ఏ చిన్న పనికైనా సాలూరు వస్తుంటారు. వారితో పాటు సామాన్యులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఇలా ఎంతోమంది వివిధ పనుల కోసం పట్టణానికి వస్తుంటారు. అయితే వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్న క్యాంటీన్‌కు స్థల సేకరణ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోనే సర్వే నెంబర్‌ 162/2లో సుమారు 1200 చదరపు గజాలను ప్రభుత్వ స్థలంగా సాలూరు రెవెన్యూ అధికారులు చూపించారు. దీంతో రాష్ట్రంలోనే తొలిసారిగా 2024, ఆగస్టు 14న పట్టణంలో అన్న క్యాంటీన్‌ భవన నిర్మాణానికి మంత్రి సంధ్యారాణి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం సుమారు రూ.60 లక్షల మంజూరు చేయడంతో చురుగ్గా నిర్మాణం చేపట్టారు. అయితే భవనం పనులు పూర్తయిన తర్వాత అన్న క్యాంటీన్‌కు కేటాయించిన స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో నెలలు గడుస్తున్నా స్థల వివాదం కొలిక్కి రాకపోవడంతో అన్న క్యాంటీన్‌ ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. అయితే ఈ అంశంలో రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారన్నది? ప్రశ్నార్థకంగా మారింది. త్వరగా సమస్య పరిష్కరించాలని మంత్రి ఆదేశించినా వారు స్పందించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన అన్న క్యాంటీన్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఆ బాధ్యత రెవెన్యూ అధికారులదే..

సాలూరు అన్న క్యాంటీన్‌ స్థల వివాదానికి సంబంధించి వచ్చే నెల 7న బొబ్బిలి న్యాయస్థానంలో వాయిదా ఉంది. ఇప్పటికే అనేక వాయిదాలకు హాజరయ్యాం. ప్రభుత్వ స్థలం అవునా? కాదా? అని చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది.

- రత్నకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, సాలూరు

======================================

త్వరలోనే ప్రారంభిస్తాం

సాలూరులో త్వరలోనే అన్న క్యాంటీన్‌ ప్రారంభం కానుంది. పూర్తిగా ప్రభుత్వ స్థలం కావడంతోనే అన్న క్యాంటీన్‌కు మంజూరు చేశాం. అయితే ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఆ స్థలంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం బొబ్బిలిలో వాయిదాలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ వివాదం కొలిక్కి రానుంది.

- ఎం.సురేష్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌, సాలూరు

========================================

తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు..

విద్య, వైద్యం.. ఏ అవసరాలకైనా నియోజకవర్గంలోని గిరిజనులు, పేదలు సాలూరుకు వస్తుంటారు. ఇటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో పట్టణంలో అన్న క్యాంటీన్‌ శంకుస్థాపన చేసి.. నిర్మాణం కూడా పూర్తి చేశాం. అయితే వైసీపీ నాయకులు.. వారి అనుచరులతో ఇలా తప్పుడు కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసం. పేదవారికి కడుపునిండా భోజనం పెట్టాలనుకోవడం తప్పా.

- గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి

Updated Date - Apr 22 , 2026 | 11:54 PM