Share News

రైతు బజారు ఏర్పాటు ఎప్పుడో?

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:31 AM

నియోజకవర్గ కేంద్రం బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు కలగా మారింది.

 రైతు బజారు ఏర్పాటు ఎప్పుడో?
మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న దృశ్యం

-హామీలతో సరిపెడుతున్న పాలకులు

- బొబ్బిలిలో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు

- విక్రయదారులు, వినియోగదారులకు తప్పని అవస్థలు

బొబ్బిలి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రం బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు కలగా మారింది. ప్రతిసారీ ఎన్నికల ముందు రైతు బజారు ఏర్పాటు చేస్తామని నాయకులు హామీలు ఇవ్వడం.. గెలిచిన తరువాత మరచిపోవడం పరిపాటిగా మారింది. రైతు బజారు లేక వివిధ రోడ్లు, కూడళ్ల వద్ద కూరగాయలను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విక్రయదారులతో పాటు వినియోగదారులకు కూడా అవస్థలు తప్పడం లేదు. బొబ్బిలి పట్టణంలో సుమారు 75 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వివిధ మండలాలకు చెందిన వందలాది కుటుంబాలు ఈ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచి సుమారు పది మండలాలకు ప్రభుత్వ ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇతర వర్గాల వారు రాకపోకలను సాగిస్తుంటారు. అయితే బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడంతో వారంతా కూరగాయల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రైతులు తాము పండించే కూరగాయలను అమ్ముకునేందుకు పాట్లు పడుతున్నారు. పట్టణంలోని చినబజారు జంక్షన్‌ వద్ద, మునిసిపల్‌ కార్యాలయ సమీపంలో, కాలేజీ రోడ్డులో, కృష్ణాటాకీస్‌ జంక్షన్‌లో ఇలా పలు కూడళ్లలో ఎండలోనే కూరగాయలను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. రైతు బజారు లేకపోవడంతో చాలామంది రైతులు తక్కువ ధరకు దళారీలకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దళారీలు మాత్రం అధిక ధరకు కూరగాయలను విక్రయిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ఏఎంసీ చైర్మన్‌ ఇంటి గోపాలరావు చొరవతో స్థానిక డీసీఎంస్‌ గోదాముల స్థలంలో తాత్కాలికంగా షెడ్లను నిర్మించి రైతు బజారును ఏర్పాటు చేశారు. అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. తాత్కాలిక రైతు బజారును పూర్తిగా ఎత్తివేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన కొత్తలో స్థానిక మేదరబంద షాపింగ్‌ కాంప్లెక్స్‌ వెనుక గల బందను మట్టితో పూడ్చి చదును చేసి రైతు బజారు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నాయకులు హడావుడి చేశారు. అయితే, చెరువులు, బందలను పూడ్చకూడదనే నిబంధన ఉండడంతో ఆ ప్రతిపాదన కాస్త బుట్టదాఖలైంది. దాదాపు పదేళ్లు దాటుతున్నప్పటికీ శాశ్వత ప్రాతిపదికన రైతు బజారును ఏర్పాటు చేయడంలో నాయకులు, అధికారులు విఫలమయ్యారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రైతు బజారును ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. దీంతో బొబ్బిలిలో ఏర్పాటవుతుందనే ఆశ ప్రజల్లో నెలకొంది.

వృథాగా భవనాలు..

బొబ్బిలి పట్టణంలోని మెయిన్‌ రోడ్డులో రెండు వసతి గృహాల (పోలీసు స్టేషన్‌ రోడ్డులో, ఆర్టీసీ కాంప్లెక్స్‌ దరి దేశతల్లి గుడి పక్కన) భవనాలతో పాటు ఆర్‌అండ్‌బీ అతిథి గృహ భవనాలు వృథాగా పడి ఉన్నాయి. ఆ భవనాలు శిథిలమైపోయి విషసర్పాలకు నిలయంగా మారాయి. అత్యంత విలువైన ఆ స్థలాలను రైతుబజారు వంటి వాటికి వినియోగించుకోకుండా వృథాగా వదలేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతు బజారు ఏర్పాటు చేయాలి

బొబ్బిలిలో రైతు బజారును ఏర్పాటు చేయాలి. దీనివల్ల సరసమైన ధరలకు పలు రకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కూరగాయలు పండించే రైతులకు కూడా ఎంతో ఇబ్బందులు తప్పుతాయి. దళారీల ప్రమేయం కూడా తగ్గుతుంది.

-జీవీ రమణ, ఉపాధ్యాయుడు

స్థల సేకరణకు కసరత్తు

నియోజకవర్గానికి ఒకటి చొప్పున రైతు బజారును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దీని ప్రకారం బొబ్బిలి, నెలిమర్ల, కొత్తవలస, జామిలో రైతు బజార్లను ఏర్పాటు చేస్తాం. భోగాపురంలో రూ.70లక్షలతో రైతుబజారు నిర్మాణ జరుగుతోంది. బొబ్బిలిలో ఏర్పాటు కోసం ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. గతంలో ఎంపిక చేసిన స్థలాలపై సాంకేతిక సమస్యలు ఉన్నాయి. తగిన స్థలం ఎంపిక చేసి అప్పగించాలని రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టరు ఆదేశాలిచ్చారు. స్థల సేకరణ కోసం కసరత్తు జరుగుతోంది. బొబ్బిలి పట్టణంలో శిథిలమైన ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన స్థలాలను రైతుబజారు కోసం కేటాయించాలని కలెక్టర్‌ను కోరాం.

-అశోక్‌, మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు, విజయనగరం

Updated Date - Feb 07 , 2026 | 12:31 AM