Share News

మొక్కలను నాటేదెప్పుడు?

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:33 PM

ఎన్నికల నిర్వహణ కోసం పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేశారు. నరికేసిన చెట్ల స్థానంలో కొత్తగా మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు.

   మొక్కలను నాటేదెప్పుడు?
గ్రోత్‌సెంటర్‌లో నరికేసిన చెట్లను చూపిస్తున్న పలు గ్రామాల సర్పంచ్‌లు (ఫైల్‌)

- ఎన్నికల కోసం గ్రోత్‌సెంటర్‌లో చెట్లను నరికేసిన వైనం

- వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతామన్న అధికారులు

- రెండేళ్లు అవుతున్నా పత్తాలేదు

ఎన్నికల నిర్వహణ కోసం పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేశారు. నరికేసిన చెట్ల స్థానంలో కొత్తగా మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. అయితే, రెండేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదు. అప్పట్లో హామీ ఇచ్చిన అధికారులెవరూ ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. ఇదేనా పచ్చదనం-పర్యావరణ పరిరక్షణపై అధికార యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధి అని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

బొబ్బిలి మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో తాత్కాలికంగా ఆర్డీవో కార్యాలయాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2024లో జరిగిన జనరల్‌ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల స్ర్టాంగ్‌ రూమ్‌ (భద్రపరిచే గది), ఎన్నికల సిబ్బందికి మెటీరియల్‌ పంపిణీ కోసం ఆర్డీవో కార్యాలయాన్ని అప్పటి అధికారులు ఎంపిక చేశారు. వాస్తవానికి బొబ్బిలిలోని ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు కళాశాలలో ప్రతీ ఎన్నికల నిర్వహణ జరుగుతుండేది. అయితే, ఈ కళాశాల టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావుకు చెందినది కావడంతో అప్పట్లో అందులో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జరపకూడదని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా పట్టణంలోని పలు విద్యాసంస్థలను అధికారులు పరిశీలించారు. ఎక్కడా అనువుగా లేకపోవడంతో ఆర్డీవో కార్యాలయంలోనే స్ర్టాంగ్‌ రూమ్‌, సిబ్బంది మెటీరియల్‌ పంపిణీ కేంద్రాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం కార్యాలయ ఆవరణలో రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న టేకు, చింత, ఉసిరి, వేప వంటి విలువైన చెట్లను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని చదును చేశారు. ఈ విషయం గ్రోత్‌సెంటర్‌ పరిసర పంచాయతీలైన మెట్టవలస, గొర్లె సీతారాంపురం, ఎం.బూర్జివలస, కొత్తపెంట సర్పంచ్‌లకు తెలిసింది. హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. గ్రోత్‌సెంటరులోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తమ గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, ఈ తరుణంలో ఉన్న కొద్దిపాటి చెట్లను తొలగించడం సరికాదని అప్పటి ఆర్డీవో ఎ.సాయిశ్రీ, తహసీల్దార్‌ త్రినాథరావునాయుడు, అటవీ శాఖాధికారులకు ఎంతగా మొరపెట్టినప్పటికీ వారు వినలేదు. ఎన్నికల నిర్వహణే ముఖ్యమని, నరికేసిన చెట్ల స్థానంలో కొత్తగా మొక్కలు నాటుతామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారులు సైతం మారిపోయారు. కానీ, నరికేసిన చెట్ల స్థానంలో కొత్తగా మొక్కలు మాత్రం ఎవరూ నాటడం లేదు.

మొక్కలను నాటాలి

ఎన్నికల నిర్వహణ కోసం బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో ఉన్న చెట్లను అధికారులు నరికి వేయించారు. దీనిపై పర్యావరణ ప్రేమికులమంతా అభ్యంతరం వ్యక్తం చేశాం. అయినా చెట్ల నరికివేత ఆగలేదు. ఇప్పటికైనా వాటి స్థానంలో మొక్కలను నాటి పెంచాలి. గ్రోత్‌సెంటర్‌ ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి. ఇందుకు మా సంస్థ తరఫున అధికారులకు సహకారం అందిస్తాం.

- ఎస్‌వీ రమణమూర్తి, గ్రీన్‌బెల్ట్‌ సొసైటీ అధ్యక్షుడు, బొబ్బిలి

కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తా

గ్రోత్‌సెంటర్‌ పరిధిలో చెట్లను నరికిన విషయాన్ని కలెక్టర్‌, అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్తా. ఆ స్థలాన్ని మొక్కల పెంపకం కోసమే కేటాయించినందున మళ్లీ అక్కడ పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

-జయచంద్ర, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌, ఏపీఐఐసీ

Updated Date - Mar 21 , 2026 | 11:33 PM