When the time is up... that's it! కాలం చెల్లితే..అంతే!
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:28 AM
When the time is up... that's it! మూడు రోజుల కిందట రాజాం వస్త్రపురికాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 400 ఇళ్లను జల్లెడ పట్టారు. కాలం చెల్లిన, సరైన పత్రాలు లేని 21 వాహనాలను సీజ్ చేశారు. అయితే ఒక్క రాజాంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్‌లో భాగంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. కాలం చెల్లిన, సరైన పత్రాలు లేని వేలాది వాహనాలను సీజ్ చేస్తున్నారు.
కాలం చెల్లితే..అంతే!
కార్డెన్ సెర్చ్‌లో పట్టుబడుతున్న వాహనాలు
15 ఏళ్లు దాటితే ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి
అలా చేయకుండా రోడ్డుపైకి వస్తే కేసులు, జరిమానా
పోలీసు తనిఖీలు విస్తృతం
రాజాం, జూన్ 22(ఆంధ్రజ్యోతి):
మూడు రోజుల కిందట రాజాం వస్త్రపురికాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 400 ఇళ్లను జల్లెడ పట్టారు. కాలం చెల్లిన, సరైన పత్రాలు లేని 21 వాహనాలను సీజ్ చేశారు. అయితే ఒక్క రాజాంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్‌లో భాగంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. కాలం చెల్లిన, సరైన పత్రాలు లేని వేలాది వాహనాలను సీజ్ చేస్తున్నారు. అయినా సరే కాలం చెల్లిన వాహనాల వినియోగం జిల్లాలో తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ వాహనాల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పోలీస్, రవాణా శాఖకు కీలక ఆదేశాలిచ్చింది. ఇక కాలం చెల్లిన వాహనాలతో రోడ్డుపై దొరికితే భారీ జరిమానాతో పాటు కేసులు ఖాయమని తెలుస్తోంది.
జిల్లాలో రవాణా వాహనాలు 60 వేలు ఉన్నాయి. రవాణేతర వాహనాలు 5 లక్షల వరకూ ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కాలం చెల్లిన వాహనాలు చాలా ఉన్నాయి. ఎలాంటి వాహనమైనా దాని కాలపరిమితి 15 ఏళ్లే. అంతకు మించి తిప్పరాదన్న విషయం చాలామందికి తెలియదు. ఒకవేళ 15 ఏళ్లు దాటితే ఫిట్నెస్ పరీక్షలు చేయించాకే రోడ్డు మీదకు తేవాల్సి ఉంటుంది. జిల్లాలో పాత ద్విచక్ర వాహనాలను, కార్లను వేరే రాష్ట్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్కడి రిజిస్ర్టేషన్ నంబర్‌తో ఇక్కడ తిప్పుతున్నారు. పేరొందిన కంపెనీ వాహనాల గడువు ముగిసినా.. రీ మోడల్ చేసి నడుపుతున్నారు. అటువంటి వాహనాలపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సైతం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది.
ఫీజులిలా..
వాహనం 15 ఏళ్లు దాటితే కాలం చెల్లినదే. ఆపై ఫిట్నెస్‌తో పాటు ఇతర రుసుంలు చెల్లించి రెన్యూవల్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ ఫీజు, గ్రాంట్, రెన్యూవల్ ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాల్లో రుసుం చెల్లించాలి. తరువాత ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. అలా అనుమతి పొందిన తరువాతే రోడ్లపైకి రావాలి.
ఫ మోటారుసైకిల్ 15-20 సంవత్సరాల్లోపు రూ.1500, అంతకు మించితే రూ.3 వేలు చెల్లించాలి.
ఫ ఆటో, క్యాబ్ అయితే 20 సంవత్సరాల్లోపు రూ.4,500, అంతకు మించితే రూ.9 వేలు చెల్లించాలి.
ఫ నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి భారీ వాహనాలైతే రూ.17,500 నుంచి రూ.28 వేల వరకూ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి జీఎస్టీ అదనం. అన్నిరకాల ఫిట్నెస్ పరీక్షలు పూర్తయిన తరువాతే రోడ్డుపైకి తేవాలి.
జాగ్రత్తగా ఉండాలి
కాలం చెల్లిన వాహనాల విషయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. 15 ఏళ్లు దాటినవి కాలం చెల్లిన కింద వస్తాయి. వాహనదారులు విధిగా పత్రాలు కలిగి ఉండాలి. ఇతర రాష్ట్రాల రిజిస్ర్టేషన్‌తో తిప్పుదామంటే కుదరదు. రాజాం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టి వాహన తనిఖీలు చేస్తున్నాం. ఇంతవరకు వేలాది ద్విచక్రవాహనాలను పట్టుకున్నాం. ఆధారాలు ఉంటే స్టేషన్‌కు తీసుకొని వస్తే పరిశీలించి వాహనాలను అప్పగిస్తాం.
- కె.అశోక్‌కుమార్, సీఐ, రాజాం