Share News

When the plane arrived.. this ground trembled విమానం చేరిన వేళ.. పులకించెను ఈ నేల

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:58 PM

When the plane arrived.. this ground trembled ఉత్తరాంధ్ర వాసుల కల ఫలించింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ఆదివారం ఉదయం 11 గంటలకు ల్యాండ్‌ అయ్యింది. వ్యాలిడేషన్‌ (టెస్ట్‌) ఫ్లైట్‌ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది.

When the plane arrived.. this ground trembled విమానం చేరిన వేళ.. పులకించెను ఈ నేల
భోగాపురం చేరిన ఎయిర్‌ ఇండియా విమానం

విమానం చేరిన వేళ.. పులకించెను ఈ నేల

భోగాపురంలో ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

విమానం నుంచి అభివాదం చేస్తూ దిగిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

ఘన స్వాగతం పలికిన కూటమి ప్రజాప్రతినిధులు

అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

జూన్‌ 26న జాతికి అంకితం చేసే అవకాశం

విజయనగరం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర వాసుల కల ఫలించింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ఆదివారం ఉదయం 11 గంటలకు ల్యాండ్‌ అయ్యింది. వ్యాలిడేషన్‌ (టెస్ట్‌) ఫ్లైట్‌ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు వచ్చారు. అప్పటికే విమానాశ్రయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజుతో పాటు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ఎస్పీ ఘన స్వాగతం పలికారు. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. అక్కడ ఉద్విగ్నభరిత వాతావరణం కనిపించింది. స్థానిక ప్రజలు గట్టిగా వెల్‌కం చెప్పారు. ప్రతిఒక్కరి కళ్లల్లో ఆనందం కనిపించింది. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో నిర్మాణ సంస్థ జీఎంఆర్‌ ప్రతినిధులు, పౌర విమానయాన శాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ముహూర్తం ఖరారు

ట్రయల్‌ రన్‌కు సంబంధించి చాలా రోజుల కిందటే జీఎంఆర్‌ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. పౌర విమానయాన శాఖతో కలిపి ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి గత నెలలోనే ఈ ట్రయల్‌ రన్‌ జరగాలి. వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. 96 శాతం పనులు పూర్తికావడంతో జూన్‌ 26న విమానాశ్రయం ప్రారంభించేందుకు మూహూర్తంగా నిర్ణయించినట్టు జీఎంఆర్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం ఉంటుందని చెప్పారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం

ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా వృద్ధి చెందేందుకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ట్రయల్‌ రన్‌ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో త్వరితిగతిన పనులు జరిగితే ఈ పాటికే విమానం ఎగిరేదన్నారు. కార్గో అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, మూడు జిల్లాల స్థానిక ఉత్పత్తులను కార్గో ద్వారా దేశ, విదేశాలకు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. గతంలో ఉత్తరాంధ్రలో ఏవైనా ప్రాజెక్టులు ప్రారంభిస్తే పూర్తవుతాయో? కావో? అన్న విమర్శలు ఉండేవని చెప్పారు. ఆ విమర్శలకు సమాధానంగా ఎయిర్‌పోర్టు నిర్మించి జాతికి అందించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. కేంద్రమంత్రిగా తన హయాంలో భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్‌ అవ్వడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

ఇప్పుడేమంటారు జగన్‌?

బుర్రలేని వాళ్లే భోగాపురంలో ఎయిర్‌పోర్టు కడతారని వ్యాఖ్యానించిన జగన్మోహన్‌రెడ్డి ముందుగా ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ విషయంలో ప్రతిపక్ష నేత ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు అభివృద్ధి దగ్గర చేసిన ఘనత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఇప్పటి కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయని మంత్రి గుర్తు చేశారు.

జిల్లా చరిత్రలో చారిత్రక ఘట్టం

ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో క్రియశీలక పాత్ర పోషించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం విజయనగరం జిల్లా చరిత్రలో చారిత్రక ఘట్టమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తన పార్లమెంటరీ పరిధిలో ప్రతిష్టాత్మకమైన ఎయిర్‌పోర్టు టెస్టింగ్‌ ప్లైట్‌ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

ప్రజలంతా బాగుండాలనే..

ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూసపాటి అశోక్‌ గజపతిరాజు కోరుకుంటారని, ఇందులో భాగంగానే ఎడ్యుకేషన్‌ నాలెడ్జ్‌ అకాడమీ కోసం వెయ్యికోట్ల రూపాయల విలువైన 136 ఎకరాలను మాన్సాస్‌ ట్రస్ట్‌నుంచి ఉచితంగా ఇచ్చారని ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు గుర్తుచేశారు. జనవరి 4వ తేదీ జిల్లాలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

Updated Date - Jan 04 , 2026 | 11:58 PM