Share News

When It Rains, They Tremble! వానొస్తే.. వణుకే!

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:18 AM

When It Rains, They Tremble! పేరుకే పట్టణాలు.. కానీ చిన్నపాటి వర్షం పడితే చాలు.. శివారు ప్రాంత కాలనీలన్నీ చెరువులను తలపిస్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ మవుతాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారులు, కూడళ్లలోనూ వర్షపునీరు నిలిచిపోతుంది.

When It Rains, They Tremble!  వానొస్తే.. వణుకే!
ముంపులో సాలూరులో శివారు ప్రాంత కాలనీ (ఫైల్‌)

  • లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

  • చెరువులను తలపిస్తున్న కాలనీలు

  • ఏటా ప్రజలకు తప్పని ఇబ్బందులు

  • శాశ్వత చర్యలు శూన్యం

పాలకొండ/సాలూరు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): పేరుకే పట్టణాలు.. కానీ చిన్నపాటి వర్షం పడితే చాలు.. శివారు ప్రాంత కాలనీలన్నీ చెరువులను తలపిస్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ మవుతాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారులు, కూడళ్లలోనూ వర్షపునీరు నిలిచిపోతుంది. నివాస ప్రాంతాల్లో చేరిన వర్షపు నీరు రెండు, మూడు రోజుల వరకు కదలదు. దీంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక నరకం అనుభవిస్తున్నారు. సాలూరు, పార్వతీపురం మున్సిపాల్టీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలోనూ ఇదే దుస్థితి. ఏటా వర్షాకాలంలో పురప్రజలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం విరివిగా వానలు కురుస్తున్న నేపథ్యంలో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం పూర్తిగా రాకముందే ఉన్నతాధికారులు స్పందించి ముంపు సమస్య నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.

నగర పంచాయతీలో ఇలా..

పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. పట్టణంలోని గారమ్మకాలనీ, రెల్లివీధి, మేదరవీది, గాయత్రీకాలనీ, ఎన్‌ఎస్‌ఎన్‌ కాలనీ తదితర ప్రాంతాలు లోతట్టులో ఉన్నాయి. ఇప్పటికీ మెరుగైన రహదారి సౌకర్యం కూడా లేదు. మురుగు కాలువలు కూడా సక్రమంగా లేవు. కాలువలు ఉన్నచోట్ల సకాలంలో పూడికలు తీయడం లేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా ప్రదాన రహదారిపైకి వర్షపునీరు నిలిచిపోతుంది. మురుగునీరు కూడా ఇందులోనే కలుస్తుంది. అధిక వర్షం కురిస్తే ఎన్‌ఎస్‌ఎన్‌ కాలనీ, గారమ్మకాలనీ, గాయత్రీనగర్‌లో ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఆ సమయంలో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాలకొండలోని ఏలాం జంక్షన్‌ నుంచి కోటదుర్గమ్మ ఆలయం ప్రధాన రహదారి వరకు ఇరువైపులా ఉన్న మురుగు కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వర్షం పడితే చాలు ప్రధాన రహదారి చెరువును తలపిస్తుంది. పట్టణానికి దూరంగా పంట పొలాల మధ్య ఉన్న జగనన్న కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఇక్కడ రెండు వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే రహదారులను మెరుగుపర్చలేదు. కాలువలను సైతం ఏర్పాటు చేయలేదు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పంటపొలాల్లోని వరదనీరు నేరుగా కాలనీలోకి చేరుతుంది. దీంతో ఈ ప్రాంతవాసులు పట్టణంలోకి రాకపోకలు సాగించలేని దుస్థితి ఏర్పడుతుంది.

సాలూరులో పరిస్థితి ఇదీ..

వర్షాకాలంలో సాలూరుకు ఆనుకుని ఉన్న చెరుకుపల్లి గెడ్డకు వరద పోటెత్తిన ప్రతిసారీ పట్టణవాసులకు అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా రామాకాలనీ, అఫీషియల్‌కాలనీ, లెప్రసీ ఆసుపత్రి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లలోకి కూడా వరదనీరు చేరుతుంది. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వరదనీరు ఉండడంతో ఇటువైపుగా రాక పోకలు సాగించలేని పరిస్థితి. ఆయా ప్రాంతవాసులు పూర్తిగా ముంపులోనే ఉండాల్సిన దుస్థితి. వరదనీటితో పాటు విషసర్పాలు, ఇతరత్రా కీటకాలు కూడా కొట్టుకొస్తుండడంతో వారు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. ప్రధానంగా లెప్రసీ ఆసుపత్రి నుంచి జాతీయ రహదారిపై వరదనీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రతిపాదనలకే పరిమితం

పాచిపెంట మండలం కర్రివలస సమీపంలో వేగావతి నదిపై ఉన్న ఆనకట్ట ద్వారా ప్రధాన ఎడమ కాలువ గుండా చెరుకుపల్లి వరకు నీటి ప్రవాహం వస్తుంది. అయితే ఈ గెడ్డ పట్టణం మీదుగా ప్రవహిస్తుండడంతో కాలనీవాసులకు ముంపు సమస్య తప్పడం లేదు. ఏజెన్సీలోని కొండలపై చినుకు పడినా, ఒడిశా రాష్ట్రంలో వర్షం కురిసినా, కాలువకు గండి పడినా చెరుకుపల్లి గెడ్డకు వరద పోటెత్తుతుంది. దీంతో పట్టణంలోని కాలనీలు ముంపునకు గురువుతున్నాయి. చెరుకుపల్లి గెడ్డ ప్రవాహాన్ని సాలూరు సమీపంలో నెలిపర్తిని ఆనుకుని ఉన్న కృష్ణసాగరం చెరువులో కలిసేటట్టుగా పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటికి గతంలోనే మున్సిపల్‌ పాలకవర్గం ఆమోదం తెలిపింది. అయితే ఇంతవరకు సంబంధిత అధికారులు పనులు చేపట్టకపోవడంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:18 AM