గృహయోగమెప్పుడో?
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:11 AM
రాజాంలోని టిడ్కో గృహాలకు పట్టిన గ్రహణం వీడడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తికావడం లేదు.
- రాజాంలో టిడ్కో ఇళ్లకు గ్రహణం
- ప్రభుత్వాలు మారుతున్నా పూర్తికాని వైనం
- వైసీపీ పాలనలో నిర్లక్ష్యం.. 768 ఇళ్లు రద్దు
- అదే దారిలో కూటమి సర్కారు
- రెండేళ్లవుతున్నా స్పందన లేదు
రాజాంరూరల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాజాంలోని టిడ్కో గృహాలకు పట్టిన గ్రహణం వీడడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తికావడం లేదు. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా.. ఇప్పుడు కూటమి సర్కారు కూడా అదే దారిలో వెళ్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కారు గృహాలను పూర్తి చేయకపోగా, మంజూరు చేసిన వాటిని రద్దు చేసింది. కూటమి ప్రభుత్వంలోనైనా పరిస్థితి మారుతుందని లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా టిడ్కోపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో లబ్ధిదారులు గృహయోగానికి నోచుకోవడం లేదు.
ఇదీ పరిస్థితి..
రాజాం మున్సిపాలిటీకి సంబంధించి టిడ్కో ఇళ్ల కోసం 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కంచరాం గ్రామ సమీపంలో స్థలాన్ని సేకరించింది. ఇక్కడ 1104 టిడ్కో ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. మొదటిదశలో 336 ఇళ్ల పనులు ప్రారంభించారు. మొదటి కేటగిరీ కింద ఉచితంగా 96 ఇళ్లు , రెండో కేటగిరీ కింద రూ.50 వేల బ్యాంకు గ్యారెంటీతో 48 ఇళ్లు, మూడో కేటగిరీ కింద రూ.లక్ష బ్యాంకు రుణ సౌకర్యంతో 192 గృహ నిర్మాణాలు చేపట్టారు. 80 శాతం పనులు పూర్తిచేశారు. ఉడ్‌వర్క్‌తో పాటు ఎలక్ట్రికల్, చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పనులు పూర్తిచేసి లబ్దిదారులకు గృహాలను పంపిణీ చేసే సమయంలో రాష్ట్రంలో 2019లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పెండింగ్ పనులకు బ్రేక్ పడింది. తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే లబ్ధిదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రెండు, మూడు దశల్లో మంజూరు చేసి నిర్మించాల్సిన 768 ఇళ్లను జగన్ సర్కారు రద్దు చేసింది. అదే విధంగా మొదటి దశ టిడ్కో ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 20శాతం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాటు వాటిని పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం కొన్ని నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. టిడ్కో సముదాయ ప్రాంగణం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. లక్షలాది రూపాయల విలువచేసే ఐరన్, సిమెంట్ పోల్స్, ఇతరత్రా మెటీరియల్ ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోతున్నాయి. రద్దు చేసిన 768 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు చెల్లించిన సుమారు రూ.కోటి డిపాజిట్ మొత్తాన్ని నేటికీ వారికి తిరిగి చెల్లించలేదు. అలాగే వారిలో సుమారు 500 మందికి వైసీపీ ప్రభుత్వం ఇళ్లపట్టాలు ఇచ్చింది. కానీ, స్థలాలు మాత్రం చూపించలేదు. ఇటు ఇళ్లు రాక, అటు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటికి అద్దె, బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి వారిపై ఒత్తిడి పెరిగింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకు అధికారులు డిమాండ్ చేస్తుండడంతో ఏమి చేయాలో వారికి తోచడం లేదు.
ఎమ్మెల్యేపైనే ఆశలన్నీ..
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌పైనే టిడ్కో లబ్ధిదారులు గంపెడాశతో ఉన్నారు. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా టిడ్కోపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రికల్, ఉడ్‌వర్క్ పూర్తిచేసి ఇళ్లను తమకు అందించాలని కోరుతున్నారు. రద్దయిన ఇళ్లకు సంబంధించి కొత్త వాటిని మంజూరు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గృహయోగం కల్పించి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు.