When is the promotion? ప్రమోషన్ ఎప్పుడో?
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:37 AM
When is the promotion? పదో తరగతి అర్హతతో దరఖాస్తులకు నాడు ఆహ్వానించిన వీఆర్‌ఏ పోటీ పరీక్షకు ఎంఎస్‌సీ, ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్‌సీ బీఈడీ వంటి పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)లు, బీఎస్‌సీ బీఈడీ, బీటెక్ వంటి అండర్ గ్రాడ్యూషన్ (డిగ్రీలు) చదివిన వారంతా పోటీ పడ్డారు. వీఆర్‌ఏలుగా ఉద్యోగం సాధించారు. అర్హతకు తగ్గ ఉద్యోగం కాకపోయినప్పటికీ డిగ్రీలు చదివామని అహానికి పోకుండా గ్రామ రెవెన్యూ అధికారులకు సహాయకులుగా చేరారు. 12 సంవత్సరాలుగా ప్రమోషన్ మాత్రం రావడం లేదు. గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో వారిలో ఆశలు చిగురించాయి. కాని ఎప్పటికి ఆచరణలో పెడతారో తెలియక అయోమయంలో పడ్డారు.
ప్రమోషన్ ఎప్పుడో?
వీఆర్‌వోలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వీఆర్‌ఏలు
ఉమ్మడి జిల్లాలో 286 మంది వరకు విధుల నిర్వహణ
సుమారు 60 మంది వరకు పూర్తి అర్హులు
పదో తరగతి అర్హతతో దరఖాస్తులకు నాడు ఆహ్వానించిన వీఆర్‌ఏ పోటీ పరీక్షకు ఎంఎస్‌సీ, ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్‌సీ బీఈడీ వంటి పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)లు, బీఎస్‌సీ బీఈడీ, బీటెక్ వంటి అండర్ గ్రాడ్యూషన్ (డిగ్రీలు) చదివిన వారంతా పోటీ పడ్డారు. వీఆర్‌ఏలుగా ఉద్యోగం సాధించారు. అర్హతకు తగ్గ ఉద్యోగం కాకపోయినప్పటికీ డిగ్రీలు చదివామని అహానికి పోకుండా గ్రామ రెవెన్యూ అధికారులకు సహాయకులుగా చేరారు. 12 సంవత్సరాలుగా ప్రమోషన్ మాత్రం రావడం లేదు. గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో వారిలో ఆశలు చిగురించాయి. కాని ఎప్పటికి ఆచరణలో పెడతారో తెలియక అయోమయంలో పడ్డారు.
శృంగవరపుకోట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి):
ఎస్.కోట మండలానికి చెందిన ఓ వ్యక్తి పన్నెండు సంవత్సరాలుగా గ్రామ రెవెన్యూ సహాయకుని(వీఆర్‌ఏ)గా పనిచేస్తున్నాడు. ఈయన డిగ్రీ(బిటెక్) పూర్తిచేసిన సంవత్సరమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఏపీపీఎస్‌సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్) వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ.6 వేల గౌరవవేతనం మాత్రమే చెల్లిస్తారని తెలిసినప్పటికీ రెవెన్యూ డిపార్టుమెంట్‌లో తొందరగా పదోన్నతులు వస్తాయన్న నమ్మకంతో వీఆర్‌ఏ ఉద్యోగ పోటీ పరీక్ష రాసాడు. అర్హత సాధించాడు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌గా 2014లో విధుల్లో చేరాడు. అప్పటి నుంచి గ్రామ రెవెన్యూ అధికారిగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నాడు. పన్నెండు రోజుల క్రితం గ్రామ రెవెన్యూ సహాయకులను గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈమేరకు అర్హత ఉండడంతో ఆయన ఆశ పడుతున్నాడు. ఎప్పటికి ప్రమోషన్ ఇస్తారో అన్నదానిపై స్పష్టత మాత్రం లేదు. ఇలా దాదాపు 90 మంది వరకు ఎదురుచూస్తున్నారు. వీరిలో 60 మందికి అన్ని అర్హతలూ ఉన్నాయి.
డిగ్రీలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో మండల స్థాయి రెవెన్యూ అధికారులు వీరిని కార్యాలయ పనులకు కూడా వాడుకుంటున్నారు. ఇలా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి మండల స్థాయి రెవెన్యూ అధికారి వరకు చెప్పిన పనులన్నింటినీ చేస్తున్నారు. గౌరవవేతనంతో చిన్నపాటి ఉద్యోగమని తెలిసినా ప్రభుత్వ ఉద్యోగం కావడంతో వీఆర్‌ఏ నుంచి వీఆర్‌ఓగా పదోన్నతి లభిస్తుందన్న ఆశతో పనిచేస్తున్నారు. విధుల్లోకి చేరిన నాలుగేళ్ల తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం రూ.10,500 వరకు గౌరవ వేతనం పెంచింది. ఆ తరువాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు వీరితో వెట్టిచాకరీ చేయించుకుంది తప్ప పైసా గౌరవ వేతనం పెంచలేదు. కూటమి ప్రభుత్వం మాత్రం వీఆర్‌ఎలకు వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించేందుకు ఈనెల 4న జీవోఎంఎస్‌నెంబర్ 480ను విడుదల చేసింది. దీంతో వీరిలో ఆశలు మొగ్గ తొడిగాయి.
- గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ)లుగా నియమించేందుకు గత వైసీపీ ప్రభుత్వం 2023 మార్చి 10న ఇంటర్ విద్యార్హత నుంచి డిగ్రీ విద్యార్హతకు మార్పు చేసింది. వీఆర్‌ఏ నుంచి వీఆర్‌ఓలుగా పదోన్నతి పొందేవారికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. డిగ్రీ విద్యార్హత లేకున్నా ఇంటర్ విద్యార్హతతో వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలని సూచించింది. అయితే వీఆర్‌వోగా పదోన్నతి పొందిన ఐదు సంవత్సరాల్లో డిగ్రీ విద్యార్హత చూపించాల్సి వుంది. లేదంటే తిరిగి వీఆర్‌ఎగా రివర్స్ చేయాలన్న ఆదేశాలు వున్నాయి. ఇలా ఇంటర్, డిగ్రీ విద్యార్హతలున్న వీఆర్‌ఏలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 286 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా వీఆర్‌వోలుగా పదోన్నతి పొందేందుకు అర్హులు. అయితే ఈ అర్హతతో పాటు సర్వే అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతతో పాటు ఈ అర్హతలు కూడా వున్న వారికి ప్రభుత్వం పదోన్నతలు కల్పిస్తుంది. ఇలాంటి అర్హత ఉమ్మడి జిల్లాలో 60 మంది వరకు వున్నట్లు సమాచారం. వీఆర్‌ఓల ఖాళీలను బట్టి వీరికి పదోన్నతులు కల్పించనున్నారు.
- ప్రభుత్వం నుంచి కలెక్టర్‌లకు మార్గదర్శకాలు వచ్చినప్పటికీ పునర్వీభజన కారణంగా ఏర్పడిన జిల్లాలన్నింటికీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించే అవకాశం వుంది. త్వరితగతిన పదోన్నతులు కల్పించాలని వీఆర్‌ఏలు కోరుతున్నారు.
------------------