Share News

When did use panasa kalapa విని‘యోగం’ ఎప్పుడో?

ABN , Publish Date - May 15 , 2026 | 12:12 AM

When did use panasa kalapa బొబ్బిలి వీణల తయారీదారులకు అవసరమైన పనస కలపను మూడునెలల క్రితం అటవీశాఖాధికారులు సమకూర్చారు. కానీ తయారీదారులకు ఇంతవరకు అప్పగించలేదు.

When did use panasa kalapa విని‘యోగం’ ఎప్పుడో?
వీణల కేంద్రానికి అటవీశాఖాధికారులు అప్పగిస్తున్న పనస కలప (ఫైల్‌ ఫోటో)

విని‘యోగం’ ఎప్పుడో?

బొబ్బిలి వీణల కేంద్రానికి మూడు నెలల క్రితం వచ్చిన పనస కలప

నేటికీ కళాకారులకు అందివ్వని వైనం

పవన్‌కల్యాణ్‌ కోసం ఎదురుచూపు

అటవీశాఖ అధికారుల బదిలీలతోనూ జాప్యం

బొబ్బిలి వీణల తయారీదారులకు అవసరమైన పనస కలపను మూడునెలల క్రితం అటవీశాఖాధికారులు సమకూర్చారు. కానీ తయారీదారులకు ఇంతవరకు అప్పగించలేదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వచ్చి అందజేస్తారని అధికారులు భావించారు. ఆయనకు ఇటీవల శస్త్రచికిత్స జరగడం, అటవీశాఖాధికారులు, సిబ్బందికి భారీగా బదిలీలు కావడంతో కలపను ఉపయోగించేందుకు అవకాశం లేకుండా పోయింది. త్వరగా అందివ్వాలని కళాకారులు కోరుతున్నారు.

బొబ్బిలి, మే 14(ఆంధ్రజ్యోతి):

అటవీశాఖ అధికారులు సాలూరు, పాచిపెంట ఏజెన్సీ ప్రాంతంలో సుమారు రూ.5 లక్షల విలువ చేసే పనస కలపను సేకరించి బొబ్బిలి వీణల తయారీ కేంద్రానికి ఇటీవల అప్పగించారు. ఎన్నో ఏళ్ల నుంచి పనస కలప కోసం నాయకులను, అధికారులను కాళ్లావేళ్లాపడి బతిమలాడినా వీణల తయారీదారుల సమస్య పరిష్కారం కాలేదు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పనస కలపను సేకరించి నేరుగా గొల్లపల్లి కేంద్రానికి పంపించాలని అటవీశాఖాధికారులను ఆదేశించారు.

బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి ప్రాంతం వీణల తయారీకి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. స్థానిక ఉత్పత్తుల భౌగోళిక గుర్తింపును కూడా పొందింది. పనస చెట్టు కలప నుంచి ఏకండి కర్రతో రూపుదాల్చుకోవడం బొబ్బిలి వీణ ప్రత్యేకత. అలాంటి బొబ్బిలి వీణల తయారీకి అవసరమైన పనస కలపను సేకరించడం కళాకారులకు కత్తిమీద సాములా మారింది. కూటమి ప్రభుత్వ చొరవతో వారి కల ఫలించింది. పనస కలప వచ్చి చేరింది. పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా కలప అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. గొల్లపల్లి వీణల తయారీ కేంద్రంలోనే పనస కలపను భద్రపరిచారు. కళాకారుల చేతికి అందలేదు. ఈ జాప్యానికి అనేక కారణాలున్నాయి. డిప్యూటీ సీఎంకు ఇటీవల శస్త్రచికిత్స కావడం, అటవీశాఖాధికారులు, సిబ్బందికి భారీగా బదిలీలు కావడంతో కలపను అందించే ప్రక్రియ సాగడం లేదు.

ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం చొరవతోనే..

సర్వసిద్ధి రామకృష్ణ, గొల్లపల్లి వీణల తయారీ కేంద్రం ఇన్‌చార్జి

వీణలతయారీ కళాకారుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి పనస కలప మంజూరయ్యేందుకు ఎమ్మెల్యే బేబీనాయన కృషి చేశారు. ఆ తర్వాత అటవీశాఖాధికారులు స్వయంగా తెచ్చి ఇచ్చారు. దశాబ్దాల తరబడి మేమంతా ఎదుర్కొంటున్న సమస్యకు పవన్‌కళ్యాణ్‌ ద్వారా పరిష్కారం చూపారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు

స్వప్న, ఫారెస్ట్‌ బీట్‌ అధికారి

గొల్లపల్లి వీణల తయారీ కేంద్రానికి మా శాఖ తరపున పనస కలపను సమకూర్చాం. ఈ కార్యక్రమం అట్టహాసంగా చేయాలనుకున్న సమయంలో మా అధికారులు, సిబ్బందికి పెద్దఎత్తున బదిలీలు కావడం, డిప్యూటీ సీఎంకు శస్త్రచికిత్స జరగడం వంటి కారణాలతో కాస్త జాప్యం జరిగింది. కొత్త అధికారులు వచ్చారు. త్వరలోనే కళాకారులకు పనస కలప అప్పగింత కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా ఉన్నతాధికారుల ఆదేశాలపై ఆధారపడి ఉంది.

Updated Date - May 15 , 2026 | 12:12 AM