Share News

ఆలయ కమిటీల నియామకమెప్పుడో?

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:29 AM

జిల్లాలోని పలు ప్రధాన దేవాలయాలకు కమిటీలు లేవు.

ఆలయ కమిటీల నియామకమెప్పుడో?
పురాతన సీతారామస్వామి ఆలయం.

- అభివృద్ధికి నోచుకోని చారిత్రక దేవాలయాలు

- పట్టించుకోని దేవదాయశాఖ

- కొన్నిచోట్ల దాతల సహకారంతో నిర్వహణ

- ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం టౌన్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రధాన దేవాలయాలకు కమిటీలు లేవు. గత 12 ఏళ్లుగా కమిటీల నియామకాలు జరగకపోవడంతో ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. చాలా ఆలయాలు దాతల సహాయ, సహకారంతో నడుస్తోన్నాయి. 2012 కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చారిత్రక ఆలయాలకు సంబంధించి అభివృద్ధి కమిటీ చైర్మన్లు, సభ్యుల నియామకం జరిగింది. ఆ తరువాత ఆ నియామకాలు ఆగిపోయాయి. సుమారు రెండేళ్లపాటు దేవదాయశాఖ అధికారులు ఆలయాల అభివృద్ధిని ఏదోలా నెట్టుకొచ్చారు. 2015 తరువాత దేవదాయశాఖ గానీ, తరువాత వచ్చిన ప్రభుత్వాలు గానీ ఆలయ అభివృద్ధి కమిటీలను నియమించలేదు.

జిల్లా కేంద్రంలో పరిస్థితి..

జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. సుమారు 300 ఏళ్ల కిందట బ్రిటిష్‌ వారి పాలనలో సీతారామస్వామి, జగన్నాథస్వామి ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలకు ప్రస్తుతం అభివృద్ధి కమిటీలు లేకపోవడంతో పూజలు, రథయాత్రలు దాతల సహాయంతో జరుగుతున్నాయి. బాటసారుల కోసం నిర్మించిన గాంధీసత్రం నిర్వహణ సైతం సక్రమంగా లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. గాంధీసత్రానికి 12 ఏళ్ల కిందట చైర్మన్‌, సభ్యులు ఉండేవారు. వారి పదవీ కాలం ముగియడంతో కాలక్రమేణా గాంధీ సత్రం నిర్వహణ అధ్వానంగా మారింది. దేవదాయ శాఖాధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అదే విధంగా వందేళ్ల కిందట నిర్మించిన రమాసత్యనారాయణస్వామి, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు కూడా అభివృద్ధి కమిటీలు లేవు. వీటినిర్వహణపై కూడా దేవదాయశాఖ నిర్లక్ష్యం చూపిస్తుండడం పలు విమర్శలకు తావిస్తుంది. దాతల సహాయంతో నిర్మించిన రమాసత్యనారాయణ ఆలయ అభివృద్ధి మాట అటుంచితే, నిర్వహణ అనేది రోజురోజుకూ దిగజారుతోంది. ఫలితంగా ఆలయం శిథిలావస్థకు చేరుకుంటుంది. బెలగాంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దాతల సహకారంతో మూడేళ్ల కిందట పునఃనిర్మించారు.

ప్రభుత్వంపైనే ఆశలు..

ఆలయాలకు అభివృద్ధి కమిటీలను నియమిస్తామని గత వైసీపీ ప్రభుత్వం చెప్పింది. పార్వతీపురంలోని సీతారామ, జగన్నాథ, రమాసత్యనారాయణ, కల్యాణవెంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, గాంధీ సత్రానికి కూడా చైర్మన్‌లను, సభ్యులను నియమిస్తామని అప్పటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రకటించారు. కానీ, ఐదేళ్ల పాలనలో ఎలాంటి నియామకాలు జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా అదే పరిస్థితి. ఇప్పటికైనా ఆలయ కమిటీ చైర్మన్‌లు, సభ్యుల నియామకం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

తక్కువ ఆదాయమే కారణం..

పట్టణంలోని పలు ఆలయాల నుంచి వచ్చే ఆదాయం రూ.5 లక్షల లోపే ఉంటుంది. దీంతో చైర్మన్లు, సభ్యుల నియామకం జరగడం లేదు. గతంలో ఆదాయానికి సంబంధించిన జీవోలు, నిబంధనలు లేకపోవడం వల్ల చైర్మన్లు, సభ్యుల నియామకం జరిగింది.

- రాజారావు, అసిస్టెంట్‌ కమిషనర్‌, దేవదాయశాఖ

Updated Date - Mar 20 , 2026 | 12:29 AM