చదువుకోవాలని మందలిస్తే..
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:17 AM
పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారని గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఓ విద్యార్థి పాల్పడిన ఘటన మంగళవారం చినతోలుమండగూడలో చోటు చేసుకుంది.
చినతోలుమండగూడలో ఘటన
జియ్యమ్మవలస, ఆగస్టు 18 (ఆంధ్ర జ్యోతి): పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారని గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఓ విద్యార్థి పాల్పడిన ఘటన మంగళవారం చినతోలుమండగూడలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చినతోలుమండగూడకు చెందిన బిడ్డిక దినకర్ ఆర్‌ఆర్‌బీ పురంలోని టీడబ్ల్యూఏహెచ్ బాలుర పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువు తున్నాడు. దినకర్ పాఠశాలకు క్రమసరిగా వెళ్లడు. ఎప్పటి కప్పుడు ఉపాధ్యాయుల అనుమతి లేకుండా ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.తిరుపతి, ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు నందేశ్, భారతిలకు ఎప్పటికప్పుడు చెప్పేవారు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు కుమారుడిని పిలిచి బుద్ధిగా చదువుకోవాలని నచ్చజెప్పారు. దీంతో సదరు విద్యార్థి ఇంటి వద్ద ఉన్న గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సమీపంలోని ఆర్‌ఆర్‌బీ పురం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాసుపత్రికి డా.వాసుదేవరావు, డా.రాఘవేంద్ర రిఫర్ చేశారు. అక్కడ విద్యార్ధి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.