What's With This Attitude? ఏంటీ ‘తీరు’వా?
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:24 AM
What's With This Attitude? సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు ప్రధాన వనరు నీటి తీరువా. అయితే దీని వసూళ్లపై రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా బకాయిలు పెరుకుతున్నాయి. మొత్తంగా నిధుల్లేక ప్రాజెక్టుల నిర్వహణ కష్టమ వుతోంది.
జిల్లాలో బకాయిలు రూ. 17.39 కోట్లు
ప్రాజెక్టుల నిర్వహణకు ఇబ్బందులు
జియ్యమ్మవలస, జూలై18(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు ప్రధాన వనరు నీటి తీరువా. అయితే దీని వసూళ్లపై రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా బకాయిలు పెరుకుతున్నాయి. మొత్తంగా నిధుల్లేక ప్రాజెక్టుల నిర్వహణ కష్టమ వుతోంది. ప్రస్తుతం జిల్లాలో నీటి తీరువా బకాయిలు రూ. 17.39 కోట్లకు చేరాయి. పార్వతీపురం డివిజన్‌లో రూ.8.95 కోట్లు , పాలకొండ డివిజన్‌లో రూ.8.43 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. బకాయి ఇంత ఉన్నా వసూలుకు మాత్రం రెవెన్యూశాఖ అంతగా శ్రద్ధ వహించడం లేదు.
ఇదీ పరిస్థితి..
-జిల్లాలో మొత్తం 2,39,179 రైతుల ఖాతాలు ఉన్నాయి. వాటి ద్వారా రావల్సిన మొత్తం పాత బకాయి రూ. 14.24 కోట్లు. దీనికి 6 శాతం వడ్డీ రూ. 85.93 లక్షలు కలిపి మొత్తం పాత బకాయి రూ. 15.10 కోట్లు. ఇందులో గ్రామ రెవెన్యూ అధికారులు వసూలు చేసింది రూ.30.27 లక్షలు. ఇంకా పాత బకాయి రూ. 14.79 కోట్లుగా ఉంది.
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వసూలు చేయాల్సింది రూ.2.67 కోట్లు కాగా కేవలం రూ. 7.26 లక్షలు మాత్రమే రెవెన్యూశాఖ రాబట్టింది. ఇంకా రూ. 2.59 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదిలో రూ. 17.77 కోట్లు బకాయి ఉండిపోయింది. ఇందులో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ. 38.13 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ. 17.39 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
- వాస్తవానికి మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో ఎకరాకు రూ.200, మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఎకరాకు రూ.100 వసూలు చేయాల్సి ఉంది. నీటి తీరువా విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు, ప్రాజెక్టు కమిటీకి, నీటి సంఘాల నాయకులకు అధికారులు పదే పదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు.
మండలాల వారీగా ..
- పాలకొండ డివిజన్‌లో అత్యధికంగా జియ్యమ్మవలస మండలం రూ. 4.28 కోట్లు, పాలకొండ రూ. 2.02 కోట్లు, వీరఘట్టం రూ. 1.86 కోట్లు వరకూ నీటి తీరువా బకాయిలున్నాయి. కురుపాంలో మాత్రం బకాయి రూ. 1.05 లక్షలు మాత్రమే ఉంది.
- పార్వతీపురం డివిజన్‌లో మక్కువ మండలం రూ. 2.55 కోట్లు, గరుగుబిల్లి రూ. 2.26 కోట్లు, పార్వతీపురం రూ.1.45 కోట్లు, బలిజిపేట రూ.1.25 కోట్ల మేర నీటి తీరువా బకాయి లున్నాయి. కొమరాడలో రూ. 5.52 లక్షలు మాత్రమే బకాయి ఉంది.
సర్దుబాటు ఇలా..
నీటి తీరువా అనేది ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెంటైనెన్స్ (ఓఅండ్‌ఎం) కోసం కీలక నిధి. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో ఎకరాకు రూ. 200 చొప్పున ప్రతీ రైతు చెల్లిస్తే ఇందులో రూ. 120 నీటి సంఘాలకు, రూ.40 డిస్ట్రిబ్యూటరీ కమిటీకి, రూ. 30లు ప్రాజెక్టు కమిటీకి, రూ. 10 పంచాయతీలకు అందిస్తారు. ఇక మైనర్ ఇరిగేషన్ విషయానికి వస్తే ప్రతీ ఎకరాకు రూ. 100 రైతు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.90 నీటి సంఘాలకు, రూ. 10 పంచాయతీలకు చెల్లిం చాల్సి ఉంది. కానీ నీటి తీరువా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండడం వల్ల ప్రాజెక్టుల నిర్వహణ కష్టమవుతోంది.
దృష్టి సారిస్తాం
నీటి తీరువా వసూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తాం. గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రతీ వారం టార్గెట్లు ఇచ్చి వసూలు చేయిస్తాం. దీనిపై సమీక్షిస్తాం.
-కామేశ్వరరావు, తహసీల్దార్, జియ్యమ్మవలస మండలం
========================================
ఇబ్బంది పడుతున్నాం
నీటి తీరువా బకాయిలు వసూలు కాకపోవడంతో ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఇబ్బం దులు పడుతున్నాం. కాలువల లైనింగ్ సక్రమంగా లేకపోతే రైతుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది.
- బి.శంకరరావు, ఏఈ, నీటి పారుదలశాఖ