ప్రారంభించి ఏం ప్రయోజనం?
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:31 PM
గత టీడీపీ ప్రభుత్వం 2018-2019 సంవత్సరంలో ఎస్.కోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయిని పెంచింది.
- డయాలసిస్, సేవలకే పరిమితమైన ఎస్.కోట నూతన ఆస్పత్రి
- అందుబాటులోకి రాని మిగిలిన వైద్య సేవలు
- పనులు పూర్తికాలేదని చెప్పి కొత్త భవనాల్లోకి వెళ్లని వైద్యులు
- పాత ఆస్పత్రిల్లోనే రోగులు
ఈ ఏడాది ఫిబ్రవరి 2న శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నూతన భవనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నూతన భవనాల్లో ఉన్న డయాలసిస్ వార్డులో మాత్రమే సేవలు అందుతున్నాయి. రోగులకు మందులు అందించేందుకు ఫార్మసీని నడుపుతున్నారు. మిగిలిన వైద్య సేవలేవీ అందుబాటులోకి తీసుకురాలేదు. పనులు పూర్తికాకుండా అందులోకి తాము ఎలా వెళ్తామని వైద్యాధికారులు అంటున్నారు.
శృంగవరపుకోట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వం 2018-2019 సంవత్సరంలో ఎస్.కోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయిని పెంచింది. కొత్త భవనాల పనులు చేపట్టేలోగా ప్రభుత్వం మారింది. అధికారంలో వచ్చిన వైసీపీ మరోసారి ఆస్పత్రి స్థాయిని పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త భవనాలు, వైద్య ఆరోగ్య పరికరాలు, ఇతర సదుపాయాల కల్పనకు రూ.12.60 కోట్లు కేటాయించింది. 2020 అక్టోబరు 20న పనులకు భూమి పూజ చేశారు. 2022 జనవరి 25 నాటికి పనులు పూర్తికావాల్సి ఉన్నా పునాదుల స్థాయిని కూడా దాటలేదు. కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో తరచూ పనులు ఆగిపోయేవి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి కనీసం గోడలు కూడా కట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత, స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి ఈ ఆసుపత్రి నిర్మాణంపై ప్రత్యక దృష్టి సారించారు. దీంతో పనులు ఊపందుకున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో రూ.2 కోట్లు విలువ చేసే పనులను పక్కన పెట్టారు. ఒక లిఫ్ట్, ఒక ఫ్లోర్‌ను నిర్మించడం లేదు. రెండు లిఫ్ట్‌లకు గాను ఒకటి మాత్రమే నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్థుల భవన నిర్మాణానికి రూ.11.81 కోట్లు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలకు రూ.79లక్షలు అందించారు. మూడో అంతస్థులో కొన్ని గదులను నిర్మించలేదు. భవన నిర్మాణ సమయం ఐదేళ్లకు మించి దాటిపోవడంతో రూ.79 లక్షల విలువ చేసే వైద్య పరికరాలు వెనక్కిపోయే అవకాశం ఉంది.
కొత్త భవనాల్లోకి వెళ్లట్లే..
ఆస్పత్రి నూతన భవనాల్లోకి వెళ్లేందుకు వైద్యులు ఇష్టపడడం లేదు. చిన్న చిన్న పనులను సాకుగా చూపించి తప్పించుకు తిరుగుతున్నారు. వాస్తవానికి నూతన భవనాల్లో చిన్న చిన్న ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు మిగిలి ఉన్నాయి. అన్ని విభాగాలను ఒక్కసారి కాకుండా ఒక్కో గది పూర్తి చేస్తూ ఒక్కో విభాగాన్ని తరలించవచ్చు. ఆ ఆలోచన ఇక్కడ వైద్యులు చేయడం లేదు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శుక్రవారం ఈ నూతన భవనాలను పరిశీలించారు. అప్పగించిన భవనాల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలను ఎందుకు అందించలేదని వైద్యులను నిలదీశారు. అయితే, కాంట్రాక్టరు పనులు పూర్తిచేయలేదని సూపరింటెండెంట్ నీలతో పాటు మిగిలిన వైద్యులు చెప్పారు. డయాలసిస్ కేంద్రాన్ని మాత్రమే ప్రారంభిస్తామని చెప్పిన ఏపీఎంఐడీసీ అధికారులు మొత్తం నూతన భవనాలన్నీ మంత్రి, ప్రజాప్రతినిధులతో ప్రారంభించేశారని అన్నారు. దీనివల్ల తాము మాటలు పడాల్సి వస్తుందని అంటున్నారు.
పాత ఆస్పత్రిలోనే సేవలు..
ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయి పెరగడంతో జనరల్, చిన్నపిల్లలు, గైనిక్, చర్మ, నేత్ర, డెంటల్, ఆర్ధోఫెడిక్ వంటి ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నిరకాల అనుభవం కలిగిన సిబ్బంది పెరిగారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంఎల్‌టీ వంటి కోర్సులు చేసేవారు శిక్షణకు వస్తుండడంతో ఓపీ విపరీతంగా పెరిగింది. కానీ, అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన భవనాల్లోకి వైద్యులు వెళ్లడం లేదు. పాత సామాజిక ఆసుపత్రిలోనే సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సరిపడ గదులు ల్లేవు. అయినా రెండు, మూడు విభాగాలకు చెందిన వైద్యులు ఒకేచోట కూర్చొని పరీక్షలు చేస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం పేరుతో కొన్ని కేసులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వైద్యులు నూతన భవనాల్లో సేవలు అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.