Giving Land? భూములిచ్చినా.. ఏం లాభం?
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:12 AM
What’s the Benefit Despite Giving Land? క్రీడా పాఠశాల నిర్మాణం కోసం రావాడ రామభద్ర పురం గ్రామానికి చెందిన రైతులు తమ జిరాయితీ భూములను ఎన్నో ఏళ్ల కిందట ఐటీడీఏ ద్వారా ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విలువైన స్థలాన్ని దానంగా ఇచ్చారు. అయితే సుమారు ఇరవై నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎటువంటి పనులు చేపట్టకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మినీ స్టేడియం పనులూ జరగని వైనం
ఆవేదనలో భూదాతలు
జూన్ లోగా తేల్చాలని విన్నపం
లేకుంటే ఆ భూముల్లో సాగు చేపడతామని వెల్లడి
జియ్యమ్మవలస,ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): క్రీడా పాఠశాల నిర్మాణం కోసం రావాడ రామభద్ర పురం గ్రామానికి చెందిన రైతులు తమ జిరాయితీ భూములను ఎన్నో ఏళ్ల కిందట ఐటీడీఏ ద్వారా ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విలువైన స్థలాన్ని దానంగా ఇచ్చారు. అయితే సుమారు ఇరవై నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎటువంటి పనులు చేపట్టకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము భూములిచ్చి.. ఏం ఫలితమని వారు ప్రశ్నిస్తున్నారు. జూన్‌లోగా ఏదో ఒకటి తేల్చాలని ఇటీవల వారు ఆ భూముల ప్రాంతంలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకుంటే ఆ ప్రాంతంలో సాగు చేపడతామని అంటున్నారు. మరి దీనిపై అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుం టుంతో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ పరిస్థితి..
- అలమండ పంచాయతీ పరిధి రావాడ రామభద్రపురం గ్రామ గిరిజన సంక్షేమ ఆశ్ర బాలుర ఉన్నత పాఠశాలకు ఆనుకుని 12 మంది రైతులకు చెందిన 12.25 ఎకరాల జిరాయితీ భూమి ఉంది. అయితే గిరిజన విద్యార్థుల కోసం క్రీడా పాఠశాల నిర్మిస్తామని 2002లో అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఎంతో సంతోషంగా భావించిన ఆ గ్రామంలోని 12 మంది రైతులు 2004, సెప్టెంబరులో తమకున్న 12.25 ఎకరాలను దానంగా ఇచ్చేశారు. ఆ తరువాత 2007లో స్పోర్ట్స్ అఽథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌ఏఏపీ) ద్వారా 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ వేశారు. దీంతో తమ పిల్లల భవిష్యత్‌కు పునాది పడిందని భూములు ఇచ్చిన రైతులు సంబర పడ్డారు.
- 2006లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్ ద్వారా వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, శాప్‌కు రూ. 30 లక్షలు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పంపించారు. పెవీలియన్ బిల్డింగ్ , కాంపౌండ్ వాల్ నిర్మాణం, సైట్ లెవెల్ చేయడానికి ఆ మొత్తం వినియోగించాలనుకున్నారు. కానీ నిధులు రాలేదు.
- 2008లో దాతలు ఇచ్చిన స్థలంలో రూ. 22.50 లక్షలతో మినీ స్టేడియం నిర్మించాలని శాప్ అధికారులు అడ్మినిస్ట్రేటివ్ అనుమతి పొందారు. ఇందులో రూ. 10 లక్షలు శాప్ అధికారులు , మరో రూ. 5 లక్షలు ఎంపీ / ఎమ్మెల్యేలు , మిగిలిన రూ. 7.50 లక్షలు స్థానికుల ద్వారా నిధుల సమీకరణకు ఆర్డర్ చేశారు. శాప్ ద్వారా రావల్సిన రూ. 10 లక్షల్లో రూ. 5 లక్షలు విడుదల చేశారు. కానీ మిగిలిన నిధులు సమీకరణకు ఎవరూ స్పందించకపోవడంతో మినీ స్టేడియం నిర్మాణం జరగలేదు. ఆ తరువాత శాప్, ఐటీడీఏ ప్రాజెక్టు, జిల్లా కలెక్టర్లు ఇక్కడకు వచ్చి చూడడం తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వారికి భూదాతలు తమ పరిస్థితి వివరిస్తున్నా.. ఇంతవరకు ఏ పనులూ జరగలేదు.
- ఇటీవల ఇక్కడకు వచ్చిన డీఎస్‌డీవో కె.శ్రీధర్‌రావును భూదాతలు కలిశారు. ‘మా భూములు ఇచ్చిన ఫలితం ఇదేనా?’ అంటూ ప్రశ్నించారు. తమ పిల్లల కోసం స్పోర్ట్స్ స్కూల్ నిర్మిస్తారని ఆశపడినా ఫలితం లేకపోయిందని మండిపడ్డారు. ఈ జూన్‌లోగా తగు చర్యలు తీసుకోకపోతే తమ భూములు వెనక్కి తీసుకుని సాగు చేసుకుని తీరుతామని తేల్చి చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మాకిచ్చే విలువ ఇదేనా?
మా ప్రాంతంలో మినీ స్టేడియం నిర్మిస్తామని, స్పోర్ట్స్ స్కూల్ కడతామని అధికారులు హామీ ఇస్తేనే మా భూములను ఇచ్చాం. అయితే ఇంతవరకు ఎటువంటి చర్యల్లేవు. మాకిచ్చిన విలువ ఇదేనా..?
- ఇ.లక్ష్మి, భూదాత, ఆర్‌ఆర్‌బీ పురం
================================
ఎదురుచూస్తున్నాం..
స్పోర్ట్స్ స్కూల్ నిర్మిస్తామని చెబితే మా భూమి ఇచ్చాం. కానీ అలా జరగలేదు. 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయకుంటే ఆ ప్రాంతంలో సాగు చేసుకుంటాం.
- వి.జగ్గారావు, భూదాత, ఆర్‌ఆర్‌బీ పురం
================================
ప్రభుత్వం స్పందించాలి
గిరిజన విద్యార్థుల కోసం స్పోర్ట్స్ స్కూల్ నిర్మిస్తామని చెబితే 12 మంది రైతులు 11.25 ఎకరాలు జిరాయితీ భూమిని దానంగా ఇచ్చారు. కానీ నేటికీ 24 సంవత్సరాలైనా ఎటువంటి చర్యలు లేవు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.
- ఎ.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు, గిరిజనాభ్యుదయ సంఘం, ఆర్‌ఆర్‌బీ పురం
================================
స్టేడియం నిర్మిస్తాం
దాతలు ఇచ్చిన ప్రాంతంలో మొదటిగా స్టేడియం ఏర్పాటు చేసి క్రీడా కోచ్‌లను నియమిస్తాం. వారితో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తాం. క్రీడా పాఠశాల ఏర్పాటు అనేది మా పరిధిలో లేదు. ప్రభుత్వ ఆదేశాలొస్తే కచ్చితంగా ఏర్పాటు చేస్తాం.
- కె.శ్రీధర్‌రావు, డీఎస్‌డీవో, పార్వతీపురం మన్యం