Share News

Illegal Cattle Transportation పశు అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఏదీ?

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:48 PM

What’s Being Done to Curb Illegal Cattle Transportation? జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డకట్ట పడడం లేదు. స్థానిక సంతల్లో కొనుగోలు చేస్తున్న పశువులను వాహనాల్లో కుక్కి.. యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో ప్రతి వారం జరిగే సంతల నుంచి వందలాది పశువులు కబేళాలకు తరలివెళ్తున్నాయి.

 Illegal Cattle Transportation  పశు అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఏదీ?
పార్వతీపురంలో మార్కెట్‌యార్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పశువులను వాహనం ఎక్కించి రవాణాకు సిద్ధం చేస్తున్న దృశ్యం

  • సంతలు, ఏఎంసీల నుంచే ఇతర ప్రాంతాలకు తరలింపు

  • జిల్లా చెక్‌పోస్టులు, పోలీస్‌స్టేషన్లను దాటుకుని దర్జాగా రవాణా

  • పట్టించుకోని అధికార యంత్రాంగం

పార్వతీపురం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డకట్ట పడడం లేదు. స్థానిక సంతల్లో కొనుగోలు చేస్తున్న పశువులను వాహనాల్లో కుక్కి.. యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో ప్రతి వారం జరిగే సంతల నుంచి వందలాది పశువులు కబేళాలకు తరలివెళ్తున్నాయి. సరిహద్దు ప్రాంతం ఒడిశా రాష్ట్రం రాయగడ, కోరాపుట్‌ జిల్లాల నుంచి పెద్దఎత్తున పశువులు పార్వతీపురం, సాలూరుకు సంతలకు చేరుకుంటున్నాయి. చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన కొంతమంది వ్యాపారులు ముందురోజు ఇక్కడకు చేరుకుంటున్నారు. సంత జరిగే రోజున పశువులను కొనుగోలు చేసి.. వాహనాల్లోకి ఎక్కించి దర్జాగా జిల్లా చెక్‌పోస్టులను దాటుకుంటూ వెళ్తున్నారు. మరికొన్ని పశువులను కాలినడకన పట్టణ సరిహద్దులను దాటించి అక్కడ నుంచి భారీ వాహనాల ద్వారా తరలిస్తున్నారు. మరికొందరు సంతల్లో కొనుగోలు చేసిన పశువులను తొలుత వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ ప్రాంగణాలకు తరలిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచే నేరుగా ఇతర రాష్ర్టాలకు వాటిని పంపిస్తున్నారు. పార్వతీపురం మార్కెట్‌ కమిటీ యార్డు పక్కనే ఉన్న సంతలో కొంతమంది వ్యాపారులు దర్జాగా పశువులను బేరమాడుకుని.. వాహనాల్లో ఎక్కించుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పార్వతీపురం శివారు ప్రాంతం వెంకమ్మపేట జంక్షన్‌ , సాలూరు, విజయనగరం జిల్లా రామభద్రపురం వద్ద ఉన్న చెక్‌పోస్టులు, పోలీస్‌స్టేషన్లను దాటి ఈ వాహనాలు వెళ్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పత్రాలు లేకుండానే..

పశువుల రవాణా చేయాలంటే తప్పనిసరిగా పశువైద్యాధికారి అందించే ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. కానీ ఆ ధ్రువీకరణ పత్రం లేకుండానే పశువులను అక్రమంగా రాష్ర్టాలను దాటి స్తున్నారు. నిబంధనలు పాటించకుండా దర్జాగా చెక్‌పోస్టులను దాటించుకుంటూ కబేళాలకు పశువులను చేరుస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన కొన్ని శాఖల సిబ్బంది, కొంతమంది అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారు. దీంతో పశు అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు మన్యం జిల్లా నుంచి పెద్ద ఎత్తున పశువులు కబేళాలకు తరలిపోతున్నాయి.

అమలు కాని కోర్టు ఆదేశాలు

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డిస్ర్టిక్ట్‌ సొసైటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూవెల్టీ టు యానిమల్స్‌ (ఎస్పీసీఏ) కేంద్రాన్ని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే వాటిని అడ్డుకుని ఆయా కేంద్రాలకు పశువులను తరలించి.. సంరక్షించాలి. ఆ తర్వాత న్యాయ స్థానం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు జిల్లాలో అమలు కావడం లేదు.

అక్రమ రవాణా జరగడం లేదు..

పార్వతీపురం మార్కెట్‌ యార్డు కేంద్రం పక్కనే ఉన్న సంత నుంచి పశువుల అక్రమ రవాణా జరగడం లేదు. పశువైద్యాధికారుల ధ్రువీకరణ పత్రం ఉంటేనే మార్కెట్‌ యార్డు నుంచి పశువులను పంపిస్తున్నాం.

-శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ, పార్వతీపురం

Updated Date - Aug 12 , 2026 | 11:49 PM